Asian Games 2022: అఫ్గానిస్థాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ రద్దు.. టీమ్‌ఇండియాకు స్వర్ణం

Updated : 07 Oct 2023 17:12 IST

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌లో భారత్- అఫ్గాన్ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. టాస్‌ ఓడి అఫ్గాన్‌ మొదట బ్యాటింగ్ చేసింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 18.2 ఓవర్లలో ఆట పూర్తయిన తర్వాత వరుణుడు అంతరాయం కలిగించాడు. అప్పటికి అఫ్గాన్‌ 112/5 స్కోరుతో ఉంది. వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని తేల్చి టోర్నీలో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం గెల్చుకోగా.. అఫ్గాన్‌ రజతం అందుకుంది. క్రికెట్‌లో భారత మహిళల జట్టు కూడా పసిడి పతకాన్ని గెల్చుకున్న సంగతి తెలిసిందే. 

చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ

బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ అదరగొట్టింది. అదిరే ఆటతో ఈ భారత స్టార్‌ జంట ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో దక్షిణ కొరియా జంటపై 21-18, 21-16 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో టీమ్‌ లేదా వ్యక్తిగత విభాగాల్లో భారత్‌ స్వర్ణం గెల్చుకోవడం ఇదే తొలిసారి.

కబడ్డీలో స్వర్ణం.. రెజ్లింగ్‌లో రజతం.. హాకీలో కాంస్యం

కబడ్డీలో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. ఫైనల్‌లో పురుషుల జట్టు ఇరాన్‌ను 33-29 తేడాతో ఓడించి పసిడి పతకాన్ని పట్టేసింది. ఇవాళ ఉదయం భారత మహిళల జట్టు కూడా స్వర్ణం పతకం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెజ్లింగ్‌లో పురుషుల 86 కేజీల ప్రీస్టైల్‌ విభాగంలో దీపక్ పునియా రజతం దక్కించుకున్నాడు. హసన్ యజ్దానీ (ఇరాన్‌)తో జరిగిన ఫైనల్‌లో దీపక్‌ 0-10 తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు, హాకీలో భారత మహిళల జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ జపాన్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. 

చెస్‌లో రెండు రజతాలు

చెస్‌లో భారత్ రెండు రజత పతకాలు సాధించింది. టీమ్‌ ఈవెంట్‌లో పురుషుల, మహిళల జట్లు వెండి పతకాలు అందుకున్నాయి. కోనేరు హంపీ, హారిక ద్రోణవల్లి, వైశాలి, వంతిక, సవితలతో కూడిన మహిళా బృందం రజత పతకాలు అందుకుంది. పురుషుల జట్టులో ప్రజ్ఞానంద, గుకేష్, విదిత్ గుజరాతీ, అర్జున్, హరికృష్ణలు రజతాలు దక్కించుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 107కి చేరింది. ఇందులో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని