Cricket News : గిల్‌కు విశ్రాంతి.. సూర్య ఫినిషర్‌గా రావాలన్న గంభీర్‌!

Updated : 25 Sep 2023 11:43 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను నెగ్గడంతో చివరి మ్యాచ్‌కు గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు సాధించిన సూర్యకుమార్‌ను వరల్డ్‌ కప్‌లో ఫినిషర్‌గా వాడుకోవాలని గౌతమ్‌ గంభీర్‌ సూచించాడు. మరోవైపు కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సోధిని రనౌట్‌ చేసినప్పటికీ.. బంగ్లా కెప్టెన్ వెనక్కి పిలిచిన సంఘటనపై సీనియర్‌ ఆటగాడు తమీమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

ఆ ఇద్దరికి రెస్ట్‌.. 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీ, సెంచరీ బాదిన శుభ్‌మన్‌ గిల్‌కు మూడో మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ భావించింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు కాస్త విరామం ఇస్తే శారీరకంగా, మానసికంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో బెంచ్‌కే పరిమితం చేయనుంది. దీంతో రాజ్‌కోట్‌ వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. గిల్‌తోపాటు పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌కూ రెస్ట్‌ ఇచ్చింది. వీరిద్దరూ నేరుగా గువాహటి చేరుకుని వరల్డ్ కప్‌ సన్నద్ధతలో పాల్గొంటారు. 


ఆరు లేదా ఏడో స్థానంలో సూర్య ఆడాలి: గంభీర్‌

వరల్డ్‌ కప్‌లో సూర్య కీలక పాత్ర పోషిస్తాడని.. అయితే అతడిని ఫినిషర్‌గా వినియోగించుకోవాలని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం వల్ల టీమ్‌కు చాలా ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డాడు. ‘‘సూర్య తుది జట్టులో ఉంటే తప్పకుండా లోయర్‌ ఆర్డర్‌లోనే పంపించాలి. అలాగే ఫైనల్‌ XI టీమ్‌లో ఎక్కువగా మార్పులు చేయకుండా ఉండాలి. 2011 ప్రపంచకప్‌లో తుది జట్టులో మార్పులు చాలా తక్కువగా చేశాం. ఆరంభంలో యూసఫ్‌ పఠాన్‌ ఐదారు మ్యాచ్‌లు ఆడితే.. సురేశ్‌ రైనా మిగతా వాటిల్లో ఆడాడు. అందుకే, సూర్యను తుది జట్టులోకి తీసుకుని ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. అయితే, ఇక్కడ ఐదో స్థానంలో ఎవరు ఆడతారు? అనే ప్రశ్న వస్తుంది. దానికి రవీంద్ర జడేజా ఉన్నాడు. ఆరో స్థానంలో హార్దిక్‌ను ఆడించొచ్చు. సూర్యను మాత్రం ఫినిషర్‌గా చివరి 15 - 20 ఓవర్లలో క్రీజ్‌లోకి పంపిస్తే ఫలితం అద్భుతంగా ఉండొచ్చు’’ అని గంభీర్‌ తెలిపాడు.


సోధిని వెనక్కి పిలవడం సరైందిగా అనిపించలేదు: తమీమ్‌

న్యూజిలాండ్‌ - బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో వన్డే సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై సీనియర్‌ ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కివీస్‌ బ్యాటర్ సోధి నాన్‌స్ట్రైకర్‌ రనౌట్ అయినా సరే కెప్టెన్ లిటన్ దాస్‌ వెనక్కి పిలవడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించాడు. ‘‘సోధి అలా రనౌట్‌ కావడం ఎక్కడా తప్పుగా అనిపించలేదు. ఇప్పుడు అదొక రూల్‌. ఇలా ఎవరినైనా ఔట్ చేయొచ్చు. లేదా మన బ్యాటర్ పెవిలియన్‌కు చేరొచ్చు. ఇక్కడా ఎలాంటి హెచ్చరిక అవసరం లేదు. ఇది కూడా బౌల్డ్ అవుట్‌వంటిదే. అయితే, మా కెప్టెన్ మాత్రం ఇలా వికెట్‌ తీయకూడదని భావించి ఉంటాడు. అందుకే వెనక్కి పిలిచాడు. కానీ, అలా చేయడం సరైందిగా అనిపించడంలేదు’’ అని తమీమ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు