Sri Lanka in Asia Cup 2023: ఆసియా కప్ అంటే చాలు.. శ్రీలంక దూకుడే వేరు..
ఆసియా కప్(Asia Cup 2023)లో శ్రీలంక(Sri Lanka) అదరగొడుతోంది. ఉత్కంఠ పోరులో పాక్‌పై అనూహ్య విజయంతో మరోసారి ఆ జట్టు ఫైనల్ చేరింది.
ఇంటర్నెట్‌డెస్క్: ఆసియా కప్ (Asia Cup)అంటే చాలు.. ఆ దేశం విరుచుకుపడుతుంది. ఎక్కడా లేని ఉత్సాహంతో ఆడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా.. తమకు అనుకూలంగా మార్చుకుంటూ చివరి వరకూ పోరాడి ముందుకు సాగుతుంది. ఆ జట్టే శ్రీలంక (Sri Lanka). చివరి బంతి వరకూ పాక్‌తో ఉత్కంఠగా సాగిన నిన్నటి సూపర్ 4 మ్యాచ్(SL vs PAK)లో అనూహ్య విజయంతో మరోసారి ఫైనల్ (Asia Cup 2023 Final) చేరింది ఈ డిఫెండింగ్ ఛాంపియన్. టీమ్‌ఇండియా (Team India)తో తుదిపోరుకు సిద్ధమైంది. ఇక భారత్(7) తర్వాత అత్యధికంగా ఆరు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన ఆ జట్టు ప్రత్యర్థులకు గట్టి సవాలు విసురుతోంది.
విజయాలతో దూసుకెళ్తూ..
ఈ ఆసియా కప్ (Asia Cup 2023)లో ఇప్పటి వరకూ లీగ్‌లతో కలిపి ఐదు మ్యాచ్‌లు ఆడగా.. శ్రీలంక ఒక్క టీమ్‌ఇండియాపైనే ఓడింది. నాలుగు విజయాలతో ఫైనల్ వరకూ వచ్చింది. లీగ్ దశలో బంగ్లా, అఫ్గాన్‌లపై విజయాలను నమోదు చేయగా.. సూపర్ 4 దశలో రెండు విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక సూపర్ 4 మ్యాచ్‌లో లంకపై రోహిత్ సేన చెమటోడ్చి నెగ్గింది.
టాప్ ఆర్డర్ రాణిస్తూ..
లంక విజయాల్లో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ఎంతో కీలకం. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు(253) చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతోందీ లంక ఆటగాడే. సదీరా సమరవిక్రమ 215 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక కుశాల్.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 92 పరుగులతో విరుచుకుపడగా.. నిన్న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులతో నిలిచాడు. బంగ్లాపై అర్ధ శతకం బాదాడు. నిశాంక కూడా నిలకడగా రాణిస్తున్నాడు.
తనది కాని మ్యాచ్‌లో కూడా..
లీగ్ దశలో సూపర్ 4 బెర్త్ కోసం అఫ్గాన్-శ్రీలంక(AFG vs SL) మధ్య జరిగిన పోరు గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో చివరి వరకూ గెలుపు అవకాశాలు అఫ్గాన్‌కే ఎక్కువగా ఉన్నాయి. అయినా.. పట్టు వదలకుండా పోరాడిన లంక ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి సూపర్-4లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ను దురదృష్టం వెంటాడింది. లంక నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని 37.1 ఓవర్లో ఛేదిస్తే రన్‌రేట్ ప్రకారం.. అఫ్గాన్ సూపర్ 4కు చేరుకుంటుంది. అఫ్గాన్ 37 ఓవర్లకు 289/8తో నిలిచింది. 38వ ఓవర్ తొలి బంతికి 3 పరుగులు చేస్తే అఫ్గాన్ ముందంజ వేసేది. కానీ ఆ బంతికి ముజీబ్ ఔటైపోయాడు. దీంతో అఫ్గాన్ కథ ముగిసిందనే అనుకున్నారు. కానీ రన్‌రేట్ సమీకరణాల ప్రకారం ఆ ఓవర్ నాలుగో బంతి లోపు అఫ్గాన్ స్కోరు 295కు చేరినా ఆ జట్టు గెలిచేదని తేలింది. కానీ ఈ విషయం క్రీజులో ఉన్న బ్యాటర్లకు తెలియలేదు. దీంతో అఫ్గాన్ పనైపోయింది. అయితే.. ఈ మ్యాచ్‌లో చివరి వరకూ పట్టువిడవకుండా శ్రీలంక పోరాడిన తీరు అద్భుతం.
హోమ్ కండిషన్లను ఉపయోగించుకుంటూ..
మొత్తం పాక్‌లో జరగాల్సిన ఈ సిరీస్.. హైబ్రిడ్ ఫార్మాట్ కారణంగా కొన్ని మ్యాచ్‌లు లంకకు చేరాయి. దీంతో స్వదేశంలోని పరిస్థితులను చక్కగా ఉపయోగించుకుంటూ లంక అదరగొడుతోంది. ముఖ్యంగా స్పిన్ పిచ్‌లపై సత్తా చాటుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో తొలి రెండు స్థానాలు లంక బౌలర్లవే. పతిరన 11 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. వెల్లలాగె 10 వికెట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
తక్కువ అంచనా వేయలేం..
పాక్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్ పోరులో భారత్‌తో ఆడేందుకు లంక సిద్ధమైంది. పటిష్ఠ స్థితిలో ఉన్న ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే సూపర్ 4 మ్యాచ్‌లో పాక్‌పై అన్ని విభాగాల్లో రాణించి.. భారత్ భారీ విజయాన్ని నమోదు చేసి.. ఆ మరుసటి రోజే అదే మైదానంలో లంకతో ఆడింది. అయితే.. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై టీమ్‌ఇండియా చెమటోడ్చి నెగ్గాల్సి వచ్చింది. అంతకుముందు పాక్‌తో మ్యాచ్‌లో శతకాలు, అర్ద శతకాలతో చెలరేగిన టీమ్‌ఇండియా బ్యాటర్లు.. లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. మొత్తం పది వికెట్లు స్పిన్నర్లకే దక్కడం గమనార్హం.
అత్యధికసార్లు ఫైనల్ చేరిన జట్టుగా..
ఇక ఆసియా కప్‌లో 7 సార్లు టైటిల్ విజేతగా నిలిచి భారత్ ముందుండగా.. ఆ తర్వాత 6 టైటిళ్లతో లంక రెండో స్థానంలో ఉంది. అయితే.. ఎక్కువ సార్లు ఫైనల్ చేరింది మాత్రం లంక జట్టే. ఇప్పటి వరకూ 12 సార్లు ఆ జట్టు ఫైనల్ చేరగా.. ఆరు విజయాలు.. ఆరుసార్లు రన్నరప్‌గా నిలిచింది. మరోసారి తాజాగా ఫైనల్ చేరింది. ఈ నెల 17న శ్రీలంకలోని కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా.. భారత్ vs శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: భార్య, కుమారుడిని చంపి.. బెయిల్‌పై వచ్చి ఆత్మహత్య
-
Akhilesh : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇంకా టికెట్ రాలేదు.. అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు!
-
Child: మూడేళ్ల చిన్నారికి ‘పేరు’ పెట్టిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..!
-
TSRTC: దసరాకి ఊరెళ్తున్నారా? టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్!
-
Maruti Suzuki: మారుతీసుజుకీ కార్ల విక్రయాల్లో 3 శాతం వృద్ధి..
-
KTR: మీ అవివేకానికి నిదర్శనం: ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్