లంకతోనే మన సమరం

ఆతిథ్య జట్టు సాధించింది. పాకిస్థాన్‌తో హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన శ్రీలంక.. ఆసియా కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Published : 15 Sep 2023 03:09 IST

సూపర్‌-4 మ్యాచ్‌లో పాక్‌ ఓటమి
కుశాల్‌ మెండిస్‌ అద్భుత ఇన్నింగ్స్‌

ఆహా ఏమి ఉత్కంఠ! విజయం ఇరు జట్లతో దోబూచులాడిన మ్యాచ్‌లో చివరికి శ్రీలంకే పైచేయి సాధించింది. కుశాల్‌ మెండిస్‌ (91; 87 బంతుల్లో 8×4, 1×6), అసలంక (49 నాటౌట్‌; 47 బంతుల్లో 3×4, 1×6) ఆతిథ్య జట్టుకు అద్భుత విజయాన్నందించారు. ఫైనల్‌ బెర్తును తేల్చే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ తుది కంటా పోరాడినా చివరికి ఓటమి వైపే నిలిచింది. ఆదివారం తుది పోరులో టీమ్‌ఇండియాను ఎదుర్కోబోయేది లంకేయులే.

కొలంబో

తిథ్య జట్టు సాధించింది. పాకిస్థాన్‌తో హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన శ్రీలంక.. ఆసియా కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను 42 ఓవర్లకు కుదించగా.. మొదట పాకిస్థాన్‌ 7 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహ్మద్‌ రిజ్వాన్‌ (86 నాటౌట్‌; 73 బంతుల్లో 6×4, 2×6) అదిరే ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్‌ను ఆదుకున్నాడు. ఇఫ్తికార్‌ (47; 40 బంతుల్లో 4×4, 2×6), షఫిక్‌ (52; 69 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. పతిరన మూడు వికెట్లు, ప్రమోద్‌ మదుశాన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్లు వెల్లలాగె (1/40), తీక్షణ (1/42) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. డక్‌వర్త్‌-లూయిస్‌ విధానంలో లక్ష్యాన్ని 42 ఓవర్లలో 252 పరుగులకు సవరించగా.. లంక 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా చివరి బంతికి విజయాన్నందుకుంది. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (3/50), షహీన్‌ అఫ్రిది (2/52) ఆ జట్టును దెబ్బ తీశారు. పరుగులు అంత తేలిగ్గా రాని పిచ్‌పై లంక గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (17) దురదృష్టవశాత్తూ రనౌటై వెనుదిరిగినా.. నిశాంక (29), సమరవిక్రమ (48)లతో కలిసి కుశాల్‌ మెండిస్‌ జట్టు ఆశలు నిలబెట్టాడు. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు అంత తేలిగ్గా రాలేదు. కానీ కుశాల్‌ ఒత్తిడిలో అద్భుత షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సమరవిక్రమ కూడా విలువైన పరుగులు సాధించాడు. వీళ్లిద్దరి జోరుతో ఒక దశలో 177/2తో లంక సాఫీగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ పార్ట్‌టైం స్పిన్నర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ (3/50) విజృంభించడంతో లంక వరుసగా వికెట్లు కోల్పోయింది. విజయానికి 43 పరుగులు అవసరమైన స్థితిలో కుశాల్‌.. ఆ తర్వాత శానక (2) కూడా వెనుదిరగడంతో మ్యాచ్‌ పాక్‌ వైపు మొగ్గినట్లు కనిపించింది. అసలంక పోరాటం కొనసాగించినా.. 9 బంతుల్లో 8 పరుగులు అవసరమైన స్థితిలో షహీన్‌ వరుసగా రెండు వికెట్లు తీసి ఉత్కంఠను మరింత పెంచాడు. చివరి ఓవర్లో లంకకు 8 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో జమాన్‌ 2 పరుగులే ఇచ్చాడు. నాలుగో బంతికి మదుశాన్‌ రనౌటయ్యాడు. అయిదో బంతికి అసలంక ఫోర్‌ కొట్టాడు. చివరి బంతికి అతను డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో బంతిని తరలించి 2 పరుగులు తీయడంతో లంక సంబరాల్లో మునిగిపోయింది.

మెరిసిన రిజ్వాన్‌: అంతకుముందు పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో రిజ్వానే ఆటే హైలైట్‌. ఆ జట్టు మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిందంటే కారణం క్లిష్టసమయంలో అతడు ఆడిన కీలక ఇన్నింగ్సే. వర్షం వల్ల ఇన్నింగ్స్‌ను మొదట 45 ఓవర్లకు, ఆ తర్వాత 42 ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌కు మంచి ఆరంభం లభించలేదు. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేని పిచ్‌పై పరుగులు చేయడం కష్టమైంది. అయిదో ఓవర్లో ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (4) ఔటయ్యేటప్పటికి స్కోరు 9 పరుగులే. ఆ తర్వాత మరో ఓపెనర్‌ షఫిక్‌, కెప్టెన్‌ బాబర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. స్కోరు వేగం పెంచి 70 బంతుల్లో 64 పరుగులు జోడించారు. భాగస్వామ్యం బలపడుతున్న దశలో, 16వ ఓవర్లో వెల్లలాగె బౌలింగ్‌లో బాబర్‌ స్టంపౌటయ్యాడు. బాబర్‌ నిష్క్రమణతో పాక్‌ ఇన్నింగ్స్‌ కుదుపునకు లోనైంది. చకచకా మరో మూడు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 28వ ఓవర్లో 130/5తో కష్టాల్లో చిక్కుకుంది. లంక స్పిన్నర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పాక్‌ తక్కువ స్కోరుతో సరిపెట్టుకుందేమో అనిపించింది. కానీ పట్టుబిగించినట్లేనని భావించిన లంక ఆశలపై వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌, ఇఫ్తికార్‌ నీళ్లు చల్లారు. చెలరేగి ఆడిన ఈ జంట కేవలం 78 బంతుల్లో 108 పరుగులు జోడించి పాక్‌ను మెరుగైన స్థితిలో నిలిపింది. నెమ్మదిగా మొదలెట్టిన రిజ్వాన్‌.. క్రమంగా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఆన్‌సైడ్‌ కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. ఇఫ్తికార్‌ కూడా ఎడాపెడా షాట్లు ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 41 ఓవర్లో ఇఫ్తికార్‌ను పతిరన ఔట్‌ చేయడంతో అత్యంత విలువైన ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: షఫిక్‌ (సి) మదుశాన్‌ (బి) పతిరన 52; ఫకర్‌ జమాన్‌ (బి) మదుశాన్‌ 4; బాబర్‌ అజామ్‌ (స్టంప్డ్‌) మెండిస్‌ (బి) వెల్లలాగె 29; రిజ్వాన్‌ నాటౌట్‌ 86; హారిస్‌ (సి) అండ్‌ (బి) పతరన 3; నవాజ్‌ (బి) తీక్షణ 12; ఇఫ్తికార్‌ (సి) శానక (బి) పతిరన 47; షాదాబ్‌ (సి) మెండిస్‌ (బి) మదుశాన్‌ 3; షహీన్‌ అఫ్రిది నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 15  మొత్తం: (42 ఓవర్లలో 7 వికెట్లకు) 252  వికెట్ల పతనం: 1-9, 2-73, 3-100, 4-108, 5-130, 6-238, 7-243 బౌలింగ్‌: ప్రమోద్‌ మదుశాన్‌ 7-1-58-2; తీక్షణ 9-0-42-1; దసున్‌ శానక 3-0-18-0; వెల్లలాగె 9-0-40-1; పతిరన 8-0-65-3; ధనంజయ డిసిల్వా 6-0-28-0

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) అండ్‌ (బి) షాదాబ్‌ 29; కుశాల్‌ పెరీరా రనౌట్‌ 17; కుశాల్‌ మెండిస్‌ (సి) హారిస్‌ (బి) ఇఫ్తికార్‌ 91; సమరవిక్రమ (స్టంప్డ్‌) రిజ్వాన్‌ (బి) ఇఫ్తికార్‌ 48; అసలంక నాటౌట్‌ 49; శానక (సి) నవాజ్‌ (బి) ఇఫ్తికార్‌ 2; ధనంజయ డిసిల్వా (సి) వసీమ్‌ (బి) షహీన్‌ 5; వెల్లలాగె (సి) రిజ్వాన్‌ (బి) షహీన్‌ 0; మదుశాన్‌ రనౌట్‌ 1; పతిరన 0 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (42 ఓవర్లలో 8 వికెట్లకు) 252 వికెట్ల పతనం: 1-20, 2-77, 3-177, 4-210, 5-222, 6-243, 7-243, 8-246; బౌలింగ్‌: షహీన్‌ అఫ్రిది 9-0-52-2; జమాన్‌ ఖాన్‌ 6-1-39-0; వసీమ్‌ 3-0-25-0; నవాజ్‌ 7-0-26-0; షాదాబ్‌ 9-0-55-1; ఇఫ్తికార్‌ 8-0-50-3

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని