
నకిలీ వార్తల కట్టడికి ట్విటర్ మరో కొత్త ఫీచర్
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్లో సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే అసత్య వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆయా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నకిలీ వార్తలను ప్రచారం చేసే పోస్ట్‌లకు ఫేస్బుక్ వార్నింగ్ లేబుల్ ఇస్తుంటే..ట్విటర్ కూడా ఇదే తరహాలో డిస్ప్యూటెడ్ ట్వీట్ (వివాదాస్పదమైన ట్వీట్) పేరుతో హెచ్చరికను జారీ చేస్తుంది. అయితే సోషల్ మీడియా కంపెనీలు నకిలీ లేదా అసత్య వార్తలకు వార్నింగ్ లేబుల్ ఇచ్చినప్పటికీ అవగాహనలేమితో కొందరు యూజర్స్ వాటిని రీపోస్ట్ లేదా రీట్వీట్ చేస్తున్నారట. ఇది సోషల్ మీడియా కంపెనీలకు సమస్యగా మారింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారంగా ట్విటర్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఇక మీదట యూజర్ డిస్ప్యూటెడ్ ట్వీట్ లేదా హెచ్చరికలు జారీ చేసిన ట్వీట్‌ను లైక్, షేర్ లేదా కామెంట్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. అందులో ‘‘ఇది డిస్ప్యూటెడ్ ట్వీట్. నమ్మకమైన సమాచారం అందించే వేదికగా ట్విటర్‌ని ఉంచేందుకు సహాయపడండి. రీట్వీట్ చేసేముందు దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి’’ అని సందేశం కనిపిస్తుంది. పరీక్షల్లో భాగంగా ఇది సత్ఫలితాలనిచ్చిందని, దీని వల్ల 29 శాతం మేర అసత్య వార్తల ప్రచారం తగ్గిందని ట్విటర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారిపై జరిగే తప్పుడు సమాచార వ్యాప్తికి ఇది కొంత వరకు అడ్డుకట్ట వేస్తుందని ట్విటర్ అభిప్రాయపడింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.