పక్షి రెక్కల రహస్యం

పక్షులు గాల్లో ఎలా ఎగురుతాయి? ఇంకెలా.. రెక్కలతో. మరి వీటికి రెక్కలు ఎక్కడ్నుంచి వచ్చాయి? డైనోసార్ల నుంచి! ఆశ్చర్యంగా అనిపించినా పక్షులు గాల్లో ఎగరటానికి తోడ్పడే రెక్కల్లోని నిర్మాణం డైనోసార్ల నుంచి వచ్చిందే.

Published : 15 Mar 2023 00:03 IST

పక్షులు గాల్లో ఎలా ఎగురుతాయి? ఇంకెలా.. రెక్కలతో. మరి వీటికి రెక్కలు ఎక్కడ్నుంచి వచ్చాయి? డైనోసార్ల నుంచి! ఆశ్చర్యంగా అనిపించినా పక్షులు గాల్లో ఎగరటానికి తోడ్పడే రెక్కల్లోని నిర్మాణం డైనోసార్ల నుంచి వచ్చిందే. తాజా అధ్యయనం ఒకటి దీనికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించింది.

ప్రొపటేజియమ్‌ అనే కండర నిర్మాణం

గాల్లో ఎగరగలిగే ఆధునిక పక్షులన్నింటి రెక్కల్లోనూ ప్రొపటేజియమ్‌ అనే ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. పరిణామక్రమంలో భాగంగా ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందనేది ఇప్పటికీ రహస్యమే. తాజా పరిశోధన దీని గుట్టును ఛేదించింది. నేల మీద సంచరించే డైనోసార్లలో ప్రొపటేజియమ్‌ పరిణామం చెందినట్టు బయటపడింది. శిలాజాల్లో భద్రంగా ఉన్న చేతి కీళ్లను గణాంక పద్ధతిలో విశ్లేషించి దీన్ని గుర్తించారు. పక్షులు గాల్లో ఎగరటానికి తోడ్పడుతున్న అంశాలకు సంబంధించి తెలియని విషయాలను ఇది కొంతవరకు పూడుస్తోంది.

అంతుచిక్కని ప్రశ్న

ప్రొపటేజియమ్‌ ఎప్పుడు పుట్టుకొచ్చిందో తెలిసింది సరే. ఇదెలా ఏర్పడింది? వాతావరణ పరిస్థితులను తట్టుకోవటానికి ప్రత్యేకించి థెరోపాడ్‌ డైనోసార్ల జాతులకే దీని అవసరం ఎందుకు ఏర్పడింది? దీన్ని గుర్తించటానికే ఇప్పుడు పరిశోధకులు శిలాజాల నమూనాలు, ఆధునిక సకశేరుకాల పిండాల వృద్ధికి మధ్య ఏదైనా సంబంధం ఉందేమోనని అన్వేషిస్తున్నారు. థెరోపాడ్ల ముందు కాళ్లు వస్తువులను పట్టుకోవటానికే తప్ప ఎగరటానికి అనుగుణంగా తయారైనవి కావు. అందువల్ల ఎగరటాన్ని నేర్చుకోవటం కోసం ప్రొపటేజియమ్‌ ఏర్పడి ఉండకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

డైనోసార్ల  ముందు కాళ్ల  వద్ద ఉన్న ప్రొపటేజియమ్‌

డైనోసార్లే మూలం

కోట్లాది ఏళ్ల క్రితం భూమ్మీద ఆధిపత్యం చలాయించిన కొన్ని డైనోసార్ల జాతుల నుంచి ఆధునిక పక్షులు పుట్టుకొచ్చాయనే విషయం తెలిసిందే. అందుకే పక్షుల ఈకలు, ఎముకల నిర్మాణం వంటి కొన్ని ప్రత్యేక అంశాలను విశ్లేషించటానికి పరిశోధకులు డైనోసార్ల మీదే దృష్టి సారిస్తుంటారు. కానీ రెక్కల ప్రత్యేకత గురించే అంతగా తెలియదు. అందుకే యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో పరిశోధకులు వీటిపై అధ్యయనం నిర్వహించారు. పక్షుల రెక్కలు ఆరంభమయ్యే చోట ప్రొపటేజియమ్‌ అనే నిర్మాణం ఉంటుంది. కండరంతో కూడుకొన్న ఇది భుజానికి, మణికట్టును అనుసంధానం చేస్తుంది. రెక్కలు అల్చార్చటానికి తోడ్పడేది ఇదే. దీని మూలంగానే పక్షులు గాల్లో ఎగరగలుగుతున్నాయి. ఇతర సకశేరుకాల్లో ప్రొపటేజియమ్‌ ఉండదు. గాల్లో ఎగరలేని పక్షుల్లో ఇది అంతరించిపోయి ఉండొచ్చు. లేదూ దీని పనితీరును కోల్పోయి ఉండొచ్చు. గాల్లో ఎగరటానికి ప్రొపటేజియమ్‌ తప్పనిసరి కావటం వల్ల ఇదెలా పరిణమించిందనేది తెలుసుకోవటం కీలకంగా మారింది. కాబట్టే ఆధునిక పక్షులకు సమీప పూర్వికులైన థెరోపాడ్‌ డైనోసార్ల మీద పరిశోధకులు అధ్యయనం చేశారు.

పక్షుల్లో రెక్కలు మొదలయ్యేచోటకు మారిన ప్రొపటేజియమ్‌

పరోక్ష పద్ధతితో..

టైరనోసారస్‌ రెక్స్‌, వెలిసిరాప్టర్‌ వంటి డైనోసార్ల మాదిరిగానే థెరోపాడ్‌ డైనోసార్లకూ రెక్కలు లేవు. చేతులే (ముందు కాళ్లు) ఉంటాయి. వీటిల్లో ప్రొపటేజియమ్‌ తొలి ఆనవాళ్లను గుర్తించగలిగితే అవి చేతుల నుంచి రెక్కలుగా ఎలా మారాయన్నది తెలుసుకోవచ్చు. అయితే అదంత తేలికైన పని కాదు. ప్రొపటేజియమ్‌ మృదు కణజాలంతో కూడుకొని ఉంటుంది కాబట్టి అంతగా శిలాజంగా మారదు. అందుకే పరోక్షంగా కనుక్కోవటానికి పరిశోధకులు ప్రయత్నించారు. డైనోసార్లు, పక్షుల చేతులు లేదా రెక్కలతో పాటు కీళ్ల కోణాల సమాచారాన్ని ఆధారంగా తీసుకున్నారు. ప్రస్తుత పక్షుల్లో రెక్కలు పూర్తిగా విప్పారవు. దీనికి కారణం ప్రొపటేజియమే. ఇది అనుసంధాన భాగాల మధ్య కోణాల శ్రేణిని కుంచింపజేస్తుంది. డైనోసార్లలోనూ ఇలాగే జరుగుతున్నట్టు గుర్తిస్తే పరిష్కారం తేలికవుతుంది కదా. ఇదే పరిశోధకులను ఆలోచింపజేసింది. దీని ఆధారంగానే మ్యానిరాప్ట్రాన్‌ థెరోపాడ్స్‌ అనే డైనోసార్ల జాతుల్లో ప్రొపటేజియమ్‌ ఏర్పడి ఉండొచ్చని గుర్తించారు. ఈకలతో కూడిన ఓవిరాప్టోరోసారియన్‌ కాడిప్‌టెరీక్స్‌, రెక్కలతో కూడిన డ్రోమాయియోసారియన్‌ మైక్రోరాప్టర్‌తో పాటు మృదుకణజాల శిలాజాల్లోనూ ప్రొపటేజియమ్‌ సురక్షితంగా ఉండటం దీనికి మరింత బలాన్ని ఇచ్చింది. వీటికి ఎగరటం అబ్బక ముందే ఇది ఏర్పడినట్టూ తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని