సీఎస్‌ఐఆర్‌ @ 80

అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని చూసినా కొట్టొచ్చినట్టు కనిపించేది శాస్త్ర, పారిశ్రామిక రంగాల పురోగతి. కొంగొత్త ఆవిష్కరణలతో మానవ జీవన గమనాన్ని సులభతరం చేస్తూనే..

Published : 19 Oct 2022 00:30 IST

అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని చూసినా కొట్టొచ్చినట్టు కనిపించేది శాస్త్ర, పారిశ్రామిక రంగాల పురోగతి. కొంగొత్త ఆవిష్కరణలతో మానవ జీవన గమనాన్ని సులభతరం చేస్తూనే.. భవిష్యత్‌ అవసరాలకు తగిన సాధనాలను సమకూర్చటంలో వీటి పాత్ర ఎనలేనిది. దీన్ని మనదేశం ఏనాడో గుర్తించింది. ఇందుకోసం ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. అదే శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌). ముద్దుగా సీఎస్‌ఐఆర్‌ అని పిలుచుకునే ఇది ఇటీవలే 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వాతంత్య్రకాంక్షతో ఉరకలు వేస్తున్న రోజుల్లోనే.. 1942లో పురుడు పోసుకొని, స్వాతంత్య్రానంతరం అభివృద్ధి కోసం అలమటిస్తున్న ఆకాంక్షలను అర్థం చేసుకొని.. ఇప్పటికీ నిత్యనూతన సవాళ్లను దిగ్విజయంగా అధిగమిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఆయా రంగాలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చటానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ.. నేటికి 37 ప్రయోగశాలలతో ప్రపంచంలో అగ్రశ్రేణి పరిశోధన సంస్థల్లో దేనికీ తీసిపోలేని స్థాయికి చేరుకుంది. వేటికీ వెరవక ముందుకు సాగుతోంది. ఇన్నేళ్ల సీఎస్‌ఐఆర్‌ ప్రస్థానంలో కొన్ని అద్భుత ఆవిష్కరణల గురించి తెలుసుకుందామా!

విదేశీ గుత్తాధిపత్యాన్ని అధిగమించి
గేదె పాలపొడి: అవి 1970ల రోజులు. శిశువులకు ఆవు పాలపొడి ఉత్పత్తిపై బహుళ జాతి సంస్థల పెత్తనం కొనసాగుతున్న రోజులు. మనదేశంలోనేమో గేదె పాల వాడకం ఎక్కువ. ఇందులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీన్నుంచి చేసే పొడి శిశువులకు త్వరగా జీర్ణం కాదు. దీన్ని సాకుగా చూపి బహుళజాతి సంస్థలు మనదేశంలో శిశువులకు అవసరమైన పాలపొడి ఉత్పత్తికి నిరాకరించాయి. సీఎస్‌ఐఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దీన్ని సవాల్‌గా తీసుకుంది. తొలిసారి గేదె పాల పొడిని ఉత్పత్తి చేయటంలో విజయం సాధించింది. అదే అమూల్‌ స్ప్రే మిల్క్‌ ఫుడ్‌. ఇది దేశంలో క్షీర విప్లవానికీ బీజం వేసింది.
సూపర్‌ కంప్యూటర్‌: క్రే సూపర్‌కంప్యూటర్‌ను అమ్మటానికి అప్పట్లో అమెరికా నిరాకరించింది. పరిశోధనలకు బదులు సైనిక అవసరాలకు దీన్ని వాడుకోవచ్చని భయపడింది. అయినా మన పరిశోధకులు కుంగిపోలేదు. సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబోరేటరీస్‌ శాస్త్రవేత్తలు ‘ఫ్లోసాల్వర్‌’ అనే సొంత సూపర్‌ కంప్యూటర్‌ను రూపొందించారు. మనదేశంలో మొట్టమొదటి సమాంతర సూపర్‌ కంప్యూటర్‌ ఇదే. వివిధ కంప్యూటర్లను సమాంతరంగా అనుసంధానం చేసి దీన్ని తయారుచేశారు. ఏరోనాటిక్స్‌, ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ పరిశోధనలో దీన్ని వాడుకున్నారు. ఫ్లోసాల్వర్‌ విజయం స్ఫూర్తితోనే దేశంలో పరమ్‌ వంటి ఇతర సూపర్‌ కంప్యూటింగ్‌ ప్రాజెక్టులు ఊపందుకున్నాయి.
పెట్రోలియం శుద్ధి: ప్రక్రియ రంగంలోనూ ప్రపంచవ్యాప్తంగా విదేశీ సంస్థల గుత్తాధిపత్యం నడుస్తుండేది. అలాంటి తరుణంలోనే అనుబంధ పారిశ్రామిక సంస్థల సహకారంతో సీఎస్‌ఐఆర్‌ ఎన్నో ప్రక్రియలను విజయవంతంగా ఆవిష్కరించింది. ఇప్పుడు మనదేశ చమురుశుద్ధి సంస్థలు, విభాగాలు వీటిని వాణిజ్య పరంగా వినియోగించుకుంటున్నాయి.
జియోలైట్‌ విజ్ఞానం: రసాయనాలు, పెట్రో రసాయనాలను పెద్దఎత్తున తయారుచేయటానికి ఉపయోగపడే జియోలైట్‌ ఉత్ప్రేరకాల విషయంలోనూ బహుళజాతి సంస్థల పెత్తనమే కొనసాగేది. వీటి తయారీ పరిజ్ఞానాన్ని రహస్యంగా ఉంచేవి. సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ కెమికల్‌ ల్యాబోరేటరీ శాస్త్రవేత్తలు దీని గుట్టును ఛేదించారు. ఈ పరిజ్ఞానాన్ని రూపొందించటమే కాదు.. అనతికాలంలోనే ఇందులో స్వయం సమృద్ధిని సాధించటానికీ తోడ్పడ్డారు. దీంతో విదేశీ మారక ధనం ఆదా అయ్యింది. ఆశ్చర్యకరకమైన విషయం ఏంటంటే- చవకైన, సురక్షితమైన, దీర్ఘకాలం మన్నే మన జియోలైట్‌ పరిజ్ఞానాన్ని విదేశాలూ స్వీకరించటం!

ఆప్టికల్‌ గ్లాస్‌: శాస్త్రీయ, ఫొటోగ్రఫిక్‌, సర్వే పరికరాల లెన్సులు, పట్టకాల్లో ఉపయోగించే ఆప్టికల్‌ గ్లాస్‌ తయారీ విధానమూ రహస్యంగానే ఉండేది. సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సెరామిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దీని తయారీ ప్రక్రియను రూపొందించటంలో విజయం సాధించింది.

ఎన్నికల సిరా
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజులవి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల నిర్వహణ, అక్రమాలను నివారించటం చిన్న విషయం కాదు. ఒకసారి ఓటు వేసినవారిని వెంటనే తిరిగి ఓటెయ్యకుండా చూడటమంటే పెద్ద సవాలే. ఇక్కడే సీఎస్‌ఐఆర్‌కు చెందిన నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబోరేటరీ శాస్త్రవేత్తలు విభిన్నంగా ఆలోచించారు. ఓటు వేసినవారిని గుర్తించటానికి 1952లో వినూత్నమైన సిరాను (ఇండెలిబుల్‌ ఇంక్‌) రూపొందించారు. చర్మానికి రాస్తే వెంటనే చెరిగిపోకపోవటం దీని ప్రత్యేకత. ఇదే చివరికి ఎన్నికల సిరాగా పేరొందింది. దీన్ని సీఎస్‌ఐఆర్‌ దేశానికి ఇచ్చిన పెద్ద బహుమతి అనుకోవచ్చు. ఎన్నికల సిరాలో ముఖ్యమైంది సిల్వర్‌ నైట్రేట్‌. ఇది చర్మ ప్రొటీన్‌తో ప్రతిచర్య జరిపి, బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. అక్కడ ముదురు మచ్చ ఏర్పడుతుంది. కొన్ని రోజులు, వారాల పాటు అలాగే ఉంటుంది గానీ చర్మానికి ఎలాంటి హాని చేయదు. పాత చర్మ కణాలు చనిపోయి, కొత్త కణాలు వస్తేనే రంగు పోతుంది. ఎన్నికల సిరా తయారీని 1962లో మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ సంస్థకు అప్పగించారు. దీన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 30 కన్నా ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు కూడా.

ఇండియా మార్క్‌ ఖిఖి పంప్‌
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను తీర్చటంలో చేతి పంపులు ఎంతగా దోహదం చేశాయో మాటల్లో వర్ణించలేం. లోతైన ఊట బావుల నుంచి బకెట్లతో నీరు తోడే శ్రమనూ ఇవి తప్పించాయి. నీరు కలుషితం కాకుండానూ కాపాడాయి. సాధారణ భాషలో చేతి పంపు అని పిలుచుకున్నా వీటి అసలు పేరు ఇండియా మార్క్‌ ఖిఖి పంప్‌. దీన్ని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసింది. మామూలు పరిజ్ఞానంతో కూడిన వీటిని వాడుకోవటం, నిర్వహించటమూ తేలికే. క్షీణించని భాగాలతో చవకగా అందుబాటులో ఉండేలా వీటిని రూపొందించారు. కేవలం మనదగ్గరే కాదు.. ఇతర దేశాల్లోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

స్వరాజ్‌ ట్రాక్టర్‌
మనదేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించటంలో వ్యవసాయంలో యంత్రాల వాడకం గణనీయంగా తోడ్పడింది. ఇందులో ట్రాక్టర్ల పాత్ర చాలా కీలకం. సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘స్వరాజ్‌’ అనే 20 హెచ్‌పీ ట్రాక్టర్‌ను రూపొందించింది. దీన్ని ఉత్పత్తి లైసెన్స్‌ను 1974లో పంజాబ్‌ ట్రాక్టర్‌కు ఇచ్చారు.

నల్గొండ పద్ధతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో నీటిలో ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉండటం, దీంతో ఎంతోమంది వైకల్యం బారిన పడటం తెలిసిందే. దీన్నుంచి విముక్తి కల్పించటానికి సీఎస్‌ఐర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ 1988లో సులభమైన పద్ధతిని రూపొందించింది. తెలంగాణలోని నల్గొండలో దీన్ని రూపొందించటం, అమలు చేయటం వల్ల దీనికి నల్గొండ టెక్నిక్‌ అనే పేరు వచ్చింది. నీటిలో అల్యూమినియం సల్ఫేట్‌ లేదా అల్యూమినియం క్లోరైడ్‌, బ్లీచింగ్‌ పొడిని కలిపి.. శుద్ధిచేసి, కరగని లవణాలను మడ్డి కట్టించి, వడపోయటం ద్వారా ఫ్లోరైడ్‌ శాతాన్ని తగ్గించటం దీనిలోని కీలకాంశం.

చిటికెలో అల్పాహారాలు
ఇప్పుడు దోశ, ఇడ్లీ, వడ, గులాబ్‌ జామూన్‌ వంటివి చిటికెలో చేసుకోవటానికి తోడ్పడే మిశ్రమాలు బాగా ఆదరణ పొందాయి. వీటి పరిజ్ఞానాన్ని రూపొందించింది మరెవరో కాదు. సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలే. వీటిని పెద్దఎత్తున తయారుచేయటానికి తోడ్పడే యంత్రాలనూ రూపొందించారు. ప్రస్తుతం ఇలాంటి కన్వీనియెన్స్‌ ఆహార పదార్థాల్లో 90% వీరి పద్ధతుల ఆధారంగానే ఉత్పత్తి అవుతున్నాయి.

సహేలీ- గర్భనిరోధక మాత్రలు
ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌తో కూడిన గర్భనిరోధక మాత్రలు శరీరంలోని గ్రంథుల వ్యవస్థ మీదా విపరీత ప్రభావం చూపుతాయి. ఇది దుష్ప్రభావాలకూ దారితీస్తుంది. వీటిని తప్పించటానికే సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ డ్రగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కొత్తరకం మాత్రలను (సెంట్‌క్రోమన్‌) రూపొందించింది. ఇవి ఫలదీకరణ చెందిన అండం గర్భసంచిలో నాటుకోకుండా చూస్తాయి. హైపోథలమస్‌-పిట్యుటరీ గ్రంథి-అండాశయ హార్మోన్‌ చట్రాన్ని అస్తవ్యస్తం చేయకుండానే గర్భధారణను నిలువరిస్తాయి. వారానికి ఒకసారి వేసుకునే ఈ మాత్రలు సహేలీ పేరుతో మార్కెట్‌లోకి వచ్చాయి. అనతికాలంలోనే ఇవి బాగా ఆదరణ పొందాయి.

హంస- శిక్షణ విమానం
సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబోరేటరీస్‌ 1990ల్లో హంస విమానాన్ని డిజైన్‌ చేసి, తయారుచేసింది. మనదేశానికి చెందిన మొట్టమొదటి రెండు సీట్ల శిక్షణ విమానం ఇదే. నిఘా కోసం, ఆకాశంలోంచి ఫొటోలు తీయటానికి, తీర రక్షణ, పర్యావరణ పర్యవేక్షణ వంటి అవసరాలకూ ఇది బాగా ఉపయోగపడుతోంది.

జీవజాతుల సంరక్షణ
అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణకు ఉద్దేశించిన కార్యక్రమం లాకోన్స్‌. దీనికి సాటివచ్చే ప్రాజెక్టు ప్రపంచంలో మరోటి లేదు. బయోటెక్నాలజీ విభాగం, సెంట్రల్‌ జూ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి సీఎస్‌ఐఆర్‌ దీన్ని ప్రతిపాదించింది. అధునాతన పద్ధతుల్లో జన్యు వైవిధ్యాన్ని పరిశీలించటం వంటి విస్తృత పరిజ్ఞానాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. లాకోన్స్‌ ప్రాజెక్టులో భాగంగా 2007లో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో స్పాటీ అనే మచ్చల జింకను పుట్టించారు.

వెదురు పువ్వులు
వెదురు చెట్లు జీవితకాలంలో ఒక్కసారే పూస్తాయి. అదీ ఆయా జాతులను బట్టి 7 నుంచి 100 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారే పూస్తాయి. పువ్వులు పూసిన తర్వాత చెట్లు చనిపోతాయి. ఇవి వేగంగా పువ్వులను పూచేలా చేయటంలో సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు 1990లో చరిత్ర సృష్టించారు. టిష్యూ కల్చర్‌ పద్ధతుల సాయంతో వారాల్లోనే వెదురు పువ్వులు పూచేలా చేయగలిగారు.

ఆర్టీథర్‌- మలేరియా మందు
మలేరియా చికిత్స కోసం సీఎస్‌ఐఆర్‌- సీడీఆర్‌ఐ శాస్త్రవేత్తలు 1995లో ఆర్టీథర్‌ అనే మందును తయారుచేశారు. ఇది ఆర్టీమిసినిన్‌కు కృత్రిమ రూపం. ప్రయోగ పరీక్షల్లో ఇది మంచి ఫలితాలు చూపించింది. దీన్ని క్లోరోక్విన్‌కు లొంగని ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్‌ చికిత్సలో రెండో దశ మందుగా వాడుతున్నారు. మెదడుకు సోకే మలేరియాకు సైతం ఉపయోగపడుతోంది.

మంటలను తట్టుకునే తలుపు
ఇది అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఒక గది నుంచి మరొక గదికి మంటలు వ్యాపించకుండా అడ్డుకుంటుంది.

సంపూర్ణ జన్యు విశ్లేషణ
మొట్టమొదటి మానవ జన్యు క్రమాన్ని విశ్లేషించటంలోనూ సీఎస్‌ఐఆర్‌ విజయం సాధించింది. మనదేశానికి చెందిన ఒక ఆరోగ్యవంతుడి జన్యుక్రమాన్ని పూర్తిగా విశ్లేషించి అబ్బుర పరిచింది. మొత్తం మానవ జన్యుచట్రాన్ని విశ్లేషించి, క్రోడీకరించే సామర్థ్యం గల దేశాల సరసన ఇప్పుడు మనదేశం చేరటానికిది దోహదం చేసింది.

ఎలక్ట్రిక్‌ కారు
ప్రపంచంలోనే తేలికైన, చవకైన ‘ఎలక్ట్రిక్‌ కారు’ను రూపొందించిన ఘనతనూ సీఎస్‌ఐఆర్‌ సొంతం చేసుకుంది. నాలుగు తలుపులు, నాలుగు సీట్లతో కూడిన ఇది బ్యాటరీతో నడుస్తుంది. దీన్ని మహీంద్ర రేవా పట్టణ కారుగా ఆరంభించింది. పట్టణాల్లో ప్రయాణించటానికి వీలైన నాలుగు తలుపుల మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ కారు ఇదే.

సింధు సాధన
దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి పరిశోధన నౌక ‘సింధు సాధన’. దీన్ని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఐఓ ఆరంభించింది. సముద్రాల తీరుతెన్నులను అర్థం చేసుకోవటానికి అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవటం దీని ఉద్దేశం.

కొవిడ్‌ పోరులోనూ..
కొవిడ్‌-19తో పోరాడటంలోనూ సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలలు విస్తృతంగా పాలు పంచుకున్నాయి. శానిటైజింగ్‌, డిస్‌ఇన్‌ఫెక్టింగ్‌ ద్రావణాల దగ్గర్నుంచి ఆరోగ్యసిబ్బంది కోసం రక్షణ కవచాలు, కొత్త మందుల అన్వేషణ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను వినియోగించుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాయి. కరోనా పరీక్ష కోసం ‘ఫెలుదా’ పేపర్‌ స్ట్రిప్‌, చేతులను శుభ్రం చేసే ‘హస్త సురక్ష’ వ్యవస్థ, కోత పెట్టాల్సిన అవసరం లేని ‘స్వస్థవాయు’ వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ యూనిట్‌, సూక్ష్మక్రిములను చంపే ద్రావణాన్ని సమానంగా చల్లే ఎలక్ట్రోస్టాటిక్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ యంత్రం, యూవీ-సీ ఆధారిత శానిటైజర్‌ వ్యవస్థ వంటివన్నీ వీటి ఫలితాలే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని