పంట రవాణాకు ఐఐటీ మద్రాస్‌ కొత్త ఉపాయం!

వ్యవసాయం చేయటం ఒక ఎత్తు. పండించిన పంటను మార్కెట్‌కు తరలించటం ఒక ఎత్తు. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. ప్రస్తుతం కూలీలు దొరకటమూ కష్టంగా మారిపోయింది.

Published : 23 Nov 2022 00:47 IST

వ్యవసాయం చేయటం ఒక ఎత్తు. పండించిన పంటను మార్కెట్‌కు తరలించటం ఒక ఎత్తు. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడిన పని. ప్రస్తుతం కూలీలు దొరకటమూ కష్టంగా మారిపోయింది. ఇలాంటి ఇబ్బందిని తగ్గించటానికే ఐఐటీ మద్రాస్‌ ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి సమర్థ, చవక రవాణా వ్యవస్థను రూపొందించింది. ఇది చూడటానికి మామూలు మోనోరైలు మాదిరిగా కనిపిస్తుంది. వ్యవసాయ క్షేత్రాల హద్దుల వెంట కాంక్రీటు దిబ్బలు వేసి, వాటిపై స్టీలు స్తంభాలను నాటటం దీనిలోని కీలకాంశం. ఈ స్తంభాలకు తేలికైన బోగీలను అమరుస్తారు. వీటికి తీగలను వేలాడదీస్తారు. తీగల మధ్యలో పంట ఉత్పత్తులతో నింపిన బస్తాలను పెడితే చాలు. రైలు మాదిరిగా నడుస్తూ వాటిని రవాణా చేస్తుంది. బోగీలు తేలికగా ఉన్నా బలంగా ఉంటాయి. ఒకో బోగీ 40 కిలోల బరువు మోస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుంచి సమీపంలోని పంట సేకరణ కేంద్రాలకు తరలించటానికి తోడ్పడుతుంది. నదీ తీరాల్లో వ్యవసాయం చేసేవారికైతే మరింత బాగా ఉపయోగ పడుతుంది. అటు చివర ఒకరు, ఇటు చివర ఒకరితోనే దీన్ని నడిపించొచ్చు. 32 మందితో చేసే పనిని నలుగురితోనే పూర్తి చేయొచ్చు. దీంతో కూలీల కొరతను, ఖర్చును తగ్గించుకోవచ్చు. మనుషులు మోయకపోవటం వల్ల పండ్లు నలగటం వంటి నష్టాలూ తప్పుతాయి. నేలకు ఎత్తుగానే ఉంటుంది కాబట్టి పర్యావరణానికి పెద్దగా హాని కలిగించదు. స్థానికంగా అందుబాటులో ఉండే వస్తువులు, భాగాలతో.. స్థానిక వర్క్‌షాపుల్లోనే దీన్ని రూపొందించారు. తక్కువ ఇంధనం అవసరమవటం వల్ల నిర్వహణ ఖర్చూ తక్కువే అవుతుంది. దీన్ని వ్యవసాయ క్షేత్రాల వద్ద సులభంగా అమర్చుకోవచ్చు. కొత్తగా ఆలోచిస్తే సమస్య పరిష్కారం సులభమే కదా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని