పాత్రికేయుడి ఆవిష్కరణ

ఆవిష్కరణలనగానే శాస్త్రవేత్తలే గుర్తుకొస్తారు. పాత్రికేయుడే ఆవిష్కర్త అయితే? విచిత్రమే కదా. ఆయనే హంగరీకి చెందిన లాస్‌జ్లో బైరో. ఆయన కనుగొన్నది మరేంటో కాదు.. బాల్‌ పాయింట్‌ పెన్‌.

Updated : 14 Dec 2022 01:23 IST

విష్కరణలనగానే శాస్త్రవేత్తలే గుర్తుకొస్తారు. పాత్రికేయుడే ఆవిష్కర్త అయితే? విచిత్రమే కదా. ఆయనే హంగరీకి చెందిన లాస్‌జ్లో బైరో. ఆయన కనుగొన్నది మరేంటో కాదు.. బాల్‌ పాయింట్‌ పెన్‌. పత్రికలను ముద్రించటానికి వాడే సిరా త్వరగా ఆరిపోతుండటం, కాగితాలకు మచ్చ పడకపోవటం ఆయనను ఆకర్షించింది. ఆ సిరాను పెన్నులో వాడుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. ఆలోచన వచ్చిందే తడవు పెన్నులో పోశారు. కానీ సిరా చిక్కగా ఉండటం వల్ల పాళీలోంచి బయటకు రాలేకపోయింది. అయినా నిరాశ పడలేదు. చిన్న బాల్‌ బేరింగ్‌ను పెన్ను కొస వద్ద ఉండేలా కొత్త పాయింట్‌ను రూపొందించారు. కాగితం మీద పెన్ను కదులున్నకొద్దీ బాల్‌ తిరగటం, దాని గుండా సిరా ప్రవహించటంతో ఎక్కడలేని సంతోషం కలిగింది. అలా మొట్టమొదటి బాల్‌ పాయింట్‌ పెన్‌ పుట్టుకొచ్చింది. నిజానికి బాల్‌ పాయింట్‌ పెన్‌ సూత్రాల మీద 1888లో జాన్‌ లౌడ్‌ అనే ఆయన పేటెంట్‌ తీసుకున్నారు. దీన్ని ఆయన తోలు మీద గుర్తుల కోసం వాడుకునేవారు. కానీ అది వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పెన్నులోంచి సిరా కారకుండా రాయగలిగే కొత్త పెన్ను అవసరపడింది. అందుకే బ్రిటన్‌ ప్రభుత్వం బైరో నుంచి పేటెంట్‌ హక్కులు కొనుక్కొంది. అనంతరం ఇవి విరివిగా వాడకంలోకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని