బ్రౌజింగ్‌ తప్పులు చేయొద్దు!

రోజూ ఇంటర్నెట్‌లో గంటల కొద్దీ గడుపుతుంటాం. అంత సమయం వెచ్చిస్తున్నామంటే సరైన పద్ధతిలో వాడుకోవద్దూ. బ్రౌజింగ్‌లో చిన్న తప్పులు చేసినా పెద్ద ముప్పు ముంచుకురావొచ్చు.

Updated : 18 Jan 2023 07:28 IST

రోజూ ఇంటర్నెట్‌లో గంటల కొద్దీ గడుపుతుంటాం. అంత సమయం వెచ్చిస్తున్నామంటే సరైన పద్ధతిలో వాడుకోవద్దూ. బ్రౌజింగ్‌లో చిన్న తప్పులు చేసినా పెద్ద ముప్పు ముంచుకురావొచ్చు. బ్రౌజింగ్‌ వేగం నెమ్మదించొచ్చు. వైరస్‌, హ్యాకర్ల దాడికి అవకాశం కల్పించొచ్చు. అందువల్ల బ్రౌజింగ్‌ విషయంలో దారి తప్పొద్దు. నిజానికిదేమీ కష్టమైన పని కాదు. అయినా కూడా చాలామంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. ఇది తమకు తాము హాని చేసుకోవటం తప్ప మరేమీ కాదు. కాబట్టి పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి.


ఎప్పటికప్పుడు బ్రౌజర్ అప్‌డేట్‌

‘బ్రౌజర్‌ను తర్వాతి వర్షన్లకు అప్‌డేట్‌ చేసుకోవాలని అనుకుంటున్నారా?’ అంటూ తరచూ పాపప్‌ సందేశాలు వస్తుండటం గమనించే ఉంటారు. క్రోమ్‌ వాడేవారికిది అనుభవంలోకి రాకపోవచ్చు. ఎందుకంటే గూగుల్‌ సంస్థ బ్యాక్‌గ్రౌండ్‌లోనే అప్‌డేట్లను చేసేస్తుంటుంది. మిగతా బ్రౌజర్ల విషయంలో మాత్రం పట్టించుకోవాల్సిందే. బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసినప్పుడు కొత్త ఫీచర్లు తోడవుతాయి. పాత వర్షన్లలో తప్పులు తొలగిపోతాయి. సాధారణంగా ప్రధాన వర్షన్‌ అప్‌డేట్లతోనే భారీ ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటాయి. బ్రౌజర్‌ అప్‌డేట్‌ కొద్ది సెకండ్లలోనే పూర్తవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తాజా వర్షన్లకు అప్‌డేట్‌ కావటం మంచిది.


ఆచితూచి కుకీస్‌ అనుమతి

మనం ఏదైనా వెబ్‌సైట్‌ను చూసినప్పుడు కొన్ని తాత్కాలిక ఫైళ్లు క్రియేట్‌ అవుతాయి. వీటిని కుకీస్‌ అంటారు. ఇవి ఆయా వెబ్‌సైట్లకు సంబంధించి లాగిన్‌ డేటా వంటి సమాచారాన్ని నిల్వ చేసుకుంటాయి. మళ్లీ మనం వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడు త్వరగా పని పూర్తయ్యేలా చేస్తాయి. ఇవేమీ హాని చేయవు. కానీ వెబ్‌ బ్రౌజింగ్‌ తీరుతెన్నుల వంటివి పసిగట్టటానికి కొందరు వీటిని వాడుకోవచ్చు. కాబట్టి కుకీస్‌కు ఎడాపెడా అనుమతి ఇవ్వటం తగదు. అసలు వెబ్‌సైట్‌ డొమైన్‌ కోరే కుకీస్‌కు అనుమతి ఇస్తే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ అడ్వర్టైజింగ్‌ నెట్‌వర్క్‌ వంటి ఇతర డొమైన్లు అడిగే థర్డ్‌ పార్టీ కుకీస్‌కు అనుమతి ఇచ్చే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహ రించాలి.


నాకేమీ కాదులే అనుకోవద్దు

సరైన టూల్స్‌ భద్రతకు ఎంతగానో తోడ్పడతాయి. అయితే భద్రంగా ఉండటమనేది చివరికి ఆయా టూల్స్‌ను వాడటం కన్నా మన మైండ్‌సెట్‌, ధోరణి మీదే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అన్నీ సవ్యంగా ఉన్నాయి కదా, మనకేమీ కాదనే ధోరణితో చాలామంది ప్రవర్తిస్తుంటారు. ఇది తగదు. అన్నింటికన్నా ముందు చేయాల్సింది పీసీలో యాంటీవైరస్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవటం. ప్రస్తుతం ఉచితంగానే ఎన్నో యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. డిఫాల్ట్‌గా వచ్చే విండోస్‌ సెక్యూరిటీ ఎసెన్షియల్స్‌ వంటి టూల్స్‌ కూడా ఉన్నాయి. వీటిని ఆన్‌ చేసి పెట్టుకోవాలి. ఆన్‌లైన్‌ మోసాల మీదా ఓ కన్నేసి ఉంచాలి. ఇంటర్నెట్‌లో మోసగాళ్లు తేలికగా బోల్తా కొటిస్తుంటారు. ఆఫర్లు, ఫేక్‌ రివ్యూల వంటి వాటితో ఆకర్షిస్తుంటారు. వీరి వలలో పడొద్దు. ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే తిరస్కరించాలి. అన్నీ సవ్యంగా ఉన్నాయని అనిపించినా కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించి, ధ్రువీకరించుకోవాలి.


ట్యాబ్స్‌ అన్నీ తెరవద్దు

బ్రౌజ్‌ చేస్తుంటాం. ఏదో లింక్‌ ఆసక్తి కలిగిస్తుంది. తర్వాత చదువుదాం లెమ్మని కొత్త ట్యాబ్‌తో తెరుస్తాం. మన పనిలో మనం పడిపోతాం. మరో ట్యాబ్‌ తెరుస్తాం. దాన్ని పక్కన పెడతాం. చాలామంది చేసే పనే ఇది. ఇలా కుప్పలు తెప్పులుగా ట్యాబ్స్‌ ఓపెన్‌ చేసి పెడితే బ్రౌజర్‌ వేగం నెమ్మదిస్తుంది. ఒకవేళ ఎక్కువ ట్యాబ్స్‌ అవసరమనుకుంటే ట్యాబ్‌ గ్రూప్స్‌ను ఉపయోగించుకోవటం మంచిది. ఇది బ్రౌజర్‌ మీద భారాన్ని తగ్గిస్తుంది. ఆయా అంశాల వారీగా ట్యాబ్స్‌ను వర్గీకరిస్తుంది. దీంతో అవసరమైన ట్యాబ్‌ మీద క్లిక్‌ చేసి వెంటనే చూసుకోవచ్చు. క్రోమ్‌ వంటి బ్రౌజర్లలో బిల్టిన్‌గా వచ్చే రీడింగ్‌ లిస్ట్‌ ఫీచర్‌నైనా వాడుకోవచ్చు. ఇందుకోసం క్రోమ్‌లో థర్డ్‌ పార్టీ రీడ్‌ లేటర్‌ ప్లగిన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.


ప్లగిన్స్‌ విషయంలోనూ

గ్రామర్‌ చెకర్స్‌, పాస్‌వర్డ్‌ మేనేజర్లు, వీడియో డౌన్‌లోడర్ల వంటి ప్లగిన్లు కొత్త ఫీచర్లతో ఆన్‌లైన్‌ విహారాన్ని సులభం చేస్తాయనటంలో సందేహం లేదు. ఇవి ప్రస్తుతం ఉన్న ఫీచర్లనూ మరింత మెరుగుపరుస్తాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే- ఇవీ చిన్నపాటి యాప్సేనని. ఇవీ మెమరీని, రిసోర్సులను వాడుకుంటాయి. ఎక్కువ ప్లగిన్స్‌ వాడుతున్నట్టయితే బ్రౌజర్‌ వేగమూ నెమ్మదిస్తుంది. కాబట్టి అవసరమైన ప్లగిన్స్‌ మాత్రమే ఎనేబుల్‌ చేసుకోవాలి. తరచూ వాడని వాటిని డిలీట్‌ లేదా డీయాక్టివేట్‌ చేయాలి. బ్రౌజర్‌ థీమ్‌ను మనకు ఇష్టమైనట్టుగా మార్చే ప్లగిన్స్‌ కూడా బ్రౌజర్‌ వేగాన్ని తగ్గిస్తాయి. నిజానికి వీటితో ఎలాంటి ఉపయోగమూ ఉండదని గుర్తుంచుకోవాలి.


పబ్లిక్‌ వైఫైలో వీపీఎన్‌

వైబ్‌సైట్లకు మన ఐపీ అడ్రస్‌ తెలవకుండా వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) అడ్డుకుంటుంది. వెబ్‌లో ఇతరులకు తెలియకుండా పనులు చేసుకోవటానికి తోడ్పడుతుంది. ఇలా భద్రంగా ఉంచుతుంది. వర్చువల్‌ ఐపీతో ఇతరులు మనల్ని ట్రాక్‌ చేయకుండా నిలువరిస్తుంది. నిజానికి వీపీఎన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరమేమీ లేదు. బ్రౌజర్‌ ప్లగిన్లలో ఎన్నో వీపీఎన్‌ ఎక్స్‌టెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్‌ వైఫైని వాడుకునే టప్పుడు హ్యాకర్లు మనల్ని ఎక్కువగా హ్యాక్‌ చేయాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వీపీఎన్‌ రహస్య సమాచారాన్ని తస్కరించకుండా కాపాడుతుంది. కాబట్టి పబ్లిక్‌ వైఫైని వాడుకుంటున్నప్పుడు దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటం మంచిది.


2ఎఫ్‌ఏ లేకుండా అదే పాస్‌వర్డ్‌ వాడొద్దు

ఆన్‌లైన్‌ మోసాలకు, హ్యకింగ్‌కు బలహీన పాస్‌వర్డ్‌లే ప్రధాన కారణం. అందువల్ల బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవాలి. అన్ని వెబ్‌సైట్లకు ఒకే పాస్‌వర్డ్‌ వాడొద్దు. వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి. లేకపోతే హ్యాకర్లు పాస్‌వర్డ్‌ల గుట్టును తెలుసుకొని, అన్ని ఖాతాలనూ యాక్సెస్‌ చేయొచ్చు. ఒకవేళ పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం కష్టమనిపిస్తే పాస్‌వర్డ్‌ మేనేజర్‌ టూల్స్‌ సాయం తీసుకోవచ్చు. ఇవి సులభంగా, సమర్థంగా పనిచేస్తాయి. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ సెట్‌ చేసుకుంటే ఇంకా మంచిది. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే రిజిస్టర్డ్‌ పరికరం లేదా మొబైల్‌ ఫోన్‌కు ఒక కోడ్‌ అందుతుంది. దాన్ని ఎంటర్‌ చేస్తేనే లాగిన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఇది మంచి భద్రత కల్పిస్తుంది.


యాడ్స్‌ లింక్స్‌ క్లిక్‌ చేయొద్దు

హ్యాకర్లు స్పూఫింగ్‌ పద్ధతిలో బోల్తా కొట్టిస్తుంటారు. విశ్వసనీయమైనవిగా కనిపించే నకిలీ లింక్స్‌, ఈమెయిళ్లతో వలలో పడేస్తుంటారు. చాలావరకు వెబ్‌ యూజర్లే వీరి బారిన పడుతుంటారు.  హ్యాకర్లు వెబ్‌ పేజీల్లో ఆకర్షణీయ యాడ్స్‌, డిస్కౌంట్‌ లేదా ఉచిత ఆఫర్లతో కూడిన ఈమెయిళ్లను పంపుతుంటారు. ఒకసారి వీటి మీద క్లిక్‌ చేస్తే చాలు. హ్యాకర్లు వైరస్‌లను పంపించి, డేటాను తస్కరించటానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి ఇలాంటి మోసపూరిత లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయొద్దు.


విశ్వసనీయ సైట్లలోనే క్రెడిట్‌ కార్డు వాడాలి

ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఇట్టే పూర్తి చేయటంలో క్రెడిట్‌ కార్డులు బాగా ఉపయోగపడతాయి. అయితే విశ్వసనీయం కాని వెబ్‌సైట్లకు కార్డు వివరాలు ఇస్తే డబ్బు దొంగిలించే ప్రమాదముందని తెలుసుకోవాలి. హ్యాకర్లు వెంటనే ఈ వివరాలను వాడుకోకపోవచ్చు. కొద్దిరోజుల పాటు వేచి చూసి, తర్వాత డబ్బు కొల్లగొట్టొచ్చు. అందువల్ల విశ్వసనీయమైన వెబ్‌సైట్లలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయాలి. ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్‌లో క్రెడిట్‌ కార్డును వాడినట్టు అనిపిస్తే వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియ జేయాలి. వాళ్లు కార్డు భద్రంగా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకుంటారు.


సోషల్‌ మీడియా అతిగా షేరింగ్‌ వద్దు

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలతో రోజువారీ వ్యవహారాలు ఎంత తేలికయ్యాయో తెలిసిందే. కానీ ఇవి కొన్నిసార్లు ముప్పులనూ తెచ్చి పెట్టొచ్చు. ఉదాహరణకు- మన మీద నిఘా పెట్టేవారికి సమాచారం అందించొచ్చు. ఇలాంటి వారిని మనం ట్రాక్‌ చేయలేం కదా. అందువల్ల అవసరమైన విషయాలే షేర్‌ చేసుకోవాలి. రోజూ కాలేజీకి వెళ్తున్నామనో, ఫలానా పర్యటక కేంద్రాన్ని సందర్శి స్తున్నామనో, నివసిస్తున్న చిరునామానో.. ఇలా అదేపనిగా అతిగా సమాచారాన్ని షేర్‌ చేసుకుంటే కొన్నిసార్లు ప్రమాదం ముంచుకురావొచ్చు. ఇది మనకే కాదు, మన చుట్టుపక్కల వారికీ చేటు కలిగించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని