‘ఘన’ ఇంధనమే!

ఘన-ఇంధన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని (ఐసీబీఎం) పరీక్షించినట్టు ఇటీవల ఉత్తర కొరియా పేర్కొంది. దీర్ఘశ్రేణి అంతరిక్ష వాహనంలో ఘన ఇంధనాన్ని వాడుకోవటం ఇదే తొలిసారని భావిస్తున్నారు.

Published : 19 Apr 2023 00:22 IST

న-ఇంధన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని (ఐసీబీఎం) పరీక్షించినట్టు ఇటీవల ఉత్తర కొరియా పేర్కొంది. దీర్ఘశ్రేణి అంతరిక్ష వాహనంలో ఘన ఇంధనాన్ని వాడుకోవటం ఇదే తొలిసారని భావిస్తున్నారు. తక్కువ సన్నద్ధతతోనే ప్రయోగించే అవకాశం ఉండటం వల్ల ఈ పరిజ్ఞానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఘన ఇంధన పరిజ్ఞానం అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది?

అంతరిక్ష వాహనాన్ని ముందుకు తోసే ఘన ప్రొపెలెంట్లు ఇంధనం, ఆక్సిడైజర్‌ మిశ్రమంతో కూడి ఉంటాయి. సాధారణంగా అల్యూమినియం వంటి లోహపు పొడులను ఇంధనంగా ఉపయోగిస్తారు. పర్‌క్లోరిక్‌ యాసిడ్‌ సాల్ట్‌, అమోనియాతో కూడిన అమోనియం పర్‌క్లోరేట్‌ను ఆక్సిడైజర్‌గా వాడుకుంటారు. ఈ రెండింటినీ రబ్బరు పదార్థంతో గట్టిగా చుట్టి, లోహపు పెట్టెలో జొప్పిస్తారు. ఘన ప్రొపెలెంట్‌ మండినప్పుడు.. అమోనియం పర్‌క్లోరేట్‌ నుంచి వెలువడే ఆక్సిజన్‌ అల్యూమినియంతో కలుస్తుంది. అప్పుడు పెద్దమొత్తంలో శక్తి, 5వేల డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువ ఉష్ణం జనిస్తుంది. దీంతో ముందుకు నెట్టే థ్రస్ట్‌ పుట్టుకొచ్చి, క్షిపణిని లాంచ్‌ ప్యాడ్‌ నుంచి పైకి లేపుతుంది. నిజానికి ఘన ఇంధన పరిజ్ఞానం చైనాలో వందల ఏళ్ల క్రితమే పుట్టుకొచ్చింది. దీన్ని బాణసంచా తయారీలో వాడేవారు. అమెరికా మరింత శక్తిమంతమైన ప్రొపెలెంట్లను అభివృద్ధి చేయటంతో 20వ శతాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించింది. సోవియట్‌ యూనియన్‌ తొలి ఘన ఇంధన ఐసీబీఎంను 70ల తొలినాళ్లలో ప్రయోగించింది. అనంతరం ఫ్రాన్స్‌ కూడా ఈ పరిజ్ఞానంతో మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని రూపొందించింది. చైనా 90ల చివర్లో ఘన ఇంధన ఐసీబీఎం పరీక్షలు ఆరంభించింది.

ద్రవ, ఘన ఇంధనం తేడాలేంటి?

ద్రవ ప్రొపెలెంట్లు అత్యంత ఎక్కువగా థ్రస్ట్‌ను, శక్తిని ఉత్పత్తి అందిస్తాయి. అయితే దీనికి సంక్లిష్టమైన పరిజ్ఞానం అవసరం. బరువూ అధికమే. అయితే ఘన ఇంధనం దట్టంగా ఉంటుంది. త్వరగా మండుతుంది. తక్కువ సమయంలోనే థ్రస్ట్‌ను పుట్టిస్తుంది. ఎక్కువ కాలం నిల్వ చేసినా ఘన ఇంధనం క్షీణించదు. ద్రవ ఇంధనానికి ఘన ఇంధనానికి ప్రధానమైన తేడా ఇదే. ఘన ఇంధన క్షిపణుల నిర్వహణ తేలిక. సురక్షితం కూడా. రవాణాకు పెద్దగా కష్టపడాల్సిన పనుండదు. వీటిని శత్రువులు గుర్తించటమూ కష్టమే. ద్రవ ఇంధన ఆయుధాల కన్నా మరింత ఎక్కువ కాలం మన్నుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని