Malware: మాల్వేర్‌ వలలో పడొద్దు!

ఆఫీసు పని కోసం ల్యాప్‌టాప్‌/డెస్క్‌టాప్‌ తెరిచారు. అంతలో ఏదో తేడా. అదేపనిగా యాప్స్‌ క్రాష్‌ అవుతుండొచ్చు. చికాకు పరచే పాప్‌ అప్‌ విండోస్‌ను క్లోజ్‌ చేయలేకపోవచ్చు. దీనికి మాల్వేర్‌ కారణమై ఉండొచ్చు.  

Updated : 26 Apr 2023 08:30 IST

ఆఫీసు పని కోసం ల్యాప్‌టాప్‌/డెస్క్‌టాప్‌ తెరిచారు. అంతలో ఏదో తేడా. అదేపనిగా యాప్స్‌ క్రాష్‌ అవుతుండొచ్చు. చికాకు పరచే పాప్‌ అప్‌ విండోస్‌ను క్లోజ్‌ చేయలేకపోవచ్చు. దీనికి మాల్వేర్‌ కారణమై ఉండొచ్చు.  

మాలిషియస్‌ సాఫ్ట్‌వేర్‌నే పొట్టిగా మాల్వేర్‌ అని పిలుచుకుంటున్నారు. మనకు తెలియకుండా కంప్యూటర్‌ మీద ఆజమాయిషీ పొందటానికి, దెబ్బతీయటానికి ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌. నిజానికి దీన్ని ప్రయోగాల కోసం, ఆట పట్టించటానికి టెక్నీషియన్లు సృష్టించారు. చివరికి మోసగాళ్లు హింసించటానికి, ఆయా పరికరాలను నాశనం చేయటానికి ఉపయోగించుకోవటం మొదలెట్టారు. ప్రస్తుతం అంతర్జాలంలో కోట్లాది మాల్వేర్లు ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా దాడి చేయొచ్చు. సాధారణంగా ఊరించే ఈమెయిళ్ల ద్వారా హానికర లింకులు, ఫైళ్లు, అటాచ్‌మెంట్లను పంపటం ద్వారా హ్యాకర్లు మాల్వేర్లను జొప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ లింకులు, అటాచ్‌మెంట్లను క్లిక్‌ చేసినప్పుడు మనకు తెలియకుండానే మాల్వేర్లు ఇన్‌స్టాల్‌ అవుతాయి. అక్కడ్నుంచి పరికరంలో దాచుకున్న వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని దొంగిలించటానికి, నిర్మూలించటానికి ప్రయత్నిస్తాయి. మరి మాల్వేర్‌ పరికరంలో ఇన్‌స్టాల్‌ అయ్యిందని గుర్తించటమెలా? దీనికి కొన్ని లక్షణాలు లేకపోలేదు.

వేగం తగ్గటం

కంప్యూటర్‌ వేగం గణనీయంగా తగ్గటం మాల్వేర్‌ చొరపడిందనటానికి సంకేతం కావొచ్చు. కొన్నిసార్లు పరికరం ర్యామ్‌ను అడ్డుకోవటంతోనూ సిస్టమ్‌ నెమ్మదించొచ్చు. ఇలాంటి మాల్వేర్లతో కూడిన యాప్స్‌ రన్‌ అవుతున్నప్పుడు పీసీ వేగం నెమ్మదిస్తుంది. స్క్రీన్‌ ఫ్రీజ్‌ కావటం, అనూహ్యంగా రీసార్ట్‌ అవటం, తరచూ వై-ఫై డిస్‌కనెక్ట్‌ కావటం వంటివీ హెచ్చరికలే. అయితే మాల్వేర్‌ సోకిన కంప్యూటర్లన్నీ నెమ్మదించాలనేమీ లేదు. కొన్నిసార్లు తగినంత స్టోరేజీ లేకపోయినా వేగం తగ్గొచ్చు.

అనూహ్యంగా క్రాష్‌

కంప్యూటర్‌ ఆగిపోతున్నా, క్రాష్‌ అవుతున్నా చాలా చికాకు  పుడుతుంది. మాటిమాటికీ బ్లూ స్క్రీన్‌ ప్రత్యక్షం కావటం, పిన్‌వీల్‌ అదేపనిగా తిరగటం మాల్వేర్‌ ఇన్‌ఫెక్షన్‌కు చిహ్నాలు కావొచ్చు. ముఖ్యంగా అంతకుముందు వరకూ బాగా పనిచేసిన పీసీ అప్పుడే మొరాయిస్తే సందేహించాల్సిందే.

స్టోరేజీ నిండుకోవటం

అసాధారణంగా స్టోరేజీ నిండుకోవటమూ మాల్వేర్‌కు సంకేతం కావొచ్చు. ఎందుకంటే చాలా మాల్వేర్లు పెద్ద పైళ్లతో కూడుకొని ఉంటాయి. ఇవి చాలా స్టోరేజీని ఆక్రమిస్తాయి. కొన్ని మాల్వేర్‌ ప్రోగ్రామ్‌లైతే వివిధ రకాల పద్ధతులతో మిగతా స్టోరేజీ మొత్తాన్ని లాగేసుకుంటాయి. దీంతో తరచూ కంప్యూటర్‌ క్రాష్‌ అవుతుంటుంది.

హోంపేజీ మారటం

మాల్వేర్‌ లక్షణాలు కొన్నిసార్లు వెబ్‌ బ్రౌజర్‌లోనే త్వరగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు- బ్రౌజర్‌ హోంపేజీ తరచూ మారిపోవటం. దీన్ని గమనిస్తే ఒకసారి మాల్వేర్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉండొచ్చని తనిఖీ చేసుకోవాలి. చాలాసార్లు హానికర లింకులు, పాప్‌ అప్‌ విండోస్‌ను మనం తెలియకుండా నొక్కినప్పుడు మాల్వేర్‌ పరికరంలో ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఇది తనకు తానే బ్రౌజర్‌  సెటింగ్స్‌లో మార్పులు చేసేస్తుంది.

బ్రౌజర్‌ రీడైరెక్ట్‌

కొన్నిరకాల మాల్వేర్లు తెలివిగా బ్రౌజర్‌ పనితీరును మార్చేయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో హానికర ఎక్స్‌టెన్షన్లు సురక్షితం కాని వెబ్‌సైట్లకు దారి మళ్లించి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించొచ్చు. ఆయా వెబ్‌సైట్‌లకు చేరుకోలేకపోతున్నా, వెబ్‌పేజీ మీద అనుమానిత యూఆర్‌ఎల్‌ కనిపించినా మాల్వేర్‌ సమస్య ఉండొచ్చని భావించాలి.

కొత్త బ్రౌజర్‌ టూల్‌బార్లు

ఇష్టమైన వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసినప్పుడు కొత్త బ్రౌజర్‌ టూల్‌బార్లు, మనం ఇన్‌స్టాల్‌ చేయని యాడ్‌-ఆన్స్‌ కనిపించినా అనుమానించాల్సిందే. బ్రౌజర్‌ను రీడైరెక్ట్‌ చేసే ఎక్స్‌టెన్షన్ల మాదిరిగానే హానికర మాల్వేర్‌ ఇన్‌ఫెక్షన్లు బ్రౌజర్‌ను హైజాక్‌ చేయొచ్చు. టూల్‌బార్లు, ఇతర బ్రౌజర్‌ ప్లగిన్లతో పీసీ పనితీరును మార్చేయొచ్చు.

చికాకు పెట్టే పాపప్స్‌

ప్రతిసారీ చికాకు పెట్టే పాపప్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే యాడ్వేర్‌ అనే మాల్వేర్‌ సోకి ఉండొచ్చు. పాపప్‌ యాడ్స్‌ అన్నీ ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. కొన్ని విశ్వసనీయమైన వస్తువులు, సేవలకు సంబంధించినవే అయ్యుండొచ్చు. కానీ ఇవి హానికర వెబ్‌సైట్‌లకూ దారి చూపించొచ్చు. సైబర్‌ భద్రతకు భంగం కలిగించొచ్చు.

అసాధారణ ఎర్రర్‌ మెసేజ్‌లు

కొన్నిసార్లు చికాకు పెట్టే పాపప్స్‌ ఎర్రర్‌ మెసేజ్‌ల రూపంలోనూ కనిపించొచ్చు. ఫైల్‌ కరప్ట్‌ అయ్యిందనో, ఏదో ఒక డ్రైవ్‌ పోయిందనో సందేశంలో ఉండొచ్చు. ఇలాంటి సమయంలో కంప్యూటర్‌కు మాల్వేర్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని అనుమానించాలి.

నకిలీ వైరస్‌ అలర్ట్‌లు

నకిలీ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ రూపంలోనూ మాల్వేర్‌ ప్రత్యక్షం కావొచ్చు. ఇది ముందుగా పీసీ వైరస్‌ దాడికి గురయ్యిందని చెప్పొచ్చు. తర్వాత దాన్ని సరిదిద్దటానికి డబ్బులు చెల్లించమని అడగొచ్చు. నిజానికి ఇలాంటివి మనం త్వరగా స్పందించటం కోసం రూపొందించిన మోసకారి పద్ధతులు. పరికరంలో అలాంటి వైరస్‌ ప్రోగ్రామ్‌ ఏదీ లేకపోవచ్చు. నకిలీ యాంటీవైరసే అసలు ప్రమాదాన్ని తెచ్చిపెట్టొచ్చని గుర్తించాలి.

సెక్యూరిటీ సెటింగ్స్‌లో మార్పులు

కొన్నిసార్లు ఆయా సెక్యూరిటీ సెటింగ్స్‌ను గానీ మనం ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను గానీ డిసేబుల్‌ చేయటానికీ మాల్వేర్లు ప్రయత్నించొచ్చు. అందువల్ల తాజా సాప్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. దీంతో మాల్వేర్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు.

రహస్య సోషల్‌ మీడియా పోస్ట్‌లు

కొన్ని మాల్వేర్లు సోషల్‌ మీడియా సైట్ల సాయంతోనూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించొచ్చు. మన ప్రమేయం లేకుండానే మన తరపున రెచ్చగొట్టే ఫేస్‌బుక్‌ పోస్టులు లేదా అనుమానిత ఇన్‌స్టాగ్రామ్‌ డీఎంలను పంపొచ్చు. సోషల్‌ మీడియా పోస్టుల వంటివి మన నియంత్రణలో లేకుండా సాగుతుంటే పరికరానికి మాల్వేర్‌ సోకి ఉండొచ్చని అనుమానించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని