సాంకేతిక భారతం
మానవ మనుగడ, అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) పాత్ర ఎనలేనిది. ఆదిమ మానవుడు రాతి పరికరాల వాడకంతోనే దీని ప్రాధాన్యం మొదలైంది
రేపు నేషనల్ టెక్నాలజీ డే
మానవ మనుగడ, అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) పాత్ర ఎనలేనిది. ఆదిమ మానవుడు రాతి పరికరాల వాడకంతోనే దీని ప్రాధాన్యం మొదలైంది. మంటను కనుగొనటం, చక్రం తయారీ, వ్యవసాయం ఆరంభించటం, ఇనుము ఉత్పత్తి, ఆవిరి యంత్రం, రైళ్లు, విద్యుత్తు, టెలిఫోన్, రేడియో, విమానాలు, టెలివిజన్, కంప్యూటర్, రాకెట్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్.. ఒక్కటేమిటి అన్నీ అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతూనే వచ్చాయి. శాస్త్ర, సాంకేతిక రంగంలో మనదేశమూ తక్కువేమీ కాదు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచీ శరవేగంగా దూసుకుపోతూనే ఉంది. అంతర్జాతీయంగా తనదైన ముద్రను వేస్తూనే వస్తోంది. వ్యవసాయంలో హరిత విప్లవం, క్షీర విప్లవం తెచ్చిన మార్పుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఉపగ్రహాలను నిర్మించటం, ప్రయోగించటం.. చంద్రుడు, అంగారకుడి మీదికి అంతరిక్ష నౌకలను పంపించటం.. అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు, అణ్వాయుధ సామర్థ్యం, క్షిపణుల ప్రయోగం వంటివన్నీ మన కీర్తిని విశ్వవేదిక మీద ఘనంగా చాటాయి. ఔషధాలు, టీకాల తయారీలో స్వయం సమృద్ధం కావటం అనితరసాధ్య విజయమని చెప్పుకొన్నా అతిశయోక్తి కాదు. మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు చేసిన, చేస్తున్న కృషి ఫలితంగా ఎన్నెన్నో రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞాన యాత్రలో మేలి మలుపుల లెక్కలేనన్ని. నేషనల్ టెక్నాలజీ డే (మే 11) సందర్భంగా వీటిల్లో కొన్నిటిని స్మరించుకోవటం ఎంతైనా అవసరం.
హరిత, క్షీర విప్లవాలు
మనకు స్వాత్రంత్యం వచ్చినప్పుడు దేశంలో గోధుమల దిగుబడి 60 లక్షల టన్నులే. ఇది 1964లో 1.2 కోట్ల టన్నులకు, 1970 వరకు 2 కోట్ల టన్నులకు చేరుకుంది. వరి దిగుబడి సైతం 4.2 కోట్ల టన్నులకు ఎగబాకింది. దీనికి కారణం హరిత విప్లవమే. ఆహార ఉత్పత్తుల్లో దేశం స్వయం సమృద్ధత సాధించటానికి బీజం వేసింది ఇదే. ఇందులో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త బెంజమీన్ పీరీ పాల్ చేసిన కృషి ఎనలేనిది. మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ వృద్ధి చేసిన నోరిన్-10 పొట్టి గోధుమ రకాన్ని తొలిసారి పండించటం దగ్గర్నుంచి.. ఆలిండియా కోఆర్డినేటెడ్ వీట్ రీసెర్చ్ ప్రాజెక్టుకు సారథ్యం వహించటం వరకూ అన్ని దశల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఇక క్షీర విప్లవం గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రిభువన్‌దాస్ కిశిభాయ్ పటేల్ అడుగుజాడల్లో నడిచి, అనంతరం అముల్ పగ్గాలు చేపట్టిన వర్ఘీస్ కురియన్ పాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధత సాధించేలా చేశారు. పాలు, పాల ఉత్పత్తుల తయారీలో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారు. గేదె పాల నుంచి పాలపొడిని తయారు చేయటం క్షీర విప్లవంలో కీలకమైంది. హరిశ్చంద్ మేఘ దలయ దీన్ని సుసాధ్యం చేసి భారత పాడి పరిశ్రమను మేలి మలుపు తిప్పారు.
ఉపగ్రహ, సమాచార విప్లవం
ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అధ్యక్షుడిగా విక్రమ్ సారాభాయి సమాచారం, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనా కోసం ఉపగ్రహ పరిజ్ఞానాన్ని వాడుకోవాలని 60ల్లో మార్గనిర్దేశనం చేశారు. ఇది సాధ్యమని ఎవరూ నమ్మలేదు. అప్పుడు మనదేశానికి రాకెట్లను గానీ ఉపగ్రహాలను గానీ నిర్మించే సామర్థ్యం లేదు. కానీ పదేళ్లలోనే దీన్ని సాధించింది. తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగంతో చరిత్ర సృష్టించింది. దీన్ని 1975లో సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో దీన్ని ఖగోళ ఎక్స్‌రే, ఏరోనామిక్స్, సోలార్ ఫిజిక్స్‌లో ప్రయోగాల కోసం రూపొందించింది. నాసాతో కలిసి ఇస్రో ఆరంభించిన శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్ (ఎస్‌ఐటీఈ) గ్రామాలకు టీవీ ప్రసారాలను చేరవేసింది.
ఫైబర్ ఆప్టిక్స్ సారధి
ప్రస్తుతం అంతర్జాలం అత్యధిక వేగంతో దూసుకుపోతుండటానికి వాడుకుంటున్న ఫైబర్ ఆప్టిక్స్‌ను ఆవిష్కరించింది మరెవరో కాదు. మనదేశానికే చెందిన భౌతిక శాస్త్రవేత్త నరిందర్ సింగ్ కపానీ. అందుకే ఆయనను ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడనీ పిలుస్తారు. నోబెల్ పురస్కారం అందుకోవటానికి అర్హులైన 20వ శతాబ్దపు విస్మృత మహనీయుల్లో ఒకరుగా ఫార్చ్యూన్ పత్రిక కపానీని పేర్కొనటం గమనార్హం. పీహెచ్‌డీ కోసం ఇంపీరియల్ కాలేజీకి వెళ్లిన సమయంలో ఆయన హరోల్డ్ హాప్‌కిన్స్‌తో కలిసి ఫైబర్ పరిజ్ఞానం మీద పనిచేశారు. తొలిసారిగా 1953లో భారీ ఆప్టికల్ ఫైబర్స్ గుచ్ఛంతో నాణ్యమైన ఇమేజ్‌లను ట్రాన్స్‌మిట్ చేయటంలో విజయం సాధించారు. ఈ పరిజ్ఞానానికి ఫైబర్ ఆప్టిక్స్ అనే నామకరణం చేసింది కూడా కపానీయే.
మార్క్-I చేతి పంపు
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లో మంచి నీటి కోసం బావులు తప్ప మరో మార్గమేదీ ఉండేది కాదు. శక్తిమంతమైన డ్రిల్ యంత్రాలు రావటంతో బోరు బావులు తవ్వటం మొదలైంది. ఈ సమయంలోనే భూగర్భజలాన్ని సమర్థంగా వినియోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం యునిసెఫ్‌తో చేతులు కలిపింది. ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత మార్క్-ఖిఖి చేతి పంపును రూపొందించారు. అప్పట్లో ఒక మెకానిక్ సొంతంగా రూపొందించిన షోలాపూర్ పంపు మన్నికైనదిగా పేరొందింది. దీని ఆధారంగానే మార్క్-ఖిఖి పంపును తయారుచేశారు. ఇదెంతగా ప్రాచుర్యం పొందిందంటే 90ల్లో 50 లక్షల పంపులను తయారుచేసి, బిగించారు.
తొలి డిజిటల్ కంప్యూటర్
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సమరేంద్ర కుమార్ మిత్రా మొట్టమొదటి దేశీయ అనలాగ్ కంప్యూటర్‌ను రూపొందించారు.
టెస్ట్‌ట్యూబ్ బేబీ యుగం
సంతానలేమితో బాధపడు తున్నవారికి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే టెస్ట్‌ట్యూబ్ బేబీ పరిజ్ఞానంలోనూ మనదేశం ఆదిలోనే కీర్తి గడిచింది. ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్‌ట్యూబ్ బేబీ పుట్టిన తర్వాత కేవలం 67 రోజుల్లోనే దీన్ని సాధించింది. మనదేశంలో 1978, అక్టోబరు 3న తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ దుర్గ జన్మించింది. ప్రపంచంలో రెండో టెస్ట్‌ట్యూబ్ బేబీ ఆమే కావటం విశేషం.
ధ్రువ స్థావరాలు
మనదేశం 1983లో అంటార్కిటికాలో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ ధ్రువానికి 2,500 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన దీని పేరు దక్షిణ గంగోత్రి. మొత్తం 81 మంది సభ్యులు 8 వారాల్లోనే నిర్మించి రికార్డు సృష్టించారు. తనంతతానుగా వాతావరణ వివరాలను నమోదు చేసే కేంద్రాన్ని ఇందులో నెలకొల్పారు. శాస్త్ర పరిశోధనల కోసం రేడియో ప్రసారాలనూ వినియోగించు కున్నారు. ఇది నిరుపయోగంగా మారిన తర్వాత 1989లో మైత్రి అనే శాశ్వత కేంద్రాన్ని నెలకొల్పారు. పర్యావరణ శాస్త్రాలకు ఇది అత్యాధునిక పరిశోధన కేంద్రంగా భాసిల్లుతోంది.
అంతరిక్ష ముద్ర
‘సారే జహాసే అచ్ఛా’. అంతరిక్షంలోంచి భారతదేశం ఎలా కనిపిస్తోందని మన మొట్టమొదటి వ్యోమగామి రాకేశ్ శర్మను అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానమిది. ఇస్రో-సోవియట్ ఇంటర్‌కాస్మోస్ సంయుక్త అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా ప్రయోగించిన సోయుజ్ టి-11 వ్యోమనౌక ద్వారా ఆయన అంతరిక్షంలో అడుగుపెట్టారు. ఈ ప్రయాణంలో భాగంగా రాకేశ్ శర్మ ఉత్తర భారతదేశం ఫొటోలను అద్భుతంగా తీశారు. సుమారు 8 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన ఆయన శాస్త్ర, సాంకేతిక అధ్యయనాలెన్నో నిర్వహించారు. శర్మతో పాటు ఇద్దరు రష్యా వ్యోమగాములను మనదేశం అశోకచక్ర బిరుదుతో సత్కరించింది. ‘హీరో ఆఫ్ సోవియట్ యూనియన్’ అవార్డునూ రాకేశ్ శర్మ అందుకున్నారు.
క్షిపణి జోరు
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో మనదేశం క్షిపణుల రంగంలోనూ గొప్ప ప్రగతిని సాధించింది. తొలిసారి 1988లో పృథ్వి అనే స్వల్పశ్రేణి క్షిపణిని పరీక్షించింది. అనంతరం అగ్ని క్షిపణుల శకం మొదలైంది. తొలి అగ్ని క్షిపణిని 1989, మే 22న పరీక్షించారు. 18 మీటర్ల పొడవు, 7 టన్నుల బరువుతో కూడిన ఇది 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేధించింది. సమీకృత మార్గదర్శక క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఇది మన ఘనతను చాటి చెప్పింది. వివిధ శ్రేణుల్లో లక్ష్యాలను ఛేదించే అగ్ని క్షిపణుల రూపకల్పనకు ఇది మార్గం వేసింది. అణ్వాయుధాలనూ మోసుకెళ్లే ఇవి 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ ఛేదించే సామర్థ్యాన్ని సాధించాయి.
* రష్యా సహకారంతో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి 2006లో నావికాదళంలో భాగమైంది. ఇది అత్యంత వేగంగా ప్రయాణించే సురక్షిత యుద్ధనౌక నాశక క్షిపణి కావటం విశేషం.
డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్
డీఎన్‌ఏ ప్రత్యేక గుణాలతో వ్యక్తులను గుర్తించే డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ రంగంలోనూ మనదేశం సత్తా చాటింది. ఈ పరిజ్ఞానం రూపకల్పన డాక్టర్ లాల్జీ సింగ్‌కే దక్కుతుంది. అందుకే ఆయనను ‘డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు’ అని పిలుచుకుంటున్నారు. పాముల్లో ఆయా సెక్స్ క్రోమోజోముల పరిణామం మీద అధ్యయనం చేస్తుండగా ఆయన డీఎన్‌ఏ క్రమంలో ఓ ప్రత్యేక క్రమం ఉంటున్నట్టు గుర్తించారు. దీనికి బీకేఎం సీక్వెన్సెస్ అనే పేరు పెట్టారు. అనంతరం సీసీఎంబీలో పనిచేస్తున్న సమయంలో వీటిని డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం ఉపయోగించుకోవచ్చని, మనుషుల్లోనూ దీన్ని వాడుకోవచ్చని నిరూపించారు. ఈ పరిజ్ఞానాన్ని 1991లో పితృత్వ వివాదానికి సంబంధించిన కేసులో వాడుకోవటంతో అప్పటి నుంచీ కొత్తరకం సాక్ష్యంగా ఉపయోగపడుతూ వస్తోంది.
పరమ్- సూపర్ కంప్యూటర్
మన కంప్యూటింగ్ పరిజ్ఞానానికి పరమ్ సూపర్ కంప్యూటర్ ప్రత్యక్ష నిదర్శనం. అమెరికా, భారత్ మధ్య 1987లో జరిగిన టెక్నాలజీ సమావేశం దీనికి పునాది వేసింది. అమెరికా అధ్యక్షుడు మనదేశానికి అత్యాధునిక క్రే కంప్యూటర్‌కు బదులు కాలం చెల్లిన కంప్యూటర్‌ను ఇస్తామని, దాన్ని వాతావరణ అంచనాకు మాత్రమే వాడుకోవాలని షరతు పెట్టారు. ఆధునిక ఆయుధ వ్యవస్థలకు ఇది సరిపోదు. దీంతో సొంత సూపర్ కంప్యూటర్‌ను రూపొందించాలని మనదేశం భావించింది. ఇందుకోసం 1988లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సి-డ్యాక్)ను నెలకొల్పింది. అనుకున్నట్టుగానే 1991లో పరమ్ 8000 సూపర్ కంప్యూటర్ ఆవిర్భవించింది.
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ 1959లో మన దేశానికి చెందిన తొలి డిజిటల్ కంప్యూటర్‌ను రూపొందించింది. దీని పేరు టీఐఎఫ్‌ఆర్‌ఏసీ.
అణ్వాయుధ బలం
అది 1998, మే 13. అణ్వాయుధ సంపత్తి గల ఆరో దేశంగా భారత్ ఆవిర్భవించిందంటూ అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయీ సంచలన ప్రకటన చేశారు. అంతకు రెండు రోజుల ముందే మే 11న పోక్రాన్-2 అణ్వాయుధ పరీక్షలకు ఉద్దేశించిన ‘ఆపరేషన్ శక్తి’ మొదలైంది. ఈ కార్యక్రమంలో వరుసగా ఐదు అణ్వాయుధ పరీక్షలను నిర్వహించి మనదేశం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఒక ఫ్యూజన్, రెండు ఫిజన్, రెండు సబ్-కిలొటన్ పరికరాలను ఇందుకు వినియోగించుకున్నారు. వివిధ రకాల, శ్రేణుల అణ్వాయుధాలను తయారుచేసే శక్తి మనకుందని ఇది నిరూపించింది. ఇతర దేశాలకు అనుమానం రాకుండా వీటిని నిర్వహించటం గమనార్హం. దీని విశిష్టతను, ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ మే 11ను నేషనల్ టెక్నాలజీ డే రూపంలో నిర్వహించుకుంటున్నాం. అంతకుముందు 1974లో మే 18న మనదేశం మొట్టమొదటి సారిగా అణు పరీక్ష (పోక్రాన్-1) నిర్వహిం చింది.
చంద్రయాన్
మన అంతరిక్ష పరిశోధన రంగంలో చంద్రయాన్ మేలిమలుపు. 2008, అక్టోబరు 22న చంద్రయాన్-1 ప్రయోగించారు. దీంతో పంపించిన ఆర్బిటర్ చంద్రుడి మీద నీటి ఆనవాళ్లను గుర్తించింది. చంద్రుడి పటాన్ని రూపొందించింది. వాతావరణ తీరుతెన్నులనూ విశ్లేషించింది. దీన్ని చంద్రయాన్-2 మరింత విస్తృతం చేసింది. 2019, జులై 22న దీన్ని ప్రయోగించారు. అయితే దీని ద్వారా చంద్రుడి మీద దిగిన ల్యాండర్ విఫలమైంది. కానీ ఆర్బిటర్ మాత్రం పనిచేస్తూనే ఉంది. శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తోంది. చంద్రుడి ధ్రువాలను అన్వేషించటానికి ఉద్దేశించిన చంద్రయాన్ 3ని త్వరలో ప్రయోగించనున్నారు.
* మంగళయాన్: 2013, నవంబరు 5న ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం) మరో చరిత్ర సృష్టించింది. అంగారకుడి వాతావరణం, ఉపరితలం తీరుతెన్నులు, ఖనిజాల వంటి వివరాల మీద ఇది అధ్యయనం నిర్వహించింది. అతి తక్కువ ఖర్చుతో చేపట్టిన ప్రయోగంగా కీర్తి గడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు