గూగులమ్మ ఇంట ఏఐ పంట!

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. దీని పుణ్యమాని టెక్స్ట్‌తోనే సమస్త సమాచార సారాంశాన్ని, ఇమేజ్‌లను, వీడియోలను సృష్టించటం చిటికెలో సాధ్యమైపోతోంది. అందుకే అన్ని టెక్‌ సంస్థలూ ఏఐ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.

Updated : 17 May 2023 12:26 IST

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) రేపుతున్న కలకలం అంతా ఇంతా కాదు. దీని పుణ్యమాని టెక్స్ట్‌తోనే సమస్త సమాచార సారాంశాన్ని, ఇమేజ్‌లను, వీడియోలను సృష్టించటం చిటికెలో సాధ్యమైపోతోంది. అందుకే అన్ని టెక్‌ సంస్థలూ ఏఐ మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. టెక్‌ దిగ్గజం గూగుల్‌ వార్షిక సమావేశం ఐ/ఓ 2023 దీనికి తాజా నిదర్శనం. ఎప్పుడూ కొత్త కొత్త పరిజ్ఞానాలతో ఊరించే ఇది ఈసారి సర్వత్రా ఏఐ గురించే ప్రస్తావించింది. మ్యాప్స్‌, జీమెయిల్‌, ఫొటోస్‌, డాక్స్‌.. అన్నింటినీ ఏఐ టూల్స్‌తోనే సుసంపన్నం చేయటానికి శ్రీకారం చుట్టింది. బార్డ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. జీమెయిల్‌కు రాత టూల్‌ను జోడించింది. ఐ/ఓ సమావేశంలో ప్రకటించిన  ఇలాంటి కొన్ని టూల్స్‌ గురించి తెలుసు కుందామా.


మ్యాప్స్‌ శోభాయమానం

గూగుల్‌ కొత్త సాధనాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాటిల్లో ఒకటి- గూగుల్‌ మ్యాప్స్‌ ‘ఇమ్మెర్సివ్‌ వ్యూ’. ఆయా మార్గాలను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగించటం దీని ప్రత్యేకత. దీని ద్వారా మనం అక్కడికి వెళ్లకముందే ఆయా ప్రాంతాల్లో ‘పర్యటించొచ్చు’. గూగుల్‌ మ్యాప్స్‌ ఇమ్మెర్సివ్‌ వ్యూ ఫీచర్‌ అధునాతన ఏఐ విధానమైన న్యూరల్‌ రేడియన్స్‌ ఫీల్డ్స్‌ (ఎన్‌ఈఆర్‌ఎఫ్‌) సాయంతో పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించుకునే ఆయా పరిసరాల వాస్తవ 3డీ ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. ప్రత్యక్షంగా మనం అక్కడికి వెళ్లి చూస్తున్న భావన కలిగిస్తుంది. తేలికగా ప్రయాణాలకు సిద్ధం కావటానికి, కొత్త ప్రదేశాల్లో బెరుకు లేకుండా తిరగటానికిది బాగా తోడ్పడుతుంది.

* ఇమ్మెర్సివ్‌ వ్యూతో మార్గాల పక్క ఫుట్‌పాత్‌లు, బైక్‌ వరుసలు, పార్కింగ్‌ వసతులు, కూడళ్ల వంటి వాటి ప్రివ్యూ చూడొచ్చు. ఇంటి నుంచి బయలు దేరటానికి ముందే వీటిని సమగ్రంగా చూసుకోవచ్చు.

* దీనిలోని టైమ్‌ స్లైడర్‌ ఫీచర్‌ ఎప్పటికప్పుడు గాలి స్వచ్ఛత సమాచారాన్నీ తెలుపుతుంది. వాతావరణం మారుతున్నప్పుడు ప్రయాణ మార్గంలో ఏర్పడే మార్పులను వివరిస్తుంది. దీంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏయే వస్తువులు వెంట తీసుకెళ్లాలో, అవసరమైతే ఎలాంటి మార్పులు చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు.

* ఇది ఆయా రోడ్ల మీద గతంలో వాహనాల ప్రయాణ తీరుతెన్నులను విశ్లేషించి సిమ్యులేట్‌ చేస్తుంది. దీంతో ఆ సమయంలో ఆ రోడ్డు మీద ఎన్ని కార్లు ఉన్నాయో తెలియజేస్తుంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయం, ఇతర సమయాలను పరిగణనలోకి తీసుకొని మరీ దీన్ని వివరిస్తుంది.

* గూగుల్స్‌ ఇమ్మెర్సివ్‌ వ్యూ ఫీచర్‌ సేవలను 15 అంతర్జాతీయ నగరాలు.. ఆమ్‌స్టర్‌డామ్‌, బెర్లిన్‌, డబ్లిన్‌, ఫోరెన్స్‌, లాస్‌ వేగాస్‌, లండన్‌, లాస్‌ఏంజెలిస్‌, న్యూయార్క్‌, మియామీ, పారిస్‌, సీటెల్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో, శాన్‌ జోస్‌, టోక్యో, వెనిస్‌లో ప్రారంభించారు. మనదేశంలో వచ్చే సంవత్సరంలో ఆరంభం కావొచ్చని భావిస్తున్నారు.


ప్రాజెక్ట్‌ టెయిల్‌విండ్‌

ప్రభుత్వ పథకం పేరులా అనిపించినప్పటికీ ఇదో ఏఐ ఆధారిత నోట్‌బుక్‌ టూల్‌. అక్కడక్కడున్న నోట్స్‌ను ఒకదగ్గరికి చేర్చి, వాటిని క్రమంగా పేర్చటం దీని ఉద్దేశం. ల్యాబ్స్‌ ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది. దీన్నెలా ఉపయోగించుకోవాలో తెలుసా? గూగుల్‌ డ్రైవ్‌ ద్వారా ఫైళ్లను ఎంచుకుంటే.. ఇది ప్రైవేట్‌ ఏఐ నమూనాను సృష్టిస్తుంది. కీలకమైన అంశాలను హైలైట్‌ చేస్తుంది. ప్రశ్నలను సూచిస్తుంది. సమగ్ర క్విజ్‌నూ రూపొందిస్తుంది. నోట్స్‌ గురించి మనం అడిగే ప్రశ్నలకూ జవాబిస్తుంది. డాక్యుమెంట్ల అంశాలను వెతికే రచయితలు, విద్యార్థులకిది బాగా ఉపయోగపడుతుంది. కేసులను సమీక్షించటానికి న్యాయవాదులకూ చేదోడుగా నిలుస్తుంది.


డాక్స్‌కు సైడ్‌కిక్‌

గూగుల్‌ డాక్స్‌లో ఏదో రాస్తుంటాం. దాన్ని ఎప్పటికప్పుడు చదువుతూ, అవసరమైన మార్పులు సూచిస్తూ, మరింత మెరుగ్గా రాసే ఏర్పాటుంటే? సైడ్‌కిక్‌ అలాంటి టూలే. రాసే విధానాన్ని మరింత మెరుగుపరచటం దీని ఉద్దేశం. గూగుల్‌ డాక్స్‌లో ఏదైనా రాస్తుంటే ఇది పక్కనే ఓపెన్‌ అవుతుంది. మనం రాస్తున్నప్పుడే దాన్ని చదివేస్తూ, విశదీకరిస్తుంది.


మడత పిక్సెల్‌ ఫోన్లు

డత ఫోన్లను ఇష్టపడేవారి కోసం సరికొత్త పిక్సెల్‌ ఫోన్‌ను గూగుల్‌ పరిచయం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మడత ఫోన్లలో ఇదే అతి సన్నదని భావిస్తున్నారు. రెండు బ్యాటరీల వ్యవస్థ, పలుచటి కెమెరా లెన్సులు దీని ప్రత్యేకత. పూర్తిగా తెరిస్తే 7.6 అంగుళాల తెరతో కనువిందు చేస్తుంది. దీనిలోని సాఫ్ట్‌వేర్‌ బయటి, అంతర్గత స్క్రీన్ల మధ్య అంతరాయం లేకుండా మారుతుండటం గమనార్హం. కొత్త టేబుల్‌టాప్‌ మోడ్‌ మరో ఆకర్షణ.


శోధన కొత్తగా

గూగుల్‌ సెర్చ్‌కూ కృత్రిమ మేధ తోడవనుంది. అంశాలను త్వరగా అర్థం చేసుకోవటానికి, కొత్త అభిప్రాయాలను, గూఢార్థాలను వెలికి తీయటానికిది తోడ్పడనుంది. ఇమేజ్‌ అంశాన్ని, సందర్భాన్ని మరింత బాగా అర్థం చేసుకోవటానికి ‘అబౌట్‌ దిస్‌ ఇమేజ్‌’ ఫీచర్‌నూ పరిచయం చేసింది. ఇమేజ్‌ను ఏఐ సృష్టించిందా? అనేదీ దీంతో తెలుసుకోవచ్చు. ఇలా ఇమేజ్‌ విశ్వసనీయమైనదో, కాదో ఇట్టే తేలిపోతుంది.


వాల్‌ పేపర్ల సృష్టి

కొత్త పిక్సెల్‌ 7ఏ ఫోన్‌ చేతిలో ఉంటే మనకు మనమే ఇష్టమైన వాల్‌పేపర్లు సృష్టించుకోవచ్చు. టెక్స్ట్‌ నుంచి ఇమేజ్‌లను పుట్టించే ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లకు జతచేశారు మరి. నాలుగైదు క్లిక్స్‌తోనే ఇష్టమైన వాల్‌పేపర్లను తయారుచేసుకోవచ్చు. ఎంచుకున్న వాల్‌పేపర్‌ను బట్టి ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌లోని కలర్‌ పాలెట్‌ దానంతటదే మారిపోతుంది కూడా.


పదాలతో సంగీతం

గూగుల్‌ కొత్త ప్రయోగాత్మక ఏఐ సాధనం మ్యూజిక్‌ఎల్‌ఎం. ఇది టెక్స్ట్‌ ప్రాంప్ట్‌ను సంగీతంగా మారుస్తుంది. స్నేహితులకు విందు ఇస్తున్నారనుకోండి. విందు కోసం ఆహ్లాదరకమైన సంగీతం అని టైప్‌ చేస్తే చాలు. వివిధ రకాల్లో పాటను సృష్టిస్తుంది. కావాలంటే ఇష్టమైన వాయిద్యాన్నీ ఎంచుకోవచ్చు. ఎలక్ట్రానిక్‌, క్లాసికల్‌ వంటి వాటిని ఎంచుకొని సంగీతాన్ని మార్చుకోవచ్చు.


పామ్‌ 2

పెన్‌ఏఐకి చెందిన జీపీటీ-4 మాదిరిగా పామ్‌ 2 కూడా అత్యంత శక్తిమంతమైన లాంగ్వేజీ మోడల్‌. కోడ్‌, రీజనింగ్‌తో పాటు పలు భాషలనూ అవగతం చేసుకోగలదు. పెద్దమొత్తంలో టెక్స్ట్‌ను విడమరచుకోగలదు. దీనికి సంబంధించిన మెడ్‌ పామ్‌ 2 వర్షన్‌ ఆరోగ్య సమస్యలకూ సమాధానాలు ఇవ్వగలదు. అమెరికా వైద్య లైసెన్స్‌ పరీక్షలో దీనికి 85.4 శాతం మార్కులు రావటం విశేషం. అంటే వైద్య నిపుణులతో సమానంగా పని చేస్తుందన్నమాట.


ఫొటోలు, మెసేజ్‌లు ఆకర్షణీయం

ఫొటోలు తీయటంతోనే ఊరుకుంటామా? మరింత అందంగా తీర్చిదిద్దాలనీ భావిస్తాం. దీనికోసమే ఏఐ ఆధారిత మ్యాజిక్‌ ఎడిటర్‌ను గూగుల్‌ ప్రవేశపెట్టింది. ఇది ఫొటోలో ఆయా భాగాల్లో సంక్లిష్టమైన మార్పులనూ చేయగలదు. లోపాలను పూరించగలదు. కావాలంటే మరింత బాగా కనిపించటానికి మన పొజిషన్‌ను కూడా సరిచేయగలదు. ఉదాహరణకు- నలుగురితో కలిసి జలపాతం ముందు ఫొటో దిగారనుకోండి. మీరొక్కరే కనిపించేలా మిగతావారిని తొలగించేయొచ్చు. బ్యాగు తగిలించుకుంటే దాన్ని కనిపించకుండా చేయొచ్చు. ఇలాంటి సదుపాయాలు మ్యాజిక్‌ ఎరేజర్‌ ద్వారా గూగుల్‌ ఫొటోస్‌లో ఉన్నప్పటికీ అవసరమైన దాన్ని రీపొజిషన్‌ చేసే సామర్థ్యాన్ని కొత్తగా కల్పించారు. ఫొటో ముందు అంశాన్ని కత్తిరించేసి, దాన్ని డ్రాగ్‌ లేదా డ్రాప్‌ చేసి స్థానాన్ని సవరించొచ్చు.

* మెసేజ్‌లను వివిధ శైలుల్లో రాసుకోవటానికి తోడ్పడే మ్యాజిక్‌ కంపోజ్‌ ఫీచర్‌ మరో మంచి ఫీచర్‌. టెక్స్ట్‌ మెసేజ్‌ల ద్వారా ఎక్కువగా చర్చలు సాగించేవారికిది బాగా ఉపయోగపడుతుంది. గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ ఉంటే దీన్ని వాడుకోవచ్చు. మెసేజ్‌ను టైప్‌ చేశాక మ్యాజిక్‌ కంపోజ్‌ సాయంతో దానికి ఇష్టమైన రూపాన్ని ఇవ్వచ్చు. ఉదాహరణకు- మెసేజ్‌ మరింత సానుకూలంగా, వినోదాత్మకంగా, వృత్తిపరంగా ఉండేలా చూసుకోవచ్చు. ప్రముఖ రచయితల శైలిలోనూ మార్చుకోవచ్చు.


జీమెయిల్‌లో రాత సాయం

జీమెయిల్‌కూ కృత్రిమ మేధ టూల్‌ను జత చేయటం విశేషం. దీని పేరు ‘హెల్ప్‌ మీ రైట్‌’. పేరుకు తగ్గట్టుగానే ఇది ఈమెయిళ్లు రాయటంలో సహకరిస్తుంది. త్వరలోనే గూగుల్‌ వర్క్‌స్పేస్‌ అప్‌డేట్స్‌లో దీన్ని చేర్చనున్నారు. ఇది వెబ్‌, మొబైల్‌ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.
ఇప్పటికే జీమెయిల్‌లో స్మార్ట్‌ రిప్లై.. ఒక్క క్లిక్‌తో ప్రతిస్పందనలను ఎంచుకునే సదుపాయం ఉంది. ఏదైనా రాస్తున్నప్పుడు తర్వాత పదాన్ని సూచించే స్మార్ట్‌ కంపోజ్‌ ఫీచర్‌ కూడా ఉంది. వీటికి మించి ‘హెల్ప్‌ మీ రైట్‌’ సాయం చేస్తుంది. మనం రాయాలనుకునే మెయిల్‌కు తగిన మాటలను (ప్రాంప్ట్‌) అందిస్తే చాలు. దానికి తగినట్టుగానే తనకు తానే మెయిల్‌ను రాసి పెడుతుంది. ఉదాహరణకు- విమాన ప్రయాణం రద్దయినట్టు మెయిల్‌ వచ్చిందనుకోండి. దానికి రిప్లయ్‌గా రిఫండ్‌ను కోరుతూ మెయిల్‌ రాయాలని సూచించి, క్రియేట్‌ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే మొత్తం ప్రతి మన ముందు ప్రత్యక్షమవుతుంది. కావాలనుకుంటే దీన్ని విపులంగా, క్లుప్తంగా మార్చుకునే సదుపాయమూ ఉంటుంది.


ఎలా ఉపయోగించుకోవాలి?

1 హెల్ప్‌ మీ రైట్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక ఎవరైనా వాడుకోవచ్చు. ముందుగా జీమెయిల్‌ అకౌంట్‌కు లాగిన్‌ అవ్వాలి.

2 కొత్త మెయిల్‌ రాయటానికి కంపోజ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. ఈమెయిల్‌ రాయటం మొదలెట్టాలి.

3 టైప్‌ చేస్తున్నప్పుడు సెండ్‌ బటన్‌ పక్కన నక్షత్రంతో కూడిన పెన్సిల్‌ గుర్తు మీద క్లిక్‌ చేస్తే ‘హెల్ప్‌ మీ రైట్‌’ మెనూ ఓపెన్‌ అవుతుంది.

4 ఈ మెనూలో సజెస్టింగ్‌ వర్డ్స్‌, ప్రేజెస్‌, కంప్లీటింగ్‌ సెంటెన్సెస్‌, జనరేటింగ్‌ ఈమెయిల్‌ టెంప్లేట్స్‌, చెకింగ్‌ గ్రామర్‌ అండ్‌ స్పెల్లింగ్‌ వంటి రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో అవసరమైన ఆప్షన్‌ ఎంచుకుంటే కృత్రిమ మేధ మనకు రాతలో సాయం చేస్తుంది.

5 ఈమెయిల్‌ రాయటం పూర్తయ్యాక సెండ్‌ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు.


బార్డ్‌ అందరికీ

ఛాట్‌జీపీటీకి ప్రతిగా రూపొందించిన బార్డ్‌ కోసం ఇకపై వేచి ఉండాల్సిన అవసరం లేదు. గూగుల్‌ దీన్ని 180 దేశాల్లో అందరికీ ఇంగ్లిషులో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడిది జపనీస్‌, కొరియన్‌ భాషలనూ సపోర్టు చేస్తుంది. త్వరలో దీన్ని 40 భాషలకూ విస్తరించనున్నారు. ఇది దృశ్యాల రూపంలోనూ ప్రాంప్ట్‌లను స్వీకరిస్తుండటం విశేషం. అలాగే దృశ్యాలతోనూ సమాధానాలను వివరిస్తుంది. బార్డ్‌ ద్వారా ఇమేజ్‌లను సృష్టించటానికి అడోబ్‌తోనూ జట్టుకట్టింది. ఫైర్‌ఫ్లై యాప్‌ ద్వారా ఇమేజ్‌లను సృష్టించుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్‌ యాప్‌ సాయంతో సరిచేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్‌ లైబ్రరీకి చెందిన ఇతర సదుపాయాల నుంచి టెంప్లేట్లు, ఫాంట్లు, ఇమేజ్‌లను ఎంచుకొని, వాడుకోవచ్చు కూడా. లెన్స్‌ సాయంతో బార్డ్‌ కోడింగ్‌ సామర్థ్యాలనూ గూగుల్‌ విస్తరించనుంది. ఇది కోడ్‌ను సృష్టించటమే కాదు, కోడ్‌ స్నిప్పెట్స్‌నూ వివరిస్తుంది. దీంతో కోడ్‌ను డీబగ్‌ చేయటం వీలవుతుంది. మ్యాప్స్‌, షీట్స్‌, జీమెయిల్‌, డాక్స్‌ వంటి సొంత యాప్‌లకూ బార్డ్‌ను విస్తరించనున్నారు.


వర్టెక్స్‌లో ఇమాజెన్‌

గూగుల్‌ కొత్త ఏఐ నమూనాల్లో వర్టెక్స్‌ ఏఐ ఒకటి. ఇది పూర్తిగా కృత్రిమ మేధతోనే పనిచేస్తుంది. టెక్స్ట్‌ నుంచి ఇమేజ్‌లను సృష్టించే ఇమాజెన్‌ ఇందులో ఒక భాగం. గూగుల్‌ ఏఐ టెస్ట్‌ కిచెన్‌ యాప్‌లో ఇప్పటికే దీన్ని పరీక్షించారు. ఇది ఇమేజ్‌లను సృష్టించటంతో పాటు ఎడిట్‌ చేసి పెడుతుంది కూడా. ప్రస్తుత ఇమేజ్‌లకు క్యాప్షన్లనూ రాసి పెడుతుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని