ఉచితంగా వైరస్‌ కట్టడి!

కంప్యూటర్‌కు వైరస్‌లు పెద్ద పీడకలలు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దెబ్బతీయటం దగ్గరి నుంచి పీసీ సామర్థ్యాన్ని తగ్గించటం వరకూ రకరకాల ఇబ్బందులు సృష్టిస్తాయి.

Updated : 12 Jul 2023 05:26 IST

కంప్యూటర్‌కు వైరస్‌లు పెద్ద పీడకలలు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దెబ్బతీయటం దగ్గరి నుంచి పీసీ సామర్థ్యాన్ని తగ్గించటం వరకూ రకరకాల ఇబ్బందులు సృష్టిస్తాయి. ఫైళ్లు, డేటా కూడా పోతాయి. గోప్యతకు భంగం వాటిల్లుతుంది. ఇక్కడే యాంటీవైరస్‌లు ఆదుకుంటాయి. ఇవి సమర్థమైనవే అయినా ధర ఎక్కువ. అదృష్టం కొద్దీ కొన్ని ఉచిత మార్గాలతో పీసీని వైరస్‌ రహితం చేసుకోవచ్చు.

విండోస్‌ డిఫెండర్‌ సాయం

విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ గలవారికిది మంచి ప్రత్యామ్నాయం. ఇది బిల్టిన్‌గానే ఉంటుంది. అజ్ఞాత మార్గాల నుంచి మాల్వేర్‌లు, వైరస్‌లు పీసీ మీద దాడి చేయకుండా అడ్డుకుంటుంది. దీన్ని ఎనేబుల్‌ చేసుకోవటమూ తేలికే. స్టార్ట్‌ బటన్‌ను నొక్కి, బాక్సులో ‘విండోస్‌ సెక్యూరిటీ’ అని టైప్‌ చేయాలి. పాపప్‌ అయ్యే యాప్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో ‘వైరస్‌ అండ్‌ థ్రెట్‌ ప్రొటెక్షన్‌’ ఆప్షన్‌ ఉంటుంది. దీని మీద క్లిక్‌ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లి ‘మేనేజ్‌ సెటింగ్స్‌’ మీద నొక్కాలి. ఇందులో ‘రియల్‌-టైమ్‌ ప్రొటెక్షన్‌’ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటర్‌ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయటం లేదా ఇతర మార్గాలతో కన్‌ఫర్మ్‌ చేసుకుంటే చాలు. విండోస్‌ డిఫెండర్‌ యాక్టివ్‌ అవుతుంది. తరచూ పీసీని స్కాన్‌ చేస్తూ హానికర ముప్పుల గురించి హెచ్చరించి, తొలగిస్తుంది.

వైరస్‌ నేపథ్యప్రక్రియల కట్టడి

వైరస్‌లు తరచూ ప్రాసెస్‌ల రూపంలో అజ్ఞాతంగా పనిచేస్తుంటాయి. ఇవి జలగ మాదిరిగా పీసీ వనరులను పీల్చేస్తుంటాయి. వ్యక్తిగత వివరాల్లోకి తొంగి చూస్తుంటాయి. డేటానూ దొంగిలిస్తుంటాయి. ఇలాంటి అవాంఛిత బ్యాక్‌గ్రౌండ్‌ ప్రోగ్రామ్స్‌ బెడద తొలగించు కోవటానికి, కంప్యూటర్‌ను వైరస్‌ల బారి నుంచి కాపాడుకోవటానికి తేలికైన మార్గముంది. స్టార్ట్‌ బటన్‌ను నొక్కి, సెర్చ్‌ బాక్సులో ‘టాస్క్‌ మేనేజర్‌’ అని టైప్‌ చేసి, ఎంటర్‌ చేయాలి. అప్పుడు విండోస్‌ టాస్క్‌మేనేజర్‌ యాప్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో ప్రాసెసెస్‌ లేదా డిటెయిల్స్‌ విభాగంలో అనుమానిత ప్రాసెస్‌లను వెతకాలి. వాటిని ఎంచుకొని ‘ఎండ్‌ టాస్క్‌’ మీద క్లిక్‌ చేయాలి.

అజ్ఞాత స్టార్టప్‌ ప్రోగ్రామ్స్‌ డిసేబుల్‌

పీసీని ఆన్‌ చేసిన ప్రతిసారీ తెర దిగువన కుడివైపున పాపప్‌ అయ్యే చిన్న ఐకాన్లు చికాకు కలిగిస్తాయి. ఇవి హానికరమైనవి కావని అనిపించినప్పటికీ రహస్యంగా డేటాను దొంగిలిస్తాయి. బ్రౌజింగ్‌ హిస్టరీ మీద నిఘా వేస్తాయి. కంప్యూటర్‌ స్టార్టప్‌ వేగాన్ని నెమ్మదింప జేస్తాయి. అందువల్ల అంత ముఖ్యం కాని స్టార్టప్‌ ప్రోగ్రామ్స్‌ను డిసేబుల్‌ చేసుకోవటం మంచిది. ఇందుకోసం కీబోర్డు మీద కంట్రోల్‌, ఆల్ట్‌, డిలీట్‌ బటన్లు అన్నింటినీ కలిపి నొక్కాలి. మెనూలోంచి టాస్క్‌ మేనేజర్‌ను ఎంచుకోవాలి. స్టార్టప్‌ విభాగం మీద క్లిక్‌ చేస్తే బోలెడన్ని పేర్లు, ఐకాన్లు కనిపిస్తాయి. ఇవన్నీ సిస్టమ్‌ను బూట్‌ చేసినప్పుడు తమకు తామే లాంచ్‌ అయ్యే ప్రోగ్రామ్‌లే. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే దాని మీద రైట్‌ క్లిక్‌ చేసి ‘డిసేబుల్‌’ మీద నొక్కాలి. దీంతో దాని పని అక్కడితో ఆగిపోతుంది. ఇలాగే మిగతా అనుమానాస్పద ప్రాసెస్‌లను డిసేబుల్‌ చేసుకోవాలి. అనంతరం టాస్క్‌ మేనేజర్‌ను క్లోజ్‌ చేసి, పీసీని రీస్టార్ట్‌ చేయాలి. ఆ వెంటనే స్టార్టప్‌ ప్రాసెస్‌ వేగం పెరగటం, సాఫీగా సాగటం గమనించొచ్చు.

తాత్కాలిక ఫైళ్ల తొలగింపు

కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు వివిధ ప్రోగ్రామ్‌లు, యాప్‌లు తాత్కాలిక ఫైళ్లను సృష్టించు కుంటాయి. ఇవి కొంత సమాచారాన్ని దాచుకుంటాయి. దీని అవసరమేమీ ఉండదు. కొన్నిసార్లు ఇలాంటి తాత్కాలిక ఫైళ్ల వెనక హానికర సాఫ్ట్‌వేర్‌ దాగి ఉండొచ్చు. వీటిని డిలీట్‌ చేసుకుంటే ముప్పులనూ తగ్గించుకోవచ్చు. స్టార్ట్‌ బటన్‌ను నొక్కి, ‘డిస్క్‌ క్లీనప్‌’ కోసం వెతకాలి. ఇది ఓపెన్‌ అయ్యాక శుభ్రం చేసుకోవాల్సిన డ్రైవ్‌ను ఎంచుకొని ‘ఓకే’ మీద క్లిక్‌ చేయాలి. వివిధ రకాల ఫైళ్లను తొలగించాక ఎంత స్పేస్‌ మిగులుతుందో ఇది సూచిస్తుంది. రీసైకిల్‌ బిన్‌, డౌన్‌లోడ్స్‌, థంబ్‌నెయిల్స్‌.. ఇలా ఆయా బాక్సుల్లో టిక్‌ పెట్టుకోవాలి. ‘ఓకే’ బటన్‌ మీద క్లిక్‌ చేసి, కన్‌ఫర్మ్‌ చేసుకుంటే తాత్కాలిక ఫైళ్లు పోతాయి. ఒకవేళ విండోస్‌ అప్‌డేట్‌ లేదా ప్రీవియస్‌ ఇన్‌స్టలేషన్‌ వంటి మరిన్ని ఫైళ్లను డిలీట్‌ చేసుకోవాలనుకుంటే ‘క్లీనప్‌ సిస్టమ్‌ ఫైల్స్‌’ ఆప్షన్‌నూ ఎంచుకోవచ్చు. ప్రాసెస్‌ ముగిసేంతవరకు డిస్క్‌ క్లీనప్‌ యాప్‌ను క్లోజ్‌ చేయొద్దు. తర్వాత పీసీని రీస్టార్ట్‌ చేస్తే సరి. తాత్కాలిక ఫైళ్లతో పాటు వైరస్‌ల బెడదా తొలగిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని