‘కృత్రిమ’ ఉద్యోగి!

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. అడిగిన విషయాన్ని కథనాల రూపంలోనూ రాసి పెట్టే ఛాట్‌జీపీటీ దగ్గరి నుంచి ఇమేజ్‌లను సృష్టించటం వరకూ ఎన్నో పనులను చిటికెలో చేసి పెడుతుంది.

Updated : 12 Jul 2023 05:31 IST

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. అడిగిన విషయాన్ని కథనాల రూపంలోనూ రాసి పెట్టే ఛాట్‌జీపీటీ దగ్గరి నుంచి ఇమేజ్‌లను సృష్టించటం వరకూ ఎన్నో పనులను చిటికెలో చేసి పెడుతుంది. మరి ఇది ఉద్యోగాలూ చేయగలదంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా అనిపించినా ఒడిశాకు చెందిన ఒక ఐటీ కంపెనీ ఇటీవల ఏఐ ఆధారిత ఉద్యోగిని నియమించింది. పేరు మేధా కే. హోదా హెచ్‌ఆర్‌ అసిస్టెంట్‌. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే- దీనికి ఉద్యోగి కోడ్‌ను కేటాయించటం, జీతమూ ఇవ్వటం. అందరి ఉద్యోగుల మాదిరిగానే ఇదీ రోజుకు 8 గంటలే పనిచేస్తుంది. వారానికి రెండు రోజులు సెలవు తీసుకుంటుంది కూడా. ఛాట్‌జీపీటీతో అనుసంధానమై కంపెనీ ఉద్యోగులకు సహాయం చేయటం దీని పని. ప్రాంప్ట్‌లను అర్థం చేసుకొని, వాటి ఆధారంగా టెక్స్ట్‌ను సృష్టిస్తుంది. కేవలం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటమే కాకుండా కంటెంట్‌ రాయటం, భాషను అనువదించటం వంటి వాటికీ తోడ్పడుతుంది. దీనికి కంపెనీకి సంబంధించిన అన్ని విధానాల్లోనూ శిక్షణ ఇచ్చారు. ఎప్పటికప్పుడు భాషా నమూనాలను సరిచేయటానికి, ఉద్యోగుల నుంచి అందే ఫీడ్‌బ్యాక్‌ను జొప్పించటానికి దీనికి ఒక ట్రెయినర్‌ను ప్రత్యేకంగా నియమించారు. ఐటీ టికెట్‌ సపోర్టును కల్పించటానికి ఐటీ హెల్ప్‌డెస్క్‌ డేటాతో ఇప్పటికే ఎంతో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆయా ప్రాజెక్టులు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అని నిరంతరం కనిపెట్టుకొని ఉంటుంది. ఉద్యోగుల సమాచారంతోనూ మేధా కేను అనుసంధానం చేశారు. అందువల్ల ఉద్యోగులను గుర్తించటంతో పాటు వారి హాజరు, సెలవులు, శిక్షణ, విధుల మీద వేరే ప్రాంతాలకు వెళ్లటం వంటి వివరాలనూ నమోదు చేసుకుంటుంది. ఇలా హెచ్‌ఆర్‌ విభాగానికి తోడుగా నిలుస్తుంది. మనుషుల్లాగా ఇది అలసిపోదు కాబట్టి నిరంతరం సమాచారాన్ని విడమరచుకుంటుంది. సందర్భానుసారంగా అడిగిన విషయాలకు జవాబులు ఇస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని