ట్రిక్కు టమారం!
కంప్యూటర్‌ను తరచూ వాడేవారు ఇక కొత్త చిట్కాలు నేర్చుకోవాల్సిన పనిలేదని, తమకు అంతా తెలుసని భావిస్తుంటారు. నిజానికి కొత్త మార్గాలకు కొదవలేదు
కంప్యూటర్‌ను తరచూ వాడేవారు ఇక కొత్త చిట్కాలు నేర్చుకోవాల్సిన పనిలేదని, తమకు అంతా తెలుసని భావిస్తుంటారు. నిజానికి కొత్త మార్గాలకు కొదవలేదు. నిత్యనూతన సాంకేతిక పరిజ్ఞానంలో రోజూ ఎన్నెన్నో కొత్త ఫీచర్లు తోడవుతూనే వస్తుంటాయి. వీటిల్లో మనకు తెలియనివి చాలానే ఉండొచ్చు. వీటి గురించి తెలుసుకుంటే పీసీ మీద పని చేస్తున్నప్పుడు నైపుణ్యాలను మెరుగు పరచుకోవటానికి ఎంతగానో ఉపయోగపడతాయనటంలో సందేహం లేదు. అలాంటి కొన్ని సాధారణ, టైపింగ్, కీబోర్డు షార్ట్‌కట్స్, వెబ్ బ్రౌజింగ్, ఫైల్ మేనేజ్‌మెంట్ ట్రిక్కులు తెలుసుకుందాం.
క్లోజయిన ట్యాబ్ తిరిగి
వెబ్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు తెలిసీ తెలియకో, పొరపాటుననో ట్యాబ్‌ను క్లోజ్ చేస్తుంటాం. ఆనక అయ్యో అని చింతిస్తుంటాం. తిరిగి దాన్ని చూడాలంటే హిస్టరీలోకి వెళ్లి ఓపెన్ చేస్తాం. అంత పని అవసరం లేదు. కంట్రోల్, షిఫ్ట్, టి మీటలను కలిపి నొక్కితే, అంతకుముందు క్లోజ్ చేసిన ట్యాబ్ వెంటనే ఓపెన్ అవుతుంది. మ్యాక్‌లోనైతే కమాండ్, షిఫ్ట్, టి మీటలను కలిపి నొక్కాలి.
వేగం వేగం
బూట్ కావటానికి పీసీ ఎక్కువ సమయం తీసుకుంటోందా? దీనికి కారణం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ రన్ కావటం కావొచ్చు. వీటిని తగ్గించుకుంటే కంప్యూటర్ వేగం పుంజుకుంటుంది. విండోస్ సిస్టమ్‌లో కంట్రోల్, షిఫ్ట్, ఎస్క్ మీటలను కలిపి నొక్కితే చాలు. స్టార్టప్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. విండోస్ 7, అంతకుముందు పీసీల్లోనైతే విండోస్ కీ, ఆర్ బటన్లను కలిపి నొక్కాలి. ప్రోగామ్స్ జాబితాల్లోంచి అనవసరమైన వాటిని ఎంచుకొని ఆఫ్ చేసుకోవాలి. మ్యాక్‌లోనైతే సిస్టమ్ ప్రిఫరెన్స్ ద్వారా యూజర్స్ అండ్ గ్రూప్స్‌లోకి వెళ్లి యూజర్‌ను ఎంచుకోవాలి. లాగిన్ ఐటమ్స్ మీద ట్యాబ్ చేసి స్టార్టప్ యాప్‌లను తొలగించుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు.
నేరుగా అడ్రస్ బార్‌కు
వెబ్‌పేజీలో నేరుగా అడ్రస్ బార్‌లోకి చేరటానికి ఎఫ్6 బటన్ నొక్కాలి. కంట్రోల్, ఎల్ బటన్లు కలిపి నొక్కితే బుక్‌మార్కు సైట్ల జాబితా కనిపిస్తుంది కూడా.
ఫోన్ నుంచి పీసీకి ఫొటో
ఫోన్‌తో ఫొటో తీసుకుంటాం. వెంటనే దాన్ని పీసీలోకి చేర్చాలంటే? ఏముంది.. కేబుల్‌తో కనెక్ట్ అయ్యి కాపీ, పేస్ట్ చేస్తామంటారా? అది సరేగానీ ఫోన్‌లోని ఫొటోలను నేరుగా పీసీలో చూడాలంటే? మ్యాక్, ఐఫోన్ వాడేవారు కమ్యూనిటీ కెమెరాతో దీన్ని తేలికగా చేసుకోవచ్చు. దీన్ని సపోర్టు చేసే యాప్‌లో టాప్ మెనూలోకి వెళ్లి ఎడిట్‌ను ఎంచుకోవాలి. తర్వాత ఇన్‌సర్ట్ యువర్ ఐఫోన్ ఆర్ ఐప్యాడ్ ద్వారా టేక్ ఫొటో లేదా స్కాన్ డాక్యుమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఐఫోన్‌లోని కెమెరా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఫొటో తీస్తే నేరుగా డెస్క్‌టాప్ మీద ప్రత్యక్షమవుతుంది.
ఒకేసారి అన్ని ట్యాబులు వెనక్కి!
మానిటర్ మీద వేర్వేరు ట్యాబులు ఓపెన్ చేసి ఉన్నాయి. డెస్క్‌టాప్‌ను చూడాలంటే ఒక్కో దాన్నీ మినిమైజ్ చేయాల్సి ఉంటుంది. అన్ని ట్యాబులనూ ఒకేసారి మినిమైజ్ అయితే? దీనికి కంట్రోల్, ట్యాబ్ మీటలను ఉపయోగించుకోవచ్చు. ఆల్ట్, షిఫ్ట్, ట్యాబ్ బటన్లను కలిపి నొక్కితే అన్నీ ఒకేసారి మినిమైజ్ అవుతాయి. మళ్లీ అవే మీటలను నొక్కితే ఒకేసారి అన్నీ ఓపెన్ అవుతాయి. విండోస్ కీ, డి బటన్లు కలిపి నొక్కినా అన్ని ట్యాబులు ఒకేసారి మినిమైజ్ అవుతాయి. విండోస్ కీ, ఎం బటన్లతోనూ ట్యాబ్‌లన్నీ మినిమైజ్ అవుతాయి గానీ తిరిగి ఓపెన్ చేయాలంటే ఒక్కో ట్యాబ్‌ను విడివిడిగా క్లిక్ చేయాల్సి ఉంటుంది.
యూట్యూబ్ భిన్నంగా..
యూట్యూబ్ వీడియోను పాజ్ చేయటానికి స్పేస్‌బార్ మీటను చాలామంది ఉపయోగిస్తూనే ఉంటారు. ఇదొక్కటే కాదు, కె మీట కూడా వీడియో పాజ్, స్టార్ట్ కావటానికి తోడ్పడుతుంది. వీడియోను వెనక్కి జరపటానికి జె, ముందుకు జరపటానికి ఎల్ మీటలను వాడుకోవచ్చు. మ్యూట్ చేసుకోవాలంటే ఎం బటన్ నొక్కితే చాలు.
గాడ్ మోడ్ ఫోల్డర్
ఏ సెటింగ్స్‌నైనా చిటికెలో చూసుకోవటానికి తోడ్పడేది గాడ్ మోడ్. విండోస్ విస్టా 2007 నుంచే ఇది ఆరంభమైంది. అప్పట్నుంచి విండోస్ 10, విండోస్ 11 వరకూ మారకుండా వస్తోంది. దీన్ని డెస్క్‌టాప్ మీద మనమే సృష్టించుకోవచ్చు. డెస్క్‌టాప్ మీద రైట్ క్లిక్ చేసి, క్రియేట్ ఫోల్డర్‌ను ఎంచుకోవాలి. కొత్త ఫోల్డర్‌ను సృష్టించుకున్నాక GodMode.{ED7BA470-8E54-465E-825C-99712043E01C} అని పేరు పెట్టుకోవాలి. అంతే. ఆ ఫోల్డర్ కంట్రోల్ ప్యానెల్ రూపంలోకి మారిపోతుంది. ఇందులో 200కు పైగా సెటింగ్స్ మెనూ అందుబాటులో ఉండటం విశేషం. వీటి ద్వారా ఎలాంటి సెటింగ్ మార్పులైనా చేసుకోవచ్చు. ముద్దుగా గాడ్ మోడ్ అని పిలుచుకుంటుంటారు గానీ దీని అసలు పేరు ‘విండోస్ మాస్టర్ కంట్రోల్ ప్యానెల్ షార్ట్‌కట్’. పలకటానికి తేలికగా ఉంటుందని బ్లాగర్లు దీనికి గాడ్ మోడ్ పేరును ఖాయం చేసేశారు.
అంకెల మీటల గారడీ
టాస్క్‌బార్ మీద రకరకాల ప్రోగ్రామ్‌లు ఉండొచ్చు. వాటిని తేలికగా ఓపెన్ చేయటానికి విండోస్ కీ, అంకెల మీటలను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు టాస్క్‌బార్ మీద క్రోమ్ రెండో అప్లికేషన్‌గా ఉన్నట్టయితే విండోస్ కీ, 2 మీటలను కలిపి నొక్కాలి. అప్పుడు వెంటనే క్రోమ్ ఓపెన్ అవుతుంది. అప్పటికే క్రోమ్ ఓపెన్ అయ్యుంటే దాన్ని హైలైట్ చేస్తుంది. ఒకవేళ ఓపెన్ అయ్యుంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు.
టైపింగ్ రయ్ రయ్
టెక్స్ట్‌ను కాపీ చేయటానికి కంట్రోల్, సి బటన్లను.. పేస్ట్ చేయటానికి కంట్రోల్, వి బటన్లను కలిపి నొక్కటం తెలిసిందే. సాధారణంగా టెక్స్ట్‌ను కాపీ చేసినప్పుడు దాని ఫార్మాట్ కూడా కాపీ అవుతుంది. మరి కేవలం మామూలు టెక్స్ట్‌ను మాత్రమే పేస్ట్ చేయాలంటే? కంట్రోల్, వి బటన్లకు బదులు కంట్రోల్, షిఫ్ట్, వి బటన్లను కలిపి నొక్కితే సరి. దీంతో ఫార్మాట్ రహిత టెక్స్ట్ పేస్ట్ అవుతుంది. మ్యాక్‌లోనైతే కమాండ్, ఫిష్ట్, వి బటన్లను కలిపి నొక్కాలి.
* వర్డ్‌ప్యాడ్‌లో ఏదైనా పదాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఒక్కొక్క అక్షరాన్ని తొలగించాల్సిన అవసరమేమీ లేదు. కంట్రోల్, బ్యాక్‌స్పేస్ మీటలను కలిపి నొక్కితే కర్సర్ వెనకున్న పదమంతా ఒకేసారి డిలీట్ అవుతుంది.
* పదం ముందు లేదా వెనక ఏదైనా టైప్ చేయాలంటే కర్సర్‌ను అక్కడికి తీసుకెళ్తాం. కానీ కంట్రోల్, యారో బటన్లతోనే ముందుకూ వెనక్కూ వెళ్లొచ్చు. కంట్రోల్, లెఫ్ట్ యారో బటన్లను కలిపి నొక్కితే వెనక్కు.. కంట్రోల్, రైట్ యారో బటన్లను కలిపి నొక్కితే కర్సర్ ముందుకు కదులుతుంది. మొత్తం పేరాను ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే షిఫ్ట్, కంట్రోల్, అప్ లేదా డౌన్ యారో బటన్లను కలిపి నొక్కితే సరి.
* ఏదైనా పదాన్ని గానీ పేరాను గానీ చిన్నగా చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్, ప్లస్ గుర్తు మీటలను కలిపి నొక్కొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: అదృశ్యమైన ఆ విద్యార్థుల దారుణ హత్య.. మణిపుర్లో వెలుగులోకి మరో ఘోరం..!
-
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం
-
Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmothsavalu: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
-
AP Assembly: ఎసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత బదలాయించుకోవచ్చు