ఇచ్ఛా మరణం!

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు భీష్ముడు నేల కొరిగినా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే మరణించాడు. తండ్రి ఇచ్చిన ‘ఇచ్ఛా మరణ వరం’ ప్రభావంతో తాను కోరుకున్నప్పుడే కన్నుమూశాడు.

Updated : 09 Aug 2023 07:15 IST

కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి బాణాలకు భీష్ముడు నేల కొరిగినా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాకే మరణించాడు. తండ్రి ఇచ్చిన ‘ఇచ్ఛా మరణ వరం’ ప్రభావంతో తాను కోరుకున్నప్పుడే కన్నుమూశాడు. మహా భారతంలో వర్ణితమైన ఇది వాస్తవమైతే? అంటే మరణమనేది ఒక ఐచ్ఛికమై.. కోరుకున్నప్పుడే చనిపోతే? మొత్తంగా వృద్ధాప్య ప్రక్రియనే వెనక్కి తిప్పగలిగితే? ఇది అసాధ్యమేమీ కాదని జోస్‌ లూయిస్‌ కార్డీరో, డేవిడ్‌ వుడో అనే జనెటిక్‌ ఇంజినీర్లు చెబుతున్నారు. అమరత్వం వాస్తవ రూపం ధరిస్తుందని, ఇది శాస్త్రీయంగా సాధ్యమేనని తమ తాజా పుస్తకం ‘ద డెత్‌ ఆఫ్‌ డెత్‌’లో పేర్కొంటున్నారు. ఊహించిన దాని కన్నా ముందుగానే.. మరో 27 ఏళ్లలోనే సాకారమయ్యే అవకాశముందనీ వివరిస్తున్నారు. ఇది కేవలం ఊహేనా? శాస్త్రీయ ఆధారాలేవైనా ఉన్నాయా?

మరత్వం! మరణం లేని జీవనం!! వినటానికిది సైన్స్‌ ఫిక్షన్‌ కథలా అనిపించినా వృద్ధాప్య ప్రక్రియను వెనక్కి తిప్పటం అసాధ్యమేమీ కాదని, దీన్ని సాధించే రోజులు మరెంతో దూరంలో లేవన్నది కార్డీరో నమ్మకం. మనిషి 2045 కల్లా కేవలం ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల మూలంగానే చనిపోతాడని ఆయన అభిప్రాయపడుతున్నారు. వృద్ధాప్యమనేది శరీరానికి సంబంధించి ‘టెక్నికల్‌’ సమస్యని, దీన్ని పరిష్కరించటం సాధ్యమేనన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఇది నమ్మలేని నిజంగా అనిపించినా మనిషి జీవనకాలం క్రమంగా పెరుగుతూ వస్తున్నమాట నిజం. మనిషి ప్రపంచ సగటు జీవనకాలం 1800లో 30 ఏళ్లు కాగా.. ఇది 2000లో 67 ఏళ్లకు ఎగబాకింది. కొన్ని దేశాల్లోనైతే 75 ఏళ్లనూ మించిపోయింది. వైద్యరంగంలో సాధించిన పురోగతి, ఆహార అలవాట్లు మెరుగవటం, హానికర అలవాట్లపై పెరిగిన అవగాహన వంటివి ఆయుష్షు పెరగటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది మున్ముందు మరింత పెరుగుతుందనటం అతిశయోక్తి కాదు. అయితే ఎంతవరకు జీవనకాలం పెరుగుతుందన్నదే ప్రశ్న. దీన్ని వీలైనంత పొడిగించాలన్నదే శాస్త్రవేత్తల ప్రయత్నం. ఈ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయి. శరవేగంగా దూసుకెళ్తున్న శాస్త్ర, సాంకేతిక పురోగతి.. నానో టెక్నాలజీ అద్భుతాలు.. వినూత్న జన్యు సవరణ పద్ధతుల వంటివి దీన్ని సుగమం చేయనున్నాయి. ‘చెడు’ జన్యువులను తిరిగి ఆరోగ్యకరమైనవిగా మార్చటం, శరీరంలోంచి మృత కణాలను బయటకు పంపిచెయ్యటం, దెబ్బతిన్న కణాల మరమ్మతు, మూల కణాల చికిత్స, కీలక అవయవాల 3డీ ముద్రణ వంటి పరిజ్ఞానాలు అమరత్వ సాధనలో ఆశా కిరణాలుగా కనిపిస్తున్నాయి. అయితే ముందుగా వృద్ధాప్యాన్ని ‘జబ్బు’గా గుర్తించటం కీలకమని, అప్పుడే దీన్ని ‘నయం’ చేయటానికి అవసరమైన పరిశోధనల కోసం పెద్దఎత్తున నిధులు సమకూరుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

 అసలు వృద్ధాప్యం ఎందుకు?

వృద్ధాప్యం ఎలా, ఎందుకు వస్తుందన్న దానిపై సార్వత్రిక ఆమోదయోగ్య సిద్ధాంతమేదీ లేదు. దీనిపై రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు- కాలం గడుస్తున్నకొద్దీ, వాడుతున్నకొద్దీ కారు పాత బడినట్టు వృద్ధాప్యం వస్తుందన్నది కొందరి అభిప్రాయం. కారుకు తుప్పు పడుతుంది, నట్లు వదులవుతాయి. ప్రాణుల్లోనూ కణస్థాయిలో ఇలాగే జరుగుతుందని, వృద్ధాప్యమనేది పురాతన సహజ సిద్ధ ప్రక్రియని భావిస్తుంటారు. పరిణామక్రమంలో వృద్ధ జీవులు మరణించి, కొత్త జీవుల ఎదుగుదలకు అవకాశం కల్పించాయని.. ఇలా జాతుల మనుగడను ముందుకు తీసుకెళ్లటానికి మార్గం సుగమమైందని నమ్ముతుంటారు. కార్డీరో దీన్ని కొట్టిపారేస్తారు. కొన్ని కణాలు, ప్రాణులకు వృద్ధాప్యం ఎందుకు రావటం లేదు? అవి ఎలా తప్పించుకోగలుగుతున్నాయి? అనేది తెలుసుకొని, వాటిని ‘కాపీ’ చేయగలిగితే మరణాన్ని జయించటం అసాధ్యమేమీ కాదన్నది ఆయన వాదన.

శాస్త్ర పురోగతి వేగం

ప్రతి 18 నెలలకు కంప్యూటింగ్‌ శక్తి రెట్టింపు అవుతుందని మూర్స్‌ సిద్ధాంతం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్‌ టెక్నాలజీ, క్రిస్ప్‌ఆర్‌-కాస్‌ 9 వంటి రంగాల్లో శరవేగంగా సాగుతున్న పురోగతీ మరణాన్ని జయించే ప్రయత్నాలను మరింత వేగం చేస్తున్నాయి. అనుకున్న దాని కన్నా ఇంకాస్త ముందుగానే దీన్ని సాధించే ఆశలకు జీవం పోస్తున్నాయి.

క్యాన్సర్‌కు సాధ్యమైంది మనకెందుకు కాదు

మన శరీరంలోని చాలా కణాలు చనిపోతాయి. కానీ అండాలు, శుక్రకణాలను పుట్టించే బీజకణాల వంటి వాటికి వృద్ధాప్యం రాదు. ఇతర శరీర కణాలకు (సోమాటిక్‌ సెల్స్‌) వృద్ధాప్యం వస్తుంది. అయితే ఇవి జన్యుపరంగా మారిపోయి, క్యాన్సర్‌గా మారితే వాటికి ‘అమరత్వం’ వచ్చేస్తుంది. మరణించకుండా వృద్ధి చెందుతుంటాయి. ఈ విద్యను క్యాన్సర్‌ నేర్చుకున్నప్పుడు మనకెందుకు సాధ్యం కాదన్నది శాస్త్రవేత్తల భావన. చాలామందికి తెలియకపోవచ్చు గానీ క్యాన్సర్‌ కణాలు మరణించవనే సంగతిని 1951లోనే గుర్తించారు. అప్పట్లో హెనిరియెటా ల్యాక్స్‌ అనే ఆమె గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మరణించారు. ఆమెకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు కణితిని తొలగించి, భద్రపరిచారు. దీనిలోని కణాలు ఇప్పటికీ ‘జీవించి’ ఉండటం గమనార్హం.

జంతువులపై పరిశోధనలు

జంతువుల్లో జీవనకాలాన్ని పొడిగించటానికి గత దశాబ్దం నుంచీ జరుగుతున్న అధ్యయనాలూ కొత్త ఆశలను రేపుతున్నాయి. కొన్ని ఎలుకల్లో ఆయుష్షును రెట్టింపు చేయగలిగారు. కొన్ని ఈగల్లో జీవనకాలం నాలుగు రెట్లు పెంచగలిగితే, కొన్ని వానపాముల్లో 10 రెట్లు పెంచగలిగారు. మెతుసెలా రకం వానపాములైతే మనుషుల వెయ్యేళ్ల జీవనకాలంతో సమానమైన ఆయుష్షుకు చేరుకున్నాయి కూడా. మనుషుల్లో ఇలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. కానీ కొన్ని కణాలను మాత్రం పునరుత్తేజితం చేయగలిగారు. జపాన్‌ శాస్త్రవేత్త షిన్యా యమనక 2012 నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. ఆయన బృందం చర్మకణాలను పునరుత్తేజితం చేయొచ్చని నిరూపించింది. ఇప్పుడాయన కళ్ల మీద దృష్టి సారించారు. ఇవి మిగతా అవయవాల కన్నా చిన్నవి. శరీరంలోని భాగాలతో పెద్దగా అనుసంధానమై ఉండవు. ఎలుకల్లో, కోతుల్లో కళ్లను పునరుత్తేజితం చేయటంలో పురోగతి సాధించారు. ఇప్పుడు మనుషుల మీద పరీక్షలు ఆరంభించారు.

ప్రకృతే ఆదర్శం

‘మనమంతా మరణిస్తాం. మరణం అనివార్యం.’ ఇది మానవ జాతి మొదటి నుంచీ నమ్ముతున్న భావన. దీన్ని మార్చుకోవాల్సిన అవసరముందన్నదీ శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎందుకంటే జీవితానికే కాదు, అమరత్వానికీ ప్రకృతే మనకు ఆదర్శం. బ్యాక్టీరియా, కొన్నిరకాల హైడ్రా, కొన్నిరకాల జెల్లీఫిష్‌ల వంటి ప్రాణులు మరణించకుండా ఎల్లకాలం జీవిస్తూనే ఉంటాయి. వీటికి వృద్ధాప్యం రాదు. ఇతర జీవులు వాటిపై దాడి చేయకపోతే, ప్రమాదాల బారినపడకపోతే అలా జీవించే ఉంటాయి. మన భూమి మీద అత్యంత పురాతన ప్రాణి బ్యాక్టీరియానే. అంటే ఒకరకంగా భూమి మీద జీవం ‘బిల్టిన్‌’గా వృద్ధాప్య ప్రక్రియ లేకుండానే పుట్టిందన్నమాట. మరణం లేని జెల్లీఫిష్‌గా పిలుచుకునే ‘టురిటాప్సిస్‌ డోహ్‌ర్నీ’ దీనికి మంచి ఉదాహరణ. దీని జన్యుక్రమాన్ని శాస్త్రవేత్తలు గత సంవత్సరం క్రోడీకరించారు. చిటికెన వేలు గోరు కన్నా చిన్నగా ఉండే దీనికి జీవనకాలాన్ని వెనక్కి తిప్పుకోగల సామర్థ్యం ఉండటం విశేషం. శారీరకంగా దెబ్బతిన్నప్పుడు, లేదా తిండి దొరక్కపోవటం వంటి స్థితి ఎదురైనప్పుడు ఇది తనలోకి తానుగా కుంచించుకుపోతుంది. కాళ్లలాంటి టెంటకిల్స్‌ను లోపలికి శోషించుకుంటుంది. నీటిలో ఈదే శక్తినీ కోల్పోతుంది. అప్పుడది చిన్న తిత్తి మాదిరిగా ఏర్పడి, సముద్రం అడుగున స్థిరపడుతుంది. కేవలం 36 గంటల్లోనే తిరిగి కొత్త శరీరాన్ని ఏర్పరచుకుంటుంది. ఇలాంటి ప్రాణులు వృద్ధాప్యాన్ని ఎలా జయిస్తున్నాయనే దానిపై శాస్త్రవేత్తలు నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే వీటి రహస్యాన్ని ఛేదించగలమనీ ఆశిస్తున్నారు. అమరత్వ ఛాయలు మన శరీరంలోనూ కనిపిస్తాయి. కొన్ని కణాలు కాలం చెల్లినా మరణించకపోవటమే దీనికి నిదర్శనం.

చికిత్సల దన్ను

క్రోమోజోమ్‌ల చివర్లో తోకల వంటి భాగాలు (టెలోమేర్స్‌) ఉంటాయి. వయసు మీద పడుతున్నకొద్దీ ఇవి దెబ్బతింటూ వస్తాయి, పొట్టిగా అవుతుంటాయి. వీటిని తిరిగి పొడవుగా చేయగలిగితే వృద్ధాప్యాన్ని వెనక్కి మళ్లించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. చాలా ప్రమాదకరం, అక్రమమే అయినా రెండేళ్ల క్రితం నుంచే తమ చికిత్సను ఆరంభించామని కార్డీరో, వుడ్‌ చెబుతున్నారు. జన్యు మార్పిడి విషయంలో తక్కువ నిబంధనలు గల కొలంబియాలో వృద్ధాప్య ఛాయలు కనిపించిన ఒకరికి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చికిత్స బాగానే నడుస్తోందని, పెద్దగా దుష్ప్రభావాలేవీ కనిపించలేదని వివరిస్తున్నారు. ఆమె రక్తంలోని టెలోమేర్స్‌ పొడవు 20 ఏళ్ల కిందటి స్థాయికి చేరుకోవటం గమనార్హం. వృద్ధాప్యాన్ని ఆపే ఇలాంటి చికిత్సలు మొదట్లో ఖరీదే కావొచ్చు. కానీ అందరికీ అందుబాటులోకి వస్తే చవకగా అవుతాయి.

ప్రముఖ సంస్థలూ బరిలోకి

మరో పదేళ్లలో క్యాన్సర్ల వంటి జబ్బులు నయమయ్యే స్థితికి చేరుకోవచ్చని కార్డీరో భావిస్తున్నారు. ఎందుకంటే గూగుల్‌ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలూ వైద్యరంగంలోకి అడుగిడుతున్నాయి.  మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇప్పటికే క్రయోప్రిజర్వేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే పద్ధతుల కోసం అన్వేషిస్తున్నారు.

జనాభా పెరగదా?

అమరత్వంతో భూమ్మీద జనాభా పెరుగుతుందని భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఇంకా ఎక్కువమంది జీవించటానికి భూమ్మీద చోటు ఉంది. గత శతాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సంతానాన్ని ఎవరూ కనటం లేదు. పైగా భవిష్యత్తులో అంతరిక్షంలో జీవించే అవకాశమూ ఉండొచ్చు. సంతానాన్ని కనొద్దనే జపాన్‌, కొరియా ధోరణి ఇలాగే కొనసాగితే రెండు శతాబ్దాల్లో వారి జనాభా అంతరించటం ఖాయం. కానీ అదృష్టం కొద్దీ కొత్త పద్దతుల సాయంతో జపానీయులు, కొరియన్లు ‘శాశ్వతంగా’ జీవించే అవకాశం లేకపోలేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని