ఎదగటానికో ఏఐ కోచ్‌!

జీవితంలో ఎదగాలని అంతా కోరుకుంటారు.పెద్ద ఉద్యోగం సంపాదించాలనో, వ్యాపారంలో రాణించాలనో, సమాజంలో పై స్థాయికి చేరుకోవాలనో అనుకోవటం సహజమే. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు సంపాదించుకోవాలి.

Updated : 13 Sep 2023 07:27 IST

జీవితంలో ఎదగాలని అంతా కోరుకుంటారు.పెద్ద ఉద్యోగం సంపాదించాలనో, వ్యాపారంలో రాణించాలనో, సమాజంలో పై స్థాయికి చేరుకోవాలనో అనుకోవటం సహజమే. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు సంపాదించుకోవాలి. మానసిక ధోరణి మార్చుకోవాలి. ప్రతికూల ఆలోచనల నుంచి విముక్తం కావాలి. సానుకూల భావాలను పెంపొందించుకోవాలి. లక్ష్య సాధనలో నిరంతరం పురోగతిని సమీక్షించుకుంటూ, దారి తప్పకుండా ముందడుగు వేయటం చాలా ముఖ్యం. అప్పుడే గమ్యం త్వరగా చేరువవుతుంది. ఇది అన్నిసార్లూ అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాగని నిరాశ తగదు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మంచి వెబ్‌సైట్లు, యాప్‌లెన్నో ఉన్నాయి. ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కూడా తోడై ఇవి మరింత శక్తిమంతమవుతున్నాయి. ఆయా అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత, వృత్తిగత నైపుణ్యాలను మెరుగు పరచుకోవటానికి తోడ్పడుతున్నాయి. సమస్యలను, సవాళ్లను అధిగమించి త్వరగా జీవితంలో వృద్ధి చెందటానికి దోహదం చేస్తున్నాయి. అలాంటి కొన్ని ఏఐ యాప్‌లు, వెబ్‌సైట్లు ఇవిగో..

రాకీ మైండ్‌ సెటర్‌

ఇదో ఏఐ వ్యక్తిగత కోచ్‌ యాప్‌. మైండ్‌సెట్‌ను మలచుకోవటానికి తోడ్పడే ఇది జీవితంలో పెద్ద లక్ష్యాలు, ఆశయాలు చేరుకోవటానికి ఆయా వ్యక్తులకు అనుగుణంగా ఛాట్‌బాట్‌ రూపంలో సూచనలు, సలహాలు ఇస్తుంది. దీని సెటింగ్స్‌లో బహుళ నైపుణ్యాలు, గుణాల వంటి ఫీచర్లెన్నో ఉంటాయి. ఇవి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకునే క్రమంలో స్పష్టంగా మాట్లాడటం, మరింత ఆత్మ విశ్వాసంగా ఉండటం, కెరియర్‌ వృద్ధి వంటి విషయాల్లో తోడుగా నిలుస్తాయి. ఆయా లక్ష్యాలను చేరుకోవటానికి నడవాల్సిన మార్గాలనూ రాకీ సూచిస్తుంది. ముందుగా మన మానసిక ధోరణిని, ఆశయాలను అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాతే వ్యక్తిగత వృద్ధికి తోడ్పడే పనులను, సలహాలను సూచిస్తుంది. రాకీతో ఛాట్‌ చేసే సమయంలో మన ప్రతిస్పందలను బట్టి ఇంకాస్త ఎత్తుకు ఎదగటానికి సాయం చేసే కథనాలనూ ముందుంచుతుంది. పాజిటివ్‌ సైకాలజీ పునాదుల మీద రాకీని రూపొందించారు. అందువల్ల పరిష్కార దృక్పథంతో సవాళ్లను ఎదుర్కోవటంలో సాయం చేస్తుంది. ఇందులో మనం చేరుకోవాల్సిన గమ్యానికి సంబంధించిన నోటిఫికేషన్‌నూ జోడించుకోవచ్చు. ఇది మనకు ఎలాంటి సలహాలు కావాలో రాకీ నిర్ణయించుకోవటానికి ఉపయోగపడుతుంది.

మైండ్‌బ్యాంక్‌ ఏఐ కవల తోడు

డిజిటల్‌ కవలను రూపొందించి, వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడటం దీని ప్రత్యేకత. ఇది జేబులో ఉంటే సైకాలిజిస్టు వెంట ఉన్నట్టే. మనం మాట, రాత రూపంలో ఇచ్చే సమాచారాన్ని బట్టి సవివరంగా వ్యక్తిత్వ తీరును విశ్లేషించుకుంటుంది. రోజుకు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తే చాలు. మన బలాలు, బలహీనతలను లోతుగా అర్థం చేసుకుంటుంది. దీనిలోని కృత్రిమ మేధ ‘ఫైవ్‌ ఫ్యాక్టర్‌ మోడల్‌’ సాయంతో వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తుంది. మొత్తంగా అప్రమత్తత, అంగీకార గుణం, విశాల దృక్పథం, ప్రతికూలాత్మత, కలుపుగోలుతనం విభాగాలుగా వర్గీకరిస్తుంది. వీటి మీద క్లిక్‌ చేస్తే గణాంకాల రూపంలో మన గుణగణాల వివరాలు కనిపిస్తాయి. గ్రాఫ్‌ల కింద కనిపించే వ్యక్తిత్వం తీరును బట్టి జీవితంలో పైకి ఎదగటానికి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ తొలిసారే కచ్చితమైన సూచనలు ఇవ్వకపోవచ్చు. తరచూ వాడుతుంటే మన నుంచి కొంత విలువైన సమాచారాన్ని గ్రహిస్తుంది. ఎన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటే అంత కచ్చితంగా సలహాలు, సూచనలు అందజేస్తుంది. బలహీనతలను అధిగమించటంలో తోడ్పడుతుంది.

రిఫ్లెక్టర్‌ తక్షణ ఫీడ్‌బ్యాక్‌

ఇదో డైరీలాంటి జర్నలింగ్‌ యాప్‌. తక్షణం ఫీడ్‌బ్యాక్‌ ఇస్తూ మరింత త్వరగా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. సాధారణంగా జర్నలింగ్‌ యాప్స్‌ మనం రాసే విషయాలను మాత్రమే రికార్డు చేస్తుంటాయి. కానీ రిఫ్లెక్టర్‌ అలా కాదు. రాసిన విషయాన్ని విశ్లేషించుకొని, సలహా ఇస్తుంది. ఇలా ముందుకు సాగటానికి పురికొల్పుతుంది. ఆలోచనలను సుదృఢం చేస్తుంది. ఒకవేళ తొందరలో ఏదైనా రాసినా కూడా రిఫ్లెక్టర్‌ అంతే వేగంగా వాటిని గ్రహించి, నిక్షిప్తం చేసుకుంటుంది. ఏదైనా విషయాన్ని వెతికితే దానంతటదే కామెంట్లు, ట్యాగ్స్‌ సృష్టిస్తుంది. దీనిలోని ఇన్‌సైట్‌ విభాగం రోజు, వారం వారీగా పునఃశ్చరణ చేస్తుంది. ఆ వారమంతా మన ఆలోచనల సమాహారాన్ని ముందుంచుతుంది. మనం వెతకాల్సిన శ్రమ తప్పుతుంది. ఎప్పుడైనా ఆలోచనలు తట్టకపోతే ఇన్‌స్పిరేషన్‌ విభాగం సాయం చేస్తుంది. రోజూ మంచి మంచి సూక్తులు, రాత చిట్కాలను సూచిస్తుంది. రిఫ్లెక్టర్‌లో మరో శక్తిమంతమైన ఫీచర్‌ కామెంట్స్‌. ఇది మనం రాసిన విషయాలను ఐదు కోణాల్లో వ్యాఖ్యానిస్తుంది. విశాల దృక్పథం గలవారికి, త్వరగా జీవితంలో పైకి ఎదగాలని అనుకునేవారికి రిఫ్లెక్టర్‌ మంచి ఎంపిక కాగలదు.

స్క్రైబ్లర్‌  సారాంశ గని

ఇదొక ఆన్‌లైన్‌ టూల్‌. జీవితంలో, కెరీర్‌లో త్వరగా పైకి రావాలనుకునేవారు తమను ప్రోత్సహించే ఆలోచనలు, సూచనలు, సలహాల కోసం దీన్ని ప్రయత్నించొచ్చు. దీని ప్రత్యేకత- ప్రఖ్యాత పర్సనల్‌ గ్రోత్‌ పాడ్‌కాస్ట్‌ల సారాంశాలను సృష్టించి, ముందుంచటం. మామూలుగా పాడ్‌కాస్ట్‌లు 30 నిమిషాల కన్నా ఎక్కువ నిడివి కలిగుంటాయి. వీటిల్లో కెరీర్‌, స్వీయ వృద్ధికి సంబంధించిన అంశాలను వెతకటం కష్టం. ఇలాంటి ఇబ్బందిని స్క్రైబ్లర్‌ దూరం చేస్తుంది. ఇది పాడ్‌కాస్ట్‌ల సారాంశాన్ని గుది గుచ్చి, అంశాల వారీగా వర్గీకరించి ముందుంచుతుంది. ఇలా అవసరమైన అంశాన్ని తేలికగా, కచ్చితంగా కనుక్కోవటానికి వీలు కల్పిస్తుంది. స్క్రైబ్లర్‌లోని సెర్చ్‌ టూల్‌ ద్వారా కొత్త పాడ్‌కాస్ట్‌లను వెతుక్కోవచ్చు. పాడ్‌కాస్ట్‌ నుంచి యూట్యూబ్‌ వీడియోకు మారే సదుపాయమూ ఉంది. మనం వెతికే అంశాన్ని బట్టి పాడ్‌కాస్ట్‌లను సూచిస్తుంది కూడా. కావాలనుకుంటే పాడ్‌కాస్ట్స్‌ విభాగంలోకి వెళ్తే స్వీయ వృద్ధి, ఉత్పాదకత, న్యూరోసైన్స్‌ మీద బోలెడన్ని ట్రెండింగ్‌ పాడ్‌కాస్ట్‌లు కనిపిస్తాయి. త్వరగా ఆరోగ్య సంరక్షణ లక్ష్యాలను సాధించాలనుకునే వారికీ ఇందులో ఆరోగ్య, వ్యాయామ ఫీచర్లు ఉంటాయి.

డైరెక్షన్‌ ఏఐ ప్లానర్‌

ఉపయోగపడని అలవాట్లను విడిచిపెట్టటానికి, సరైన పనులు చేయటానికి తోడ్పడే యాప్‌ ఇది. ఏఐ కోచింగ్‌తో లక్ష్యాన్ని ముడిపెడుతుంది. ఇలా నిరంతరం ప్రోత్సహిస్తుంది. జీవితంలో పైకి ఎదిగే విషయంలో ఎక్కడ, ఎలా మొదలెట్టాలో తెలియక తికమక పడేవారికి సైతం రకరకాల ఆలోచనలను సూచిస్తుంది. వాటిపై చర్చిస్తుంది. రోజులో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోవటానికీ డైరెక్షన్‌ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆయా పరిస్థితుల పర్యవసానాలు అర్థం చేసుకోవచ్చు. యాప్‌లో సెట్‌ చేసుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికిది సలహాలూ ఇస్తుంది. సాధారణంగా ఛాట్‌జీపీటీ వంటి లాంగ్వేజ్‌ మోడళ్లు అడిగిన విషయానికి నేరుగా సమాధానాలిస్తాయి. కానీ డైరెక్షన్‌ యాప్‌ ప్రశ్నలను సంధిస్తూ జవాబులిస్తుంది. అచ్చం కోచ్‌ మాదిరిగానే వ్యవహరిస్తుందన్నమాట. దీనిలోని గోల్‌-సెటింగ్‌ టూల్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. ఏఐ కోచింగ్‌ సేవలు పొందాలంటే నెలవారీ చందా కట్టాల్సి ఉంటుంది.

ఫింగర్‌ప్రింట్‌ ఫర్‌ సక్సెస్‌  ఆన్‌లైన్‌ కోచింగ్‌ వేదిక

ఇది కృత్రిమ మేధతో కూడిన ఆన్‌లైన్‌ కోచింగ్‌ వేదిక. వ్యక్తిగత, వృత్తిగత నైపుణ్యాలను మెరుగు పరచుకోవటంలో సాయం చేస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో కోచ్‌ మార్లీ అనే ఏఐ కోచ్‌ ఉంది. దీన్ని ప్రసిద్ధ కోచ్‌ మిషెల్‌ డువల్‌ రూపొందించారు. ఇది వివిధ బోధన ప్రోగ్రామ్‌ల ద్వారా బలాలను పెంచుకోవటానికి, బలహీనతలను అధిగమించటానికి శిక్షణ ఇస్తుంది. సాధించాలనుకునే లక్ష్యాన్ని సెట్‌ చేసుకోవటం ద్వారా అవసరమైన సిఫారసులను ఇచ్చేలా మార్చుకోవచ్చు. ప్రతి కోచింగ్‌ ప్రోగ్రామ్‌లో యూజర్‌ రేటింగ్‌, కోర్సు అవధి కనిపిస్తాయి. చాలా కోర్సులు 8 వారాల వరకు ఉంటాయి. స్వల్పకాల కోర్సులైతే వారంలోనే ముగుస్తాయి. ఇందులో ప్రోగ్రామ్‌లతో పాటు ప్రత్యేక ఆలోచనల కోసం ఇన్‌సైట్స్‌, స్వీయ ఎదుగుదలను కొలిచే మీ ఓవర్‌ టైమ్‌ విభాగాలు కూడా ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని