భళారే డిజిటల్‌ విచిత్రం!

ఒకప్పటి కన్నా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి.

Updated : 06 Mar 2024 05:52 IST

ఒకప్పటి కన్నా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. ఒకేలాంటి పరికరాలు బోర్‌ కొట్టవూ? అందుకే వీటిని వినూత్నంగా మార్చి, వినియోగదారులను ఆకట్టుకోవటమెలా అనే దానిపై కంపెనీలు నిరంతరం ఆలోచిస్తుంటాయి. తమ ప్రయోగాలను ప్రత్యేక టెక్‌ షోల్లో ప్రదర్శిస్తుంటాయి. ఇటీవల స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఇలాంటి కొంగొత్త పరికరాలెన్నో కనిపించాయి.


ఫోనే వాచీ

 స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచీ, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌.. అన్నీ కలగలిస్తే ఎలా ఉంటుంది? సామ్‌సంగ్‌ క్లింగ్‌ బ్యాండ్‌లా ఉంటుంది. బ్రేస్‌లెట్‌ మాదిరిగా చేతికి చుట్టుకునే దీనిలో మూడు పరికరాలూ ఒదిగిపోయి ఉంటాయి మరి. ఇటీవల స్మార్ట్‌ వాచ్‌లు బాగా తెలివి మీరిపోతున్న నేపథ్యంలో  ఇలాంటి వినూత్న ఆలోచన చేశారు. స్మార్ట్‌వాచీలకు చిన్న తెర పెద్ద సమస్య. టైప్‌ చేయటం కష్టం. మరి పరికరం మొత్తమూ టచ్‌స్క్రీన్‌ అయిపోతే? ఫొటోలు స్క్రోల్‌ చేయటం దగ్గరి నుంచి వెబ్‌ బ్రౌజ్‌ చేయటం, మెసేజ్‌లు టైప్‌ చేయటం వంటివన్నీ సాధ్యమైతే? సామ్‌సంగ్‌ క్లింగ్‌ బ్యాండ్‌తో ఇవన్నీ చేసుకోవచ్చు.
మోటొరోలా సంస్థ కూడా తక్కువేమీ తినలేదు. వెనక్కు వంగే తెరతో కూడిన ఫోన్‌ను తీసుకొచ్చింది. చేత్తో పట్టుకుంటే మామూలుగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లాగే వాడుకోవచ్చు. అవసరమైతే వంచి, చేతికి చుట్టుకోనూ వచ్చు. చివర్లలో అయస్కాంత పట్టీ ఉండటం వల్ల చేతికి అలాగే అంటుకొని ఉంటుంది. అప్పుడది స్మార్ట్‌వాచ్‌ మాదిరిగానూ పనిచేస్తుంది. నోటిఫికేషన్లను చూసుకోవటంతో పాటు యాప్‌లనూ స్క్రోల్‌ చేయొచ్చు. ఫోన్‌ను వెనక్కి వంచి స్టాండు లేకపోయినా టేబుల్‌ మీద నిలువుగా నిలిపి ఉంచుకోవచ్చు.


స్మార్ట్‌ ఉంగరం

ఆవిష్కరణల విషయంలో సామ్‌సంగ్‌ నిరంతరం కొత్తపుంతలు తొక్కుతూనే ఉంటుంది. ఈసారి గెలాక్సీ రింగ్‌తో అబ్బుర పరిచింది. ఇదో స్మార్ట్‌ ఉంగరం. స్మార్ట్‌వాచీని చేతికి ధరిస్తే దీన్ని వేలికి తొడుక్కోవచ్చు. నిద్ర పోతున్నప్పుడు తీయాల్సిన అవసరమేమీ ఉండదు. సెన్సర్లతో కూడిన ఈ స్మార్ట్‌ ఉంగరంలో ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేసే ఫీచర్లు ఎన్నో ఉంటాయి. దీన్ని  ధరిస్తే ఫిట్‌నెస్‌ సమాచారంతో పాటు నిద్ర తీరుతెన్నులనూ తెలియజేస్తుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే ఐదు నుంచి తొమ్మిది రోజుల వరకు పనిచేస్తుందని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లోకి కచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదు గానీ ఈ సంవత్సరం చివర్లో అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.


యాప్‌ రహిత ఫోన్‌

స్మార్ట్‌ఫోన్‌ అంటేనే యాప్‌ల పుట్ట. మరి ఒక్క యాపైనా లేకపోతే? డాయిషే టెలికాం కంపెనీ అలాంటి ప్రయోగాత్మక ఫోన్‌నే ప్రదర్శించింది. అమెరికా అంకురసంస్థ బ్రెయిన్‌.ఏఐ సహకారంతో రూపొందించిన దీని ఇంటర్ఫేస్‌ విభిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కటంటే ఒక్క యాపైనా లేకపోవటం విచిత్రం. ఏఐ ఆధారిత పర్సనల్‌ అసిస్టెంట్‌ ఒక్కటే నిక్షిప్తమై ఉంటుంది. ఇదే అన్ని పనులూ చేసి పెడుతుంది. ఇష్టమైన సామాజిక మాధ్యమాల యాప్‌లు లేని ఫోన్‌ని ఊహించుకోవటం కష్టమే గానీ అధునాతన ఏఐ రాకతో అప్లికేషన్లకు కాలం చెల్లినట్టే అనిపిస్తోంది. ఆమధ్య వచ్చిన హ్యూమేన్‌ ఏఐ పరికరం గురించి తెలిసిందే కదా. చొక్కాకు తగిలించుకునే ఇది మాటల ఆదేశాలతోనే కాల్స్‌తో పాటు ఇంటర్నెట్‌తో అన్ని పనులూ చేసేస్తుంది. లేజర్‌ కాంతి సాయంతో చేతినే తెరలా మార్చేస్తుంది. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇంకా ఎన్ని పుట్టుకొస్తాయో?


విస్తరించే తెర

ఇప్పటికే మడత ఫోన్లతో అలరిస్తున్న టెక్నో కంపెనీ తాజాగా విస్తరించే తెర ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇప్పటివరకూ డెమో వీడియోల్లోనే ప్రదర్శించిన ఈ కాన్సెప్ట్‌ను ప్రయోగాత్మక పరికరం రూపంలోకి తీసుకొచ్చింది. దీని పేరు ఫాంటమ్‌ అల్టిమేటమ్‌. నిజానికి దీని అసలు తెర సైజు 6.55 అంగుళాలు. కానీ ఫోన్‌ మీదుండే చిన్న బటన్‌ను నొక్కితే తెర విస్తరిస్తుంది. అప్పుడది 7.11 అంగుళాల తెరగా మారుతుంది. కేవలం 1.3 సెకండ్ల సమయంలోనే తెర విస్తరిస్తుంది. ఇలా ఫోన్‌ కాస్తా ట్యాబ్లెట్‌లా మారుతుంది. విస్తరించకుండా ఉన్నప్పుడు ఈ తెర ఫోన్‌కు అవతలి వైపున పరచుకొని ఉంటుంది. అంటే రెండు వైపులా తెర ఉంటుందన్నమాట. కాకపోతే అవతలి వైపున తెర అడ్డంగా కనిపిస్తుంది. ఇందులో టైమ్‌, నోటిఫికేషన్ల వంటివి కనిపిస్తాయి.


పారదర్శక ల్యాప్‌టాప్‌

మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఒక్క ఫోన్‌లకే పరిమితం కాదు. వినూత్న పీసీలు, ల్యాప్‌ టాప్‌లకూ వేదికే. వీటి విషయంలో లెనోవా సంస్థ అందరి దృష్టిని ఆకర్షించింది. కొన్ని టీవీల మాదిరిగా పూర్తి పారదర్శక తెరతో కూడిన ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. దీని సైజు 17 అంగుళాలు. కీబోర్డు స్థానంలోనూ ప్యానెల్‌ను తీసుకొచ్చారు. ఇది వర్చువల్‌ కీబోర్డులా పనిచేస్తుంది. అలాగే బొమ్మలు గీయటం వంటి పనుల కోసం టచ్‌స్క్రీన్‌ మాదిరిగానూ ఉపయోగపడుతుంది.


భలే ఆటో కాక్‌పిట్‌

కన్జ్యూమర్‌ గ్రేడ్‌ చిప్‌సెట్లకు, టెలికం సొల్యూషన్లకు మారుపేరైన మీడియాటెక్‌ సంస్థ ఇతర విభాగాలకూ విస్తరిస్తోంది. చిప్‌ తయారీ, స్మార్ట్‌ డిస్‌ప్లే, నావిగేషన్‌, చివరికి 5జీతో కార్ల అనుసంధానం వంటి అన్ని టెక్నాలజీలు కలగలసిన డైమెన్సిటీ ఆటో కాక్‌పిట్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇది కృత్రిమ మేధతో కూడిన మల్టీ-ప్రాసెసర్‌ ఆధారిత డీప్‌లెర్నింగ్‌ యాక్సిలరేటర్‌ (ఎండీఎల్‌ఏ), విజన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (ఎంవీపీయూ)తో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీలన్నీ బోలెడన్ని కెమెరాలు, మైక్రోఫోన్లు, ఏఐ సన్నద్ధ చిప్‌సెట్లతో కార్లను ఆధునికీకరిస్తాయన్నమాట. అధునాతన డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ సాయంతో ఇతర కార్లతో కమ్యూనికేట్‌ అయ్యేలా చేస్తాయి. ఫలితంగా సురక్షిత ప్రయాణానికి వీలు కల్పిస్తాయి.


రోబో శునకం

టెక్నో సంస్థ డైనమిక్‌ 1 పేరుతో రోబో శునకాన్ని పరిచయం చేసింది. జర్మన్‌ షెఫర్డ్‌ జాతి కుక్క స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. ఇది నిజం కుక్క మాదిరిగానే ప్రవర్తిస్తుంది. మెట్లు ఎక్కటం, గెంతటం, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వటం, రెండు కాళ్ల మీద నిల్చోవటం వంటివన్నీ చేస్తుంది. ఏఐ హైపర్‌సెన్స్‌ ఫ్యూజన్‌ సిస్టమ్‌ సాయంతో పనిచేసే ఇందులో 8-కోర్‌ ఏఆర్‌ఎం సీపీయూ ఉంటుంది. రియల్‌సెన్స్‌ డీ430 డెప్త్‌ కెమెరా, డ్యుయల్‌ ఆప్టికల్‌ సెన్సర్లు, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లతో కూడిన ఈ మర శునకం చుట్టుపక్కల పరిసరాలను పసిగట్టి, విశ్లేషించగలదు. ఫొటోలు తీయగలదు. మైక్రోఫోన్‌ కూడా ఉండటం వల్ల మాటలకు అనుగుణంగానూ స్పందిస్తుంది. బ్లూటూత్‌, వైఫైతో అనుసంధానమై స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ లేదా రిమోట్‌తో ఆదేశాలను అందుకుంటుంది. హెడ్‌లైట్‌ వ్యవస్థ ఉండటం వల్ల దారిని వెలుగుతో నింపుతుంది. సెకండుకు 3.7 మీటర్ల వేగంతో కదిలే ఇది పరుగెత్తుతున్నప్పుడు అడ్డంకులనూ దాటుకుంటుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 90 నిమిషాల సేపు పని చేస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని