paul alexander: ఇనుప ఊపిరితిత్తి!

ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్‌ అలెగ్జాండర్‌ అలాగే గడిపారు

Updated : 20 Mar 2024 08:00 IST

ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్‌ అలెగ్జాండర్‌ అలాగే గడిపారు. ఇంత సుదీర్ఘకాలం అలా ఉన్నవారెవరూ లేరు. పెట్టెలా కనిపించినా నిజానికది ఐరన్‌ లంగ్‌. అంటే శ్వాస తీసుకోవటానికి తోడ్పడే సాధనమన్నమాట. కాబట్టే పాల్‌ అలెగ్జాండర్‌ ‘ద మ్యాన్‌ ఇన్‌ ఐరన్‌ లంగ్‌’ అనీ పేరొందారు. ఇటీవల ఆయన మరణంతో ఐరన్‌ లంగ్‌ మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్రాణాలను కాపాడే వెంటిలేటర్‌, ఐసీయూల రూపకల్పనకూ దారితీసింది. ఇంతకీ ఆయన అందులో ఎందుకున్నారు? అసలు ఐరన్‌ లంగ్‌ కథేంటి?

ఇప్పుడంటే పోలియో టీకా రావటంతో సరిపోయింది గానీ లేకపోతే ఎంతమంది పిల్లలకు ఐరన్‌ లంగ్‌ అవసరమయ్యేదో. పోలియో అంత భయంకరమైన జబ్బు మరి. ఇది శరీరం మీద దాడి చేసి పక్షవాతానికి దారితీస్తుంది. దీంతో కాళ్లూ చేతులే కాదు.. శ్వాస తీసుకోవటానికి తోడ్పడే ఊపిరితిత్తులు, కండరాలు చచ్చుబడితే ప్రాణాపాయమూ సంభవిస్తుంది. ఇక్కడే ఐరన్‌ లంగ్‌ ఎంతగానో ఉపయోగపడింది. అప్పట్లో పోలియోతో అవయవాలు చచ్చుబడ్డ పిల్లలను ఇందులోనే పెట్టి, ప్రాణాలను కాపాడేవారు. కాళ్లతో కూడిన శవ పేటికలా కనిపించే ఇది ఎంతోమందిని కాపాడింది. ఊపిరితిత్తులు చచ్చుబడ్డవారికి గాలి పీడనం మార్పులతో శ్వాస తీసుకునేలా చేయటం దీని ప్రత్యేకత. ఇలా ఏళ్ల కొద్దీ ప్రాణాలను కాపాడుతుంది. పాల్‌ అలెగ్జాండరే దీనికి నిదర్శనం. ఆయనకు ఆరేళ్ల వయసులోనే పోలియోతో కాళ్లూ చేతులూ, ఊపిరితిత్తులు చచ్చుబడ్డాయి. తల, మెడ, నోరు మాత్రమే కదిలేవి. శ్వాస తీసుకోలేక పోవటంతో వైద్యులు ఐరన్‌ లంగ్‌లో పెట్టి సంరక్షించారు. కొంచెం సేపు సొంతంగా శ్వాస తీసుకునేలా నేర్చుకున్నప్పటికీ అలెగ్జాండర్‌ దాదాపు జీవితాంతం అందులోనే గడిపారు.

 మరెన్నో ఆవిష్కరణలు

కృత్రిమ శ్వాస విధానమైన మెకానికల్‌ వెంటిలేషన్‌ రూపకల్పనలో ఐరన్‌ లంగ్‌ను మేలి మలుపుగా భావిస్తారు. పోలియో విజృంభణకు ముందు దీన్ని అంతగా వాడేవారు కాదు. ఐరన్‌ లంగ్‌తోనే కృత్రిమ శ్వాస ప్రక్రియ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. యంత్రంతో శరీరంలోకి గాలి వచ్చి, పోతుండటం ద్వారా ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి తీరును అర్థం చేసుకోవటం సాధ్యమైంది. దీని ఆధారంగానే జాన్‌ ఏజ్‌ ఇబ్సన్‌ తొలి వెంటిలేటర్‌ను రూపొందించారు. ఆయన 1953లో దీన్ని తయారుచేయటం ఆరంభించారు. పాజిటివ్‌ ప్రెజర్‌ వెంటిలేటర్‌గా ఈ పరికరాన్ని అభివర్ణించారు. నెగెటివ్‌ పీడనం సాయంతో ఐరన్‌ లంగ్‌ రోగి ఊపిరితిత్తులు గాలి పీల్చుకునేలా చేస్తుంది. అదే ఇబ్సెన్‌ రూపొందించిన వెంటిలేటర్‌ అయితే పాజిటివ్‌ పీడనంతో పనిచేస్తుంది. ముక్కుకు వెంటిలేటర్‌ గొట్టాన్ని జతచేస్తే ఊపిరితిత్తుల్లోకి గాలి నెట్టుకొని వెళ్తుంది. పైగా దీన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు. ఐరన్‌ లంగ్‌ స్థాయిలో ఇబ్బంది కలిగించదు. ఇలాంటి పాజిటివ్‌ పీడనం పరికరాన్ని ఆపరేషన్‌ గదిలో తరచూ ఉపయోగించుకోవచ్చు. ఇదీ ఐరన్‌ లంగ్‌ మాదిరిగానే రోగుల ఊపిరితిత్తుల్లోకి గాలిని కొడుతుంది. శ్వాస తీసుకునేలా చేస్తుంది. అనంతరం వెంటిలేటర్లు గణనీయంగా పరిణామం చెందినప్పటికీ ప్రాథమిక సూత్రం పెద్దగా మారలేదు. దాదాపు ఇబ్సెన్‌ పరికరం పనిచేసినట్టుగానే వీటిని తీర్చిదిద్దుతూ వచ్చారు. ప్రస్తుతం ఐసీయూల్లో రోగుల పడకల పక్కన కనిపించే అధునాతన వెంటిలేటర్లకు మూలం ఆనాటి పోలియో విజృంభణ కాలమే అని చెప్పుకోవచ్చు.

నేటి ఐసీయూ గదుల భావన కూడా ఐరన్‌ లంగ్‌ చికిత్స నుంచే పుట్టుకొచ్చింది. అప్పట్లో నెగెటివ్‌ పీడనంతో కూడిన వెంటిలేషన్‌ అవసరమైన పోలియో బాధితులను చాలామందిని ఒకే చోట పెట్టి చికిత్స చేస్తుండే వారు. ఇది ఐరన్‌ లంగ్‌తోనే సాధ్యం కావటం ఆలోచింప జేసింది. చాలామందిని ఒకే దగ్గర పెట్టి ప్రాణాలను కాపాడొచ్చని దీంతోనే నిరూపితమైంది. ఒకరకంగా మొట్టమొదటి ఐసీయూలూ అవేనని చెప్పుకోవచ్చు. కాబట్టే మత్తుమందు నిపుణులు మొదటి అత్యవసర చికిత్స నిపుణులుగా అవతరించారు. ఎందుకంటే ఇలాంటి చికిత్స గదుల్లో మొదట్లో మత్తు నిపుణులే చికిత్సలు చేసేవారు. సంక్లిష్ట సమస్యలకు ఆయా రంగాల్లో మంచి నైపుణ్యం గలవారు అవసరమనే భావన కూడా ఐరన్‌ లంగ్‌ చికిత్సతోనే స్థిరపడింది. ప్రస్తుత ఐసీయూల్లోనూ ఇదే కీలకం. కృత్రిమ శ్వాసను మరింత సమర్థంగా అందించే విధానం మెరుగుపడిన కొద్దీ ఇతర ప్రాణాపాయ జబ్బుల చికిత్సలకూ అవకాశం కలిగించింది. తీవ్ర సెప్సిస్‌, న్యుమోనియా, ఇన్‌ఫెక్షన్ల వంటి జబ్బులతో బాధపడేవారిలో శ్వాసకోశ వ్యవస్థ కుప్పకూలటం చూస్తున్నదే. వీరికి ముందుగా వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాస కల్పించటం ద్వారానే ఇతర అవయవాలు కోలుకునేలా చేస్తుంటారు.

ఎలా పనిచేస్తుంది?

ఐరన్‌ లంగ్‌లో ప్రధానమైంది గాలి చొరబడని భారీ లోహ సిలిండర్‌. సుమారు 295 కిలోల బరువుండే దీనికి తోలు తిత్తులు అనుసంధానమై ఉంటాయి. సిలిండర్‌లో పోలియో బాధితులను పడుకోబెడతారు. మెడ నుంచి కింది వరకూ శరీరం మొత్తం లోపలే ఉంటుంది. పంపు సాయంతో కదిలే తిత్తులు నిరంతరం పెట్టె లోపలకు, బయటకు గాలి వచ్చేలా చేస్తాయి. ఈ సమయంలో సిలిండర్‌లో తలెత్తే పీడన ప్రభావంతో ఊపిరితిత్తుల్లోకి గాలి చొచ్చుకెళ్తుంది. శ్వాస తీసుకోవటానికి వీలవుతుంది. ఈ కృత్రిమ శ్వాస ప్రక్రియను ఎక్స్‌టర్నల్‌ నెగెటివ్‌ ప్రెషర్‌ వెంటిలేషన్‌ (ఈఎన్‌పీవీ) అంటారు. ఈ ఐరన్‌ లంగ్‌ ఆవిష్కరణతో మనుషులు, యంత్రాల మధ్య విడదీయలేని సంబంధం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇది శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతున్నవారికి తొలిసారిగా ఎక్కువకాలం ఊపిరి తీసుకునే అవకాశం కలిగించింది. శ్వాస ప్రక్రియను పాక్షికంగా లేదా పూర్తిగా ఒక పరికరమే తలకెత్తుకోవటం వైద్యరంగంలోనే గొప్ప మేలి మలుపుగా నిలిచింది. ఐరన్‌ లంగ్‌లో పెట్టినవారిలో కొందరు కొద్ది వారాలు, నెలలకే కోలుకునేవారు. ఛాతీ బలం పుంజుకున్నాక, సొంతంగా శ్వాస తీసుకోవటం నేర్చుకున్నాక వారిని బయటకు తీసేవారు. కానీ ఛాతీ కండరాలు శాశ్వతంగా చచ్చుబడ్డవారికి సుదీర్ఘకాలం ప్రాణాలు నిలవడానికి ఇదే ప్రధాన సాధనంగా ఉపయోగపడింది. ఐరన్‌ లంగ్‌ ప్రాణాలు నిలవటానికి తోడ్పడినప్పటికీ కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. నిరంతరం పెట్టెలోనే ఉండటం రోగులకు, వైద్యులకు ఇబ్బంది కలిగించింది. తాము పరికరంలో చిక్కుకున్నామని రోగులు బాధపడేవారు. డాక్టర్లకేమో మిగతా అవయవాలను పరిశీలించటం, చికిత్స చేయటం కష్టంగా ఉండేది. అయితేనేం? కొంగొత్త వైద్య పరికరాలకు పునాదిగా నిలిచింది. ఊపిరితిత్తుల వంటి అవయవాలకు దన్ను కల్పించటమనే భావన అత్యవసర చికిత్సల్లో కీలకంగా మారింది.

ఎక్కడా ఆగలేదు

జీవితాంతం ఐరన్‌ లంగ్‌లోనే ఉండిపోయినప్పటికీ పాల్‌ అలెగ్జాండర్‌ చదువులో మేటే. చిన్నప్పుడు పోలియో బారినపడ్డాక 18 నెలలు ఆసుపత్రిలో గడిపారు. ట్రక్కు సాయంతో ఆయనను ఐరన్‌ లంగ్‌తో పాటు ఇంటికి చేర్చారు. ఫిజియోథెరపిస్టు, సంరక్షకుల సాయంతో కాసేపు సొంతంగా శ్వాస తీసుకోవటం నేర్చుకున్నారు. ఓపెన్‌ స్కూలు విధానంలో చదువుకున్నారు. నోట్స్‌ రాసుకోవటం సాధ్యం కాదు కాబట్టి ఆయా విషయాలను జ్ఞాపకం చేసేవారు. డల్లాస్‌ హై స్కూల్‌లో 21 ఏళ్ల వయసులో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఇలా ఆ స్కూలులో హాజరు కాకుండా ఉన్నత విద్య పూర్తిచేసిన తొలి వ్యక్తిగా చరిత్రకు ఎక్కారు. అనంతరం సదరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్‌ అందుకున్నారు. ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో చేరి 1978లో డిగ్రీ సాధించారు. అక్కడితోనే ఆగిపోలేదు. ఆ తర్వాత న్యాయవిద్యనూ అభ్యసించారు. ఆస్టిన్‌ ట్రేడ్‌ స్కూలులో కోర్టు స్టెనోగ్రాఫర్లకు న్యాయ పరిభాష ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు.. శరీరాన్ని నిలువుగా ఉంచే ప్రత్యేక వీల్‌ఛైర్‌లో కోర్టుకు హాజరై కేసులూ వాదించారు. అత్యంత ఎక్కువకాలం ఐరన్‌ లంగ్‌లో గడిపిన వ్యక్తిగా గిన్నెస్‌ రికార్డునూ అందుకున్నారు. 2024లో టిక్‌టాక్‌ ఖాతాను ఆరంభించి తన జీవితం గురించి వివరించటం ఆరంభించారు. ఆయన చనిపోయేనాటికి 3.30 లక్షల మంది ఫాలోయర్లు ఉండేవారు.

ఎవరు రూపొందించారు?

హార్వర్డ్‌ టి.హెచ్‌. చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన ఫిలిప్‌ డ్రింకర్‌ 1927లో ఐరన్‌ లంగ్‌ను రూపొందించారు. దీన్ని తొలిసారిగా 1928లో ఒక పిల్లాడి ప్రాణాన్ని కాపాడటానికి వాడారు. పోలియో ఉద్ధృతమయ్యాక పోలియో వార్డుల్లో ఇదొక తప్పనిసరి యంత్రంగా మారిపోయింది. పోలియో టీకా అందుబాటులోకి వచ్చేంతవరకూ ఐరన్‌ లంగ్‌ ప్రాణాలను కాపాడే సాధనంగా తోడ్పడింది. తీవ్రమైన పోలియో బారినపడ్డ పిల్లలకు ఇదే మొట్టమొదటి చికిత్సగా నిలిచింది. అప్పట్లో దీన్ని అత్యంత అధునాతన వైద్య పరిజ్ఞానంగా భావించేవారు కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని