మానవ రోబో దండు!

రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి.

Published : 27 Mar 2024 00:11 IST

రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. అయితే ఇవన్నీ లోపల నిక్షిప్తం చేసిన ప్రాజెక్టును బట్టి నిర్ణయించిన పనులే చేస్తాయి. మరి మనిషిలా ఆలోచిస్తూ, పరిసరాలను గమనిస్తూ, సందర్భానికి అనుగుణంగా నడవడిని మార్చుకుంటూ.. ఆ మాటకొస్తే మన భాషను అర్థం చేసుకుంటూ.. మనతో మాట్లాడుతూ.. మనల్ని అనుకరిస్తూ క్షణక్షణానికీ పురోగతి చెందితే? అలాంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. మనిషిని పోలిన మరమనుషుల (హ్యూమనాయిడ్‌ రోబో) రంగం కొత్త శకంలోకి అడుగిడుతోంది. ఇప్పటికే ఇలాన్‌ మస్క్‌కు చెందిన ఆప్టిమస్‌ రోబోలు ఆసక్తి కలిగిస్తుండగా.. ఫిగర్‌ ఏఐకి చెందిన రోబో ఛాట్‌జీపీటీతో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఎన్‌విడియా మరో ముందడుగు వేసి వినూత్నమైన జీఆర్‌00టీ అనే రోబోటిక్‌ ప్రాజెక్టును వెలువరించింది. ఇది రోబోలకు కృత్రిమ మేధను జోడించి, మనుషుల మాదిరిగా తీర్చిదిద్దే ప్రయత్నమే.

‘ఇది మానవ రోబో సంవత్సరం. మరింత జనరల్‌ పనుల కోసం రోబో హార్డ్‌వేర్‌ రూపకల్పన అవసరం ఎంతైనా ఉంది’. జీఆర్‌00టీ రోబోటిక్‌ ప్రాజెక్టును విడుదల చేస్తూ ఎన్‌విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ అన్న మాట ఇది. హ్యూమనాయిడ్‌ రోబోలు సృష్టించబోయే సంచలనాలను సూచిస్తున్న మాట ఇది. మనుషులను పోలిన రోబోల దండు వెంట రాగా ఆయన దీన్ని ప్రకటించారు. జీఆర్‌00టీ (జనరలిస్ట్‌ రోబో 00 టెక్నాలజీ) గొప్పతనం అలాంటిది మరి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్‌ సమ్మేళనమైన ఇది వినూత్న బేస్‌ మోడల్‌. మనుషులు మాట్లాడే భాషను రోబోలు అర్థం చేసుకోవటానికి.. మనుషులను గమనించటం, అనుకరించటం ద్వారా కదలికలను నేర్చుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది. దీంతో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, ఫిజిక్స్‌, కృత్రిమ మేధ అన్నీ ఒకదగ్గరకు వచ్చినట్టయ్యింది. ఈ మోడల్‌కు గుండెకాయలాంటి కొత్తరకం కంప్యూటర్‌నూ ఎన్‌విడియా ఆవిష్కరించింది. దీనిపేరు జెట్సన్‌ థోర్‌. ఇది మల్టీమోడల్‌ జనరేటివ్‌ ఏఐ సాధనాలకు శక్తినందించటం కోసం తయారుచేసిన జీపీయూ. ఈ ప్రాజెక్టు కోసం ఎన్‌విడియా బోస్టన్‌ డైనమిక్స్‌, ఫిగర్‌ ఏఐ, ఫోరియర్‌ ఇంటెలిజెన్స్‌, సాంక్చ్యురీ ఏఐ, యూనిట్రీ రోబోటిక్స్‌, ఎక్స్‌పెంగ్‌ రోబోటిక్స్‌ వంటి పలు సంస్థలతో కలిసి కృషి చేస్తోంది కూడా.


హార్డ్‌వేర్‌ అవసరం తీరేలా..

భారీ డేటాతో పెద్ద శ్రేణి ఏఐ ఆల్గారిథమ్‌లకు శిక్షణ ఇవ్వాలంటే ప్రత్యేక హార్డ్‌వేర్‌ అవసరం. ఇందుకు జెట్సన్‌ థోర్‌ కంప్యూటర్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది రోబోలకు మరింత ఎక్కువగా సెన్సర్‌ సమాచారాన్ని విడమరచుకునేలా శిక్షణ ఇస్తుంది. దీంతో పరిసరాల తీరుతెన్నులను గ్రహించటం రోబోలకు అలవడుతుంది. మనుషులు మాట్లాడే భాషలను నేర్చుకోవటం, మనుషులను అనుకరించే విద్యలనూ ఇది ప్రసాదిస్తుంది. హ్యూమనాయిడ్‌ రోబో రంగంలో ఇది కొత్త యుగానికి నాంది పలకనుంది. ఎన్‌విడియా సంస్థ ఓపెన్‌ సోర్స్‌ రోబోటిక్స్‌ ఫౌండేషన్‌లోనూ కలవటం గమనార్హం. ఓపెన్‌ సోర్స్‌ రోబోటిక్స్‌ అలయన్స్‌ ఏర్పాటుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఓపెన్‌ సోర్స్‌ రోబోటిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులను బలోపేతం చేయనుంది. అంటే మున్ముందు అత్యుత్తమ రోబో తయారీకి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఎవరైనా వాడుకోవచ్చు. అప్పుడు హ్యూమనాయిడ్‌ రోబోల రూపకల్పనక మరింత ఊపందుకోవటం ఖాయం.


గొప్ప పురోగతి

హ్యూమనాయిడ్‌ రోబోల దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలు గొప్ప పురోగతి సాధించాయి. వాటిని ప్రయోగశాలల గడపలను దాటిస్తున్నాయి. వ్యక్తిగత, వాణిజ్య అవసరాలు తీర్చటానికి వీలుగా సిద్ధం చేస్తున్నాయి.

ఏజిలిటీ సంస్థ గత సంవత్సరం చివరి నుంచే డిజిట్‌ అనే రోబో పరీక్షలను ఆరంభించింది. ఇది అమెజాన్‌ గోదాముల్లో పని చేస్తోంది. ఖాళీ పెట్టెలను ఎత్తటం, కదిలించటం వంటి పనులు ఏస్తోంది. మరో రెండు కంపెనీల గోదాముల్లోనూ ఏజిలిటీ సంస్థ రోబో పరీక్షలను మొదలెట్టింది.

యాప్ట్రోనిక్‌ సంస్థ కార్ల కంపెనీ ఇటీవల మెర్సిడెస్‌ బెంజ్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. తాము రూపొందించిన అపోలో హ్యూమనాయిడ్‌ రోబో పనిచేసేవారికి విడి భాగాలను ఎలా అందిస్తుందో, ఫ్యాక్టరీలో కార్లకు ఆయా భాగాలను జోడించే చోట ఎలా నిఘా వేయగలదో పరిశీ లించటం దీని ఉద్దేశం. వచ్చే సంవత్సరంలో దీనికి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాలని
భావిస్తున్నారు కూడా.


ఆప్టిమస్‌ ఆశలు

తమ కారు ఫ్యాక్టరీల్లో శ్రామికులుగా ఆప్టిమస్‌ రోబోలను (టెస్లా బాట్‌) ప్రవేశపెట్టాలని, తర్వాత ప్రజలకు మెటల్‌ బట్లర్‌గా అందుబాటులోకి తేవాలని టెస్లా భావిస్తోంది. పూర్తిస్థాయి స్వయంచోదిత కార్ల కన్నా ఆప్టిమస్‌ రోబోనే మరింత విలువైనది కానుందని మస్క్‌ భావిస్తున్నారు. దీన్ని త్వరలోనే టెస్లా కార్ల తయారీలో నియమించటానికి సిద్ధం చేస్తున్నారు. ఆ మధ్యన ఇది యోగాసనాలు వేసి అబ్బుర పరిచింది కూడా. రెండు కాళ్లతో మనిషిలా నడవటమే కష్టమనుకుంటే ఇది ఒంటి కాలి మీద నిల్చొనీ తన ప్రత్యేకతను చాటుకుంది. ఆప్టిమస్‌ రూపకల్పనకు సంబంధించి ఇటీవల 60 జాబ్‌ ప్రకటనలు వెలువడటం విచిత్రం. రోజువారీ వ్యవహారాలకు అనుగుణంగా ఆప్టిమస్‌ను రూపొందించటానికి మేనేజర్‌ అవసరమనేది వీటిల్లో ఒకటి. పని వాతావరణంలో ఆప్టిమస్‌ సరిగా నడచుకునేలా చూడటం దీని ఉద్దేశం. బోర్‌ కొట్టే లేదా ప్రమాదకరమైన పనుల్లో మనుషులకు తోడుగా ఉండే రోబోను తయారు చేయాలన్నది మస్క్‌ సంకల్పం. ఈ క్రమంలోనే ఆప్టిమస్‌ను 2022లో ఆవిష్కరించారు.


ఛాట్‌జీపీటీ రోబో!

ఛాట్‌జీపీటీ, రోబోలు కలిస్తే ఏమవుతుంది? మనిషిని పోలిన ఫిగర్‌ 01 రోబో అవుతుంది. ఫిగర్‌ సంస్థ ఇటీవలే దీని తాజా వర్షన్‌ను పరిచయం చేసింది. సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకే పరిమితమనుకునే రోబో పనులు నిజ జీవితంలోనూ సాధ్యమేనని ఇది నిరూపిస్తోంది. కెమెరా కళ్లు, ఛాట్‌జీపీటీకి చెందిన కృత్రిమ మేధ ఫీచర్లతో కూడిన ఈ రోబో చుట్టుపక్కల వస్తువులు, మనుషులను వర్ణిస్తూ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓపెన్‌ఏఐ సంస్థ రూపొందించిన విజువల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌ పరిజ్ఞానాలను, ఫిగర్‌ సంస్థకు చెందిన న్యూరల్‌ నెట్‌వర్క్స్‌ను దీనికి జత చేశారు. అందువల్ల పనులను కచ్చితంగా, వేగంగా చేయగలుగుతోంది. యాపిల్‌ను అందించటం, చెత్తను ఏరటం వంటి వాటితో తినటానికి ఏదైనా తీసుకురా అని చెప్పినా చేసేస్తోంది. అంతేనా? మాటలను గుర్తించటం, సందర్భానికి అనుగుణంగా వాటిని విడమరచు కోవటం, కదలికల నైపుణ్యాలనూ ప్రదర్శిస్తోంది. మనుషుల మాదిరిగా మాట్లాడుతూ, కదులుతూ అబ్బుర పరుస్తోంది. ప్రదర్శన స్థాయిలోనే ఫిగర్‌ 01 ఇన్ని పనులు చేస్తుంటే వాణిజ్యపరంగా విడుదలయ్యే రకం ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తుందో? ఫిగర్‌ సంస్థ బీఎండబ్ల్యూ కార్ల పరిశ్రమల్లో హ్యూమనాయిడ్‌ రోబోల కోసం ఒప్పదం కూడా కుదుర్చుకుంది.


మన రోబో షాలూ

హ్యూమనాయిడ్‌ రోబోల విషయంలో మనదేశమూ తీసిపోలేదు. ముంబయిలోని కేంద్రీయ విద్యాలయ కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌ దినేశ్‌ పటేల్‌ ఆ మధ్య షాలూ అనే రోబోను రూపొందించి ఆశ్చర్యపరిచారు. అదీ పూర్తిగా వ్యర్థ పదార్థాలతో. పారేసిన ప్లాస్టిక్‌, కార్డ్‌బోర్డ్‌, చెక్క, అల్యూమినియం భాగాలను దీనికి వాడుకున్నారు. కంప్యూటర్‌ విజన్‌ సాయంతో ఇది మనుషుల ముఖాలను గుర్తించగలదు, జ్ఞాపకం పెట్టుకోలదు. తరచూ వాడే వస్తువులనూ పోల్చుకోగలదు. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, భోజ్‌పురి, మరాఠీ, బంగ్లా, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, నేపాలీ భాషల్లోనూ మాట్లాడగలదు. విదేశీ భాషలతో కలిపితే అలాగే 38 విదేశీ భాషల్లోనూ మాట్లాడేస్తుంది. అంతా కృత్రిమ మేధ మహత్తే. దీన్ని తరగతుల్లో పాఠాలు చెప్పటానికీ వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది క్విజ్‌ పోటీలను నిర్వహించగలదు. జనరల్‌ నాలెడ్జ్‌, పాఠాలకు సంబంధించిన ప్రశ్నలకూ జవాబులు ఇవ్వగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని