రోబో సేవలు చేసేనే..

మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్‌ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి.

Published : 03 Apr 2024 00:26 IST

మనిషికి మనిషి తోడంటారు. ఇప్పుడు మర మనిషీ (రోబో) చేయందిస్తోంది. ఒకపక్క అధునాతన హ్యూమనాయిడ్‌ రోబోల వెల్లువ సంచలనం సృష్టిస్తుండగా.. మరోపక్క మామూలు రోబోలూ సేవలకు సిద్ధమవుతున్నాయి. కృత్రిమ మేధ సాయంతో మానవ ప్రమేయం లేకుండా తమకు తామే అవసరమైన పనులు చేసి పెట్టటానికి రంగంలోకి దిగుతున్నాయి. పంటల సంరక్షణ, ఆహార సరఫరా దగ్గరి నుంచి పహరా కాయటం వరకూ ఎలాంటి పనులైనా చేయగలమని నిరూపిస్తున్నాయి. మానవులకు శ్రమ తప్పించటం, శ్రామికుల కొరతను తగ్గించటంతో పాటు పర్యావరణ హితానికీ తోడ్పడతామని భరోసా ఇస్తున్నాయి. వివిధ దేశాల్లో వైవిధ్యమైన పనులకు తోడ్పడుతున్న కొన్ని రోబోల వివరాలు ఇవిగో..


తులిప్‌ పువ్వుల సంరక్షణలో..

రాత్రనకా, పగలనకా నిరంతరం తులిప్‌ పువ్వుల పొలంలో పనిచేసే రోబో ఇది. పేరు థియో. కృత్రిమ మేధ సాయంతో మొగ్గలను పర్యవేక్షించటం దీని ప్రత్యేకత. ఒకవేళ దేనికైనా చీడ పడితే వెంటనే నిర్మూలించేస్తుంది. చీడ పట్టిన తులిప్‌ మొక్కల ఆకుల మీద ఎర్రటి చారలు ఏర్పడుతుంటాయి. వీటిని గుర్తించేలా థియోకు శిక్షణ ఇచ్చారు మరి. అందువల్ల ఎప్పటికప్పుడు చీడ పట్టిన పువ్వులను తొలగిస్తుంది. ఇలా ఇతర పువ్వులకు వైరస్‌ల వంటివి సోకకుండా కాపాడుతుంది. విలువైన పంట నష్టపోకుండా చూస్తుంది. ఇది నెదర్లాండ్స్‌లోని ఒక పొలంలో ఎలా పనిచేస్తోందో చూడండి. థియో రోబో చాలా నెమ్మదిగా.. గంటకు సుమారు కిలోమీటరు దూరం ప్రయాణిస్తూ పువ్వులను గమనిస్తుంది.


సర్వ కార్య నిర్వహణలో..

ట్టణ వీధుల్లో చెత్త ఏరటం.. గోదాముల్లో బరువులు ఎత్తటం.. మినీ బస్సు మాదిరిగా ప్రయాణికులను చేరవేయటం... విమానాశ్రయాల్లో లగేజీలను మోయటం.. ఇలాంటి పనులన్నింటినీ ఒక్క వాహనమే.. అదీ తనకు తానే చేస్తే? ఇడాగ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ సృష్టించిన సిటీబాట్‌ మొబైల్‌ వాహనం చేసేది ఇదే. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ పట్టణంలో చేపట్టిన ‘క్యాంపస్‌ ఫ్రీసిటీ’ ప్రాజెక్టులో భాగంగా విధులు నిర్వహిస్తోంది. ఆటనమస్‌ డ్రైవింగ్‌, కృత్రిమ మేధ వంటి అధునాతన పరిజ్ఞానాలతో పట్టణ రవాణాను సులభతరం చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం.


ఆహార సరఫరా సేవలో..

ట్టణాల్లో ఫుడ్‌ డెలివరీ సేవలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం డెలివరీ బాయ్‌లే ఆహార పదార్థాలను తెచ్చి ఇస్తున్నారు. కొన్నిదేశాల్లో ఈ పరిస్థితి మారిపోతోంది. స్వయం చోదిత బుల్లి వాహనాల్లాంటి రోబోలతో ఫుడ్‌ డెలివరీ విధానం అందుబాటులోకి వస్తోంది. ఉబర్‌ ఈట్స్‌ ఇటీవల జపాన్‌లో ఆరంభించిన డెలివరీ రోబోనే దీనికి నిదర్శనం. ఇది గబగబా నడవటంతో సమానమైన వేగంతో దూసుకెళ్తుంది. డెలివరీ బాయ్స్‌ కొరత తీర్చటంతో పాటు పర్యావరణ హితంగా ఆహారాన్ని చేరవేయటానికీ ఇది ఉపయోగపడుతుంది. యాప్‌లో ఆర్డర్‌ ఇవ్వగానే స్టోర్‌కు వెళ్లి, ప్యాకేజీని తీసుకుంటుంది. నిర్దేశించిన చిరునామాకు చేరవేస్తుంది. యాప్‌లోని పిన్‌ సాయంతో ఆర్డర్‌ను తీసుకోవచ్చు.


ట్రాఫిక్‌ పర్యవేక్షణలో..

దో శునక రోబో. రోడ్డు మీద పహారా కాయటం దీని పని. ఇటీవల స్పెయిన్‌లో వీధుల్లో పోలీసులు దీన్ని పరీక్షించారు. కుక్క మాదిరిగా కనిపిస్తున్న దీన్ని చూడటానికి చాలామంది ఎగబడ్డారు. పెంపుడు కుక్కలకు దీన్ని చూపించి, మురిసిపోయారు కూడా. ఇంతకీ ఇదేం చేస్తుందో తెలుసా? ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించే ద్విచక్ర వాహనాలను పట్టుకుంటుంది. ప్రస్తుతానికి రిమోట్‌తోనే పనిచేస్తున్నప్పటికీ మున్ముందు కృత్రిమ మేధనూ దీనికి జోడించనున్నారు. అప్పుడు మనుషుల ప్రమేయం లేకుండానే విధులు నిర్వహించేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని