కాల మహిమ

ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా?

Updated : 10 Apr 2024 10:00 IST

ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? మహా మహా తత్వవేత్తలు, శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రశ్నలు. కోట్లాది ఏళ్లుగా మానవ మేధకు పరీక్ష పెడుతున్న ప్రశ్నలు. మనమంతా కాలాన్ని ‘అనుభవిస్తూ’ ఉంటాం. ఆయా ఘటనలు ఎప్పుడు జరిగాయో, వాటికి ఎంతసేపు పట్టిందో? ఏవి ముందు, ఏవి తర్వాత జరిగాయో దీని ద్వారానే తెలుసుకుంటాం. కానీ కాలాన్ని ఇదమిత్థంగా ఇదీ అని నిర్వచించలేం. దీన్ని అర్థం చేసుకోవటమూ కష్టమే. దీనికి సైన్స్‌, తత్వశాస్త్రం, మతం, కళలు వేర్వేరు నిర్వచనాలు ఇచ్చాయి. కాలం పుట్టుకను అన్వేషించే క్రమంలోనే భౌతిక శాస్త్రవేత్తలకు విశ్వం ఆవిర్భావ మూలాలూ తగిలాయి. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన తర్వాతే కాలం, అంతరిక్షాన్ని అవగాహన చేసుకోవటం.. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని లోతుగా పరిశీలించటం సాధ్యమైంది. బిగ్‌బ్యాంగ్‌ నుంచే కాలం ఉనికిలోకి వచ్చిందా? లేకపోతే విశ్వం పరిణామంతోనా? చాలా ఏళ్లుగా జవాబు దొరకని ఈ ప్రశ్నలకు గురుత్వ క్వాంటమ్‌ స్వభావాన్ని వివరించే తాజా సిద్ధాంతాలు కొన్ని విశిష్టమైన, అద్భుతమైన సమాధానాలు అందిస్తున్నాయి.

మనమంతా కాల గణనకు గడియారాల మీదే ఆధారపడుతున్నాం. సెకండ్లు, నిమిషాలు, గంటల రూపంలో కాలాన్ని విభజించుకుంటున్నాం. అయితే కాల ప్రమాణాలు అనాదిగా మారుతూనే వస్తున్నాయి. ఆధునిక అంతర్జాతీయ కాల ప్రమాణం సెకండు. సీసియం అణువులో ఎలక్ట్రాన్‌ మార్పిడి ఆధారంగా దీన్ని నిర్వచించారు. ఇంతకీ కాలమంటే ఏంటి? ప్రపంచంలో ప్రతీదీ మారేదే. ఏ వ్యవస్థ అయినా మారకుండా ఉంటే అది కాలాతీతమవుతుంది. అందుకేనేమో భౌతికవేత్తలు కాలాన్ని గతం నుంచి వర్తమానం ద్వారా భవిష్యత్తులోకి వెళ్లే ఘటనల పురోగతిగా నిర్వచించారు. దీన్ని వాస్తవికత నాలుగో కొలత(డైమెన్షన్‌)గా పరిగణించారు. మూడు కొలతల అంతరిక్షంలో జరిగే ఘటనలను వర్ణించటానికిది ఉపయోగపడుతుంది. కాలాన్ని మనం చూడలేం, తాకలేం, రుచి చూడలేం. కానీ కాలం గడుస్తుండటాన్ని లెక్కించొచ్చు.

 ఒకే దిశలో..

కాలం భవిష్యత్తులోకి ముందుకు కదులుతుందా? గతంలోకి వెనక్కి ప్రయాణిస్తుందా? వీటిని భౌతిక సూత్రాలు సమాన దృష్టితోనే చూస్తాయి. అయితే నిజ ప్రపంచంలో కాలం విల్లు నుంచి వెలువడిన  బాణం మాదిరిగా ఒకే దిశలో ప్రయాణిస్తుంది (టైమ్‌ యారో). కాలం ఎందుకు వెనక్కిపోదనేది శాస్త్రరంగంలో అంతుచిక్కని పెద్ద ప్రశ్న. నిజ ప్రపంచం ఉష్ణ గతిక శాస్త్ర (థర్మోడైనమిక్స్‌) నియమాలను అనుసరిస్తుందనేది ఒక వివరణ. థర్మోడైనమిక్స్‌ రెండో నియమం ప్రకారం- ఒక వివిక్త (ఐసోలేటెడ్‌) వ్యవస్థలో దాని అస్థిర, అనిశ్చిత స్థితి (ఎంట్రోపీ) స్థిరంగా ఉంటూ వస్తుంది. లేదూ పెరుగుతూ వస్తుంది. ఈ విశ్వాన్ని వివిక్త వ్యవస్థగా భావిస్తే ఎంట్రోపీ ఎన్నటికీ తగ్గదు. అంటే విశ్వం తను మొదలైన బిందువు వద్దకు తిరిగి ఎన్నడూ చేరదన్నమాట. అందువల్ల కాలం వెనక్కి ప్రయాణించదు. అందుకే మనకు వర్తమానం, గతమే జ్ఞాపకముంటాయి. భవిష్యత్తు ఇంకా జరగలేదు కాబట్టి దానికి సంబంధించిన జ్ఞాపకాలేవీ ఉండవు. వర్తమానాన్ని గతంతో పోల్చి భవిష్యత్తును అంచనా వేస్తుంటాం. జరగబోయే దాన్ని ఊహిస్తుంటాం.

కాలంలోకి ప్రయాణం

కాలంలోకి ప్రయాణించటం (టైమ్‌ ట్రావెల్‌) మొదటి నుంచీ ఆసక్తి కలిగించే విషయమే. దీని మీద బోలెడన్ని కాల్పనిక కథలు, సినిమాలు వచ్చాయి. ఆదిత్య 369 సినిమాలో టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణదేవరాయల కాలానికి, భవిష్యత్తు కాలంలోకి ప్రయాణించటం చూసే ఉంటారు. కాలంలో రెండు వేర్వేరు బిందువులకు.. ముందుకు లేదా వెనక్కు వెళ్లటమే టైమ్‌ ట్రావెల్‌. అంటే అంతరిక్షంలో రెండు వేర్వేరు బిందువుల మధ్య ప్రయాణించటం అన్నమాట. ఈ ప్రకృతిలో భవిష్యత్తు కాలంలో దూకటం కొంతవరకు గమనించొచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు భూమ్మీదికి తిరిగి వచ్చినప్పుడు కాలంలో ఒకింత ముందుంటారు. ఎందుకంటే అంతరిక్ష కేంద్రం కన్నా భూమి తక్కువ వేగంతో కదులుతుంది మరి. అయితే కాలంలో వెనక్కి పోవటమనేది అసాధ్యం. ఒకవేళ సాధ్యమైనా చిక్కులు తెచ్చిపెడుతుంది. కార్య, కారణ ప్రభావాలు వైరుధ్యానికి దారితీస్తాయి. ఉదాహరణకు- మీరు కాలంలో వెనక్కి వెళ్లి మీ అమ్మ లేదా నాన్న పుట్టకముందే తాతను చంపారనుకోండి. మీ పుట్టుకను మీరే ఆపినట్టు అవుతుంది. అందుకే గతంలోకి ప్రయాణించటం అసాధ్యమన్నది చాలామంది భౌతికవేత్తల నమ్మకం. కానీ మున్ముందు భవిష్యత్తులోకి వెళ్లటం సాధ్యం కావొచ్చు. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాల ప్రవాహం స్థిరంగా ఉండదు. పరిస్థితులను బట్టి నెమ్మదించొచ్చు, వేగం పుంజుకోవచ్చు. కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించగలిగితే తప్ప భవిష్యత్తులోకి వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే కాంతి వేగంతో ప్రయాణించే సాధనాలేమీ లేవు.

కాల అనుభూతి

కాలం గురించి మనకు తెలిసినదంతా అంతర్గత అనుభూతి నుంచే అవగతమవుతుంది. కేవలం ఒక సెకండు మాత్రమే ఉనికిలో ఉండే తక్షణాన్ని మన మెదడు ఎలా అనుభూతి చెందుతోంది, ఈ ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తోందనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. దీన్నే మనం వర్తమానంగా పిలుచుకుంటున్నాం. కానీ సాంకేతికంగా చూస్తే అదొక అనుభూతి, అనుభవమనే చెప్పుకోవాలి. మానసిక నిపుణులు, తత్వవేత్తలు, భౌతికవేత్తలు, మెదడు పరిశోధకుల భావన ఇదే. అప్పటికే నిక్షిప్తమైన జ్ఞాపకాల ద్వారా మెదడు గతం అనుభవయ్యేలా చేస్తుంది. వాటి ఆధారంగా కొద్ది సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజుల తర్వాత ఏం జరుగబోతోందో అని అంచనాలు కట్టి, భవిష్యత్తును దర్శింపజేస్తుంది. అవును.. కాల ప్రవాహం ఒక భ్రాంతి. ఇది తక్షణ జ్ఞాపకాల పరంపర, వర్తమాన అనుభూతి, మున్ముందు జరగబోయే అంచనా ఘటనల మీద ఆధారపడి నడుస్తుంది. పక్షవాతం బారిన పడ్డవారి మీద నిర్వహించిన అధ్యయనాలు, నాడీ సమాచార మార్గాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మెదడులోని ప్రిఫ్రాంటల్‌ కార్టెక్స్‌, బేసల్‌ గ్యాంగ్లియా, యాంటీరియర్‌ ఇన్సులార్‌ కార్టెక్స్‌ వంటి వ్యవస్థలు ఒక సమన్వయంతో వ్యవహరిస్తూ కాలం భావన కలిగిస్తున్నాయని వివరిస్తున్నాయి. మనం గత జ్ఞాపకాల నుంచి ఒక అనుభూతి పొందుతాం. ఆ సమయంలో భౌతిక ప్రపంచం తీరును గ్రహిస్తాం. ఇది అసంబద్ధమేమీ కాదు. ఆనాటి వాస్తవ ఘటనలే జ్ఞాపకాలుగా ముద్రితమవుతాయి. ఆయా ఘటనల ఫొటోలు, వీడియోల వంటివే ఇందుకు నిదర్శనం. వీటిని చూసినప్పుడు ఆ ఘటనలూ గుర్తు కొస్తాయి.

నెమ్మది, వేగం

కాలం ఎప్పుడూ ఒకే వేగంతో సాగుతుంది. కానీ కొన్నిసార్లు త్వరగా ముగిసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లేమో చాలా నెమ్మదిగా, ఆలస్యంగా సాగుతున్నట్టు తోస్తుంది. దీనికి కారణం మన మెదడే. దీనిలోని సుప్రక్రియాస్మాటిక్‌ న్యూక్లీ అనే భాగం రాత్రీ పగలూ తేడాను గుర్తిస్తుంది. అయితే నాడీకణాల మధ్య సమాచారాన్ని చేరవేసే న్యూరోట్రాన్స్‌మిటర్లు, మందులు కాలం భావన మీద ప్రభావం చూపొచ్చు. నాడీకణాలను ఉత్తేజితం చేసే రసాయనాలు కాలం త్వరగా గడిచిపోయే భావన కలిగించొచ్చు. అదే నాడీకణాల చురుకుదనం మందగిస్తే కాలం నెమ్మదిగా గడుస్తున్నట్టు అని పించొచ్చు. అందుకే ఆత్మీయులతో గడుపుతున్నప్పుడు సమయం త్వరగా ముగిసినట్టు అనిపిస్తుంది. అదే బాధలో, విచారంలో నాడీకణాల పనితీరు మందగించి కాలం భారంగా గడుస్తుంది. చిన్నవయసులో కన్నా వృద్ధాప్యంలో కాలం నెమ్మదిగా సాగుతోందనే భావనకూ ఇదే మూలం.

సూర్య సిద్ధాంతం ప్రకారం

బిగ్‌బ్యాంగ్‌ నుంచే కాలం మొదలైందని సైన్స్‌ చెబుతుంది. అయితే మన పురాణ గాథల సర్వస్వం కాలాన్ని విశాలమైన సృష్టి, ప్రళయ చక్ర భ్రమణంగా పేర్కొంటుంది. సూర్య సిద్ధాంతం దీన్ని విపులంగా పేర్కొంటుంది. ఖగోళానికి సంబంధించి ఉనికిలో ఉన్న అతి పురాతన గ్రంథం ఇదే. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి 2,500 ఏళ్ల క్రితం నాటిదని భావిస్తారు. ఇందులో కాలం రకాలు.. దేవతలు, రాక్షసుల సంవత్సరాల వ్యవధి.. బ్రహ్మ రాత్రి, పగలు.. సృష్టి ఆరంభం నుంచీ గతించిన కాలం వంటి వివరాలన్నీ ఉంటాయి. దీని ప్రకారం.. కాలమే అన్నింటినీ సృష్టిస్తుంది, నశింపజేస్తుంది. పరిమితం, అపరిమితమని కాలం రెండు రకాలు. అపరిమిత కాలానికి ఆది గానీ అంతం గానీ లేవు. మనకు కేవలం పరిమిత కాలం గురించే తెలుసు. దీనికి ఆదీ అంతం ఉన్నాయి. పరిమిత కాలంలో ఆచరణీయ, తాత్విక అని మళ్లీ రెండు రకాలు. ఆచరణీయ కాలాన్ని లెక్కించొచ్చు. తాత్విక కాలాన్ని కొలవటానికి కాలం సరిపోదు. ఆచరణీయ కాలం శ్వాస(ప్రాణ)తో మొదలవుతుంది. తాత్విక కాలం ‘అణు’ కొలత(త్రుటి)తో ఆరంభం అవుతుంది. సూర్య సిద్ధాంతం ఆచరణీయ కాలాన్నే ప్రముఖంగా పేర్కొంటుంది. ఆరు శ్వాసలు ఒక వినాడి. అరవై వినాడులు ఒక నాడి. ఒక రోజుకు (రాత్రితో కలిపి) 60 నాడులు, ఒక నెలకు 30 రోజులు, ఏడాదికి 12 నెలలు. మనకు ఒక సంవత్సరం దేవతలకు ఒక పగలుతో సమానం. అప్పుడు రాక్షసులకు రాత్రి కాలం. ఇలా దేవతలకు, రాక్షసులకు కాలం మారుతూ వస్తుంటుంది. మనకు 360 సంవత్సరాలు దేవతలు ఒక ఏడాదితో సమానం.
12వేల దేవతా సంవత్సరాలు = ఒక చతుర్యుగం (మహాయుగం, నాలుగు యుగాలు)
71 చతుర్యుగాలు = ఒక మన్వంతరం
14 మన్వంతరాలు = ఒక కల్పం (కల్పం అంతంలో ప్రతి ఒక్కటీ నశిస్తుంది)
 ఒక కల్పం బ్రహ్మకు ఒక పగలు. మరో కల్పం రాత్రి. ఇలాంటి పగలు, రాత్రుల రోజులను ఏళ్లుగా లెక్కిస్తే బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఇందులో సగం గడిచింది. ఇప్పడు మనం రెండో సగంలోని మొదటి కల్పంలో ఉన్నాం. అంటే బ్రహ్మ 50వ సంవత్సరంలో తొలి రోజులో జీవిస్తున్నామన్నమాట. ఈ కల్పంలో ఇప్పటికే ఆరు మన్వంతరాలు గడిచిపోయాయి. ఏడో మన్వంతరంలో (వైవస్వత మన్వంతరంలో) 27 మహా యుగాలు గడిచాయి. ప్రస్తుత 28వ మహా యుగంలో ఒకటి ఇప్పటికే ముగిసింది. దీన్ని బట్టి ఎంతకాలం గడిచిందో లెక్క వేయటానికి ప్రయత్నించి చూడండి. లోతుకు వెళ్లిన కొద్దీ కాల రహస్యాలు అనంతం, అద్భుతం.

ఆదీ అంతం ఉన్నాయా?

కాలానికి ఆదీ అంతం ఉన్నాయా? ఉంటే ఎప్పుడు మొదలైంది? ఎలా అంతమవుతుంది? ఇవన్నీ ఆసక్తికర ప్రశ్నలే. విశ్వం పుట్టుకతో పరిశీలిస్తే కాలానికి ఆరంభం ఉందనే భావించాలి. సుమారు 1,380 కోట్ల క్రితం మహా విస్ఫోటనం (బిగ్‌ బ్యాంగ్‌) జరిగింది. దీని నుంచే విశ్వం ఆవిర్భవించింది. అప్పటి నుంచే కాలం మొదలైందని చెప్పుకోవచ్చు. నిరంతరం విస్తరిస్తున్న విశ్వంతో పాటు కాలమూ సాగుతోంది. ఖగోళ నేపథ్య రేడియేషన్‌ను బిగ్‌ బ్యాంగ్‌ నుంచి వచ్చిన సూక్ష్మ తరంగాల రూపంలో లెక్కించే అవకాశముంది. కానీ తొలినాళ్లకు సంబంధించిన రేడియేషన్‌ జాడను గుర్తించలేకపోయాం. కాలం పుట్టుక గురించి ఒక వాదన ఏంటంటే- ఒకవేళ కాలం నిరంతరం వెనక్కి వెళ్తున్నట్టయితే పురాతన నక్షత్రాల నుంచి వచ్చే కాంతి రాత్రి ఆకాశంలో నిండిపోయి ఉండేది. మరి కాలం అంతమవుతుందా? దీనికి జవాబు తెలియదు. విశ్వం నిరంతరం వ్యాపిస్తున్నట్టయితే కాలమూ అలా సాగుతూనే ఉంటుంది. ఒకవేళ కొత్త మహా విస్ఫోటనం సంభవిస్తే మన కాల రేఖ ముగుస్తుంది. మరో కొత్త కాలం ఆరంభమవుతుంది. శూన్యం నుంచి యాదృచ్ఛిక కణాలు పుట్టుకొస్తున్నట్టు పార్టికల్‌ ఫిజిక్స్‌ ప్రయోగాల్లో వెల్లడైంది మరి. విశ్వం నిశ్చలంగా లేదా కాల రహితంగా ఉండదనే ఇది తెలియజేస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందనేది కాలమే చెప్పాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని