కంప్యూటర్‌ శాస్త్రవేత్తకు ఆస్కార్‌

ఆయన నటుడు కాదు. గాయకుడు కాదు. సంగీత దర్శకుడు కాదు. యానిమేటర్‌ కూడా కాదు. ఆయనో కంప్యూటర్‌ శాస్త్రవేత్త. అయినా ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారు.

Published : 15 Mar 2023 00:03 IST

యన నటుడు కాదు. గాయకుడు కాదు. సంగీత దర్శకుడు కాదు. యానిమేటర్‌ కూడా కాదు. ఆయనో కంప్యూటర్‌ శాస్త్రవేత్త. అయినా ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారు. అదీ ఒకసారి కాదు, రెండోసారి. గొప్ప గొప్ప సినీ కళాకారులకే సాధ్యం కాని అలాంటి ఘనతను సాధించిందెవరో తెలుసా? థియోడోర్‌ కిమ్‌. యేల్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన ఈ సంవత్సరం సైంటిఫిక్‌ అండ్‌ టెక్నికల్‌ ఆస్కార్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. పిక్సార్‌ యానిమేషన్‌ స్టుడియోకు చెందిన మరికొందరితో కలిసి కిమ్‌ దీన్ని అందుకున్నారు. ఇంతకీ ఆయనకు ఈ పురస్కారాన్ని ఎందుకిచ్చారో తెలుసా? ఫిట్‌జీ2 ఎలాస్టిక్‌ సిమ్యులేషన్‌ సిస్టమ్‌ను రూపొందించినందుకు. ఇదో యానిమేషన్‌ సిమ్యులేటర్‌. ఇది దుస్తుల వంటి మెత్తటి వస్తువులు కదులుతున్నప్పుడు వాటి కదలికలకు మోడల్‌గా ఉపయోగపడుతుంది. వేవ్‌లెట్‌ టర్బులెన్స్‌ అనే ప్రోగ్రామ్‌ను రూపొందించినందుకు కిమ్‌ 2012లోనూ ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నారు. ఇది యానిమేషన్‌లో మంటలు, పేలుళ్ల దృశ్యాలను వాస్తవికంగా సృష్టించటానికి తోడ్పడుతుంది.

యాదృచ్ఛికంగా సినిమా వైపు

కార్నెల్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన కిమ్‌ యాదృచ్ఛికంగానే సినీ రంగంలోకి అడుగు పెట్టారు. డిగ్రీ పూర్తయ్యాక రిథమ్‌ అండ్‌ హ్యూస్‌ అనే స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ స్టుడియోలో వేసవి ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లు కిమ్‌ను పరిశోధక విద్యార్థిగా పొరపడి సీటు ఇచ్చారు. అలా హ్యారీ పాటర్‌ సినిమాకు తొలిసారి పనిచేసే అవకాశం లభించింది. నార్త్‌ కరోలీనా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తిచేశాక అధ్యాపకుడిగా పనిచేశారు. పిక్సార్‌ సంస్థలో సీనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. చివరికి 2019లో యేల్‌ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. నిజానికి కళలకు, సైన్స్‌కు మధ్య సంబంధం ఈనాటిది కాదు. లియోనార్డో డావించీ వంటి ఆవిష్కర్తలు, ఇంజినీర్లు ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ఏనాడో చెరిపేశారు. కంప్యూటర్‌ శాస్త్రవేత్త అయిన కిమ్‌కు 3డీ యానిమేషన్‌తో సంబంధం ఉండటంలో ఆశ్చర్యమేముంది?
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని