E-Waste: ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్‌ అడుగులు!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఇది ఈ-వ్యర్థాల నియంత్రణ దిశగా భారత్‌ అడుగులు వేస్తుందనేందుకు నిదర్శనం. 

Published : 29 Jan 2023 15:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికతలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌ఫోన్స్‌, స్మార్ట్‌ స్పీకర్స్‌, కంప్యూటర్లు, గేమింగ్ డివైజ్‌లు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మరి, పాత ఉత్పత్తులను ఏం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఈ పరిస్థితిపై భారత్‌ సహా ఇతర ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకు మీ వద్ద స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్, స్మార్ట్‌వాచ్‌ ఉన్నాయి. వీటి మూడింటికి వేర్వేరు ఛార్జర్లు ఉంటాయి. వీటి స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేస్తే, పాత డివైజ్‌ల ఛార్జింగ్‌ కేబుల్, అడాప్టర్‌ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు (ఈ-వేస్ట్‌)గా మారిపోయినట్లే. దాంతోపాటు పాత ఫోన్‌, ట్యాబ్‌ను ఎలా? ఎక్కడ? పారేస్తారనేది కూడా ఆందోళనకరం.  

మొబైల్‌ వ్యర్థాలే అధికం

తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు  50 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పోగవుతుండగా, భారత్‌లో రెండు మిలియన్‌ టన్నులు ఉన్నట్లు సమాచారం. వీటిలో అధికంగా మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లతోపాటు వాటి యాక్ససరీలు ఉంటున్నాయట. అందుకే భారత్‌ సహా యూరోపియన్‌ యూనియన్‌, ఫోన్‌, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఒకేరకమైన ఛార్జింగ్ పోర్ట్‌ను అమర్చాలని కంపెనీలకు సూచించాయి.  ఈ క్రమంలో  భారత వినియోగదారుల మంత్రిత్వ శాఖ కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జర్‌ ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించినట్లు సమాచారం. దీనిని దశల వారీగా అమలుచేయనున్నారు.

యాపిల్‌, శాంసంగ్ బాటలోనే

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల నియంత్రణలో భాగంగా యాపిల్‌ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తులకు, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఛార్జింగ్‌ కోసం యాపిల్ లైటెనింగ్‌ పోర్ట్‌ను ఇస్తోంది. వచ్చే ఏడాది విడుదల చేయబోయే ఫోన్‌లలో యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ను ఇవ్వనుందట. పర్యావరణ పరిరక్షణ కోసం యాపిల్, శాంసంగ్‌ వంటి కంపెనీలు కొత్త ఫోన్‌తో పాటు ఛార్జింగ్ అడాప్టర్‌ ఇవ్వడంలేదు. తాజాగా, వన్‌ప్లస్‌, ఒప్పో కంపెనీలు సైతం ఫోన్‌ బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్లు ఇవ్వకూడదని నిర్ణయించాయి. యూజర్లు తమ పాత ఫోన్లకు ఉండే అడాప్టర్లతోనే కొత్త ఫోన్‌లను ఛార్జ్‌ చేసుకోమని సూచిస్తున్నాయి. 

భారత్‌ ఏమంటోంది

గతేడాది గ్లాస్గోలో జరిగిన జి20 దేశాల సదస్సులో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి భారత్‌ 50 శాతం ఈ-వేస్ట్‌, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించుకుంటుందని ప్రకటించారు. తాజాగా బాలిలో జరిగిన జి20 సదస్సులో  ప్రధాని మోదీ మరోసారి ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్‌ కంపెనీలు సైతం  ఒకే రకమైన ఛార్జర్‌ ఇచ్చే విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారత్‌లో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు ఒకే విధమైన ఛార్జింగ్‌ పోర్ట్‌ను ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించడం, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను తగ్గించుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తుందనేందుకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని