మహా విజ్ఞానం! అద్భుత పరిజ్ఞానం!!

పుట్టుక నుంచి చావు వరకు జీవితంలో అన్ని దశలనూ.. కణాల నుంచి నక్షత్రాల వరకు సృష్టిలోని అన్ని అంశాలనూ స్పృశిస్తూ 2022 శాస్త్ర, సాంకేతిక రంగం అప్రతిహతంగా దూసుకుపోయింది.

Updated : 28 Dec 2022 00:35 IST

పుట్టుక నుంచి చావు వరకు జీవితంలో అన్ని దశలనూ.. కణాల నుంచి నక్షత్రాల వరకు సృష్టిలోని అన్ని అంశాలనూ స్పృశిస్తూ 2022 శాస్త్ర, సాంకేతిక రంగం అప్రతిహతంగా దూసుకుపోయింది. చనిపోయిన జంతువుల అవయవాలకు తిరిగి జీవం పోయటం.. శుక్ర కణం, అండం లేకుండానే పిండాన్ని సృష్టించటం.. విశ్వం తొలినాళ్లను కళ్లకు కట్టేలా చూపటం.. కళాఖండాలను చిత్రించే కృత్రిమ మేధ వంటి ఎన్నో అద్భుతాలను సుసాధ్యం చేసింది.  వీటిల్లో కొన్ని అందరికీ, చవకగా అందుబాటులోకి రాకపోవచ్చు. కొన్ని సాకారం కావటానికి చాలా ఏళ్లు పట్టొచ్చు. కానీ శాస్త్ర, సాంకేతిక పురోగతికి కొత్త ఊతం ఇచ్చిన మాట నిజం. అభివృద్ధి పథంలో కొంగొత్త ఆశా కిరణాలుగా మెరుస్తున్న మాట నిజం.


కృత్రిమ మేధ విజృంభణ

అధునాతన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- ఏఐ) టూల్స్‌ మానవ సృజనాత్మకతకు హద్దులు చెరిపేస్తున్నాయి. ఇమేజ్‌లను సృష్టించే స్టేబుల్‌ డిఫ్యూజన్‌, డాల్‌-ఇ 2 వంటి యాప్‌లు కళారంగంలో కొత్త అలజడిని సృష్టించాయి. టెక్స్ట్‌ను అద్భుతమైన చిత్రాలుగా మలుస్తూ కళాకారుల ఊహలకే సవాల్‌ విసురుతున్నాయి. ప్రపంచాన్ని మనం చూసినట్టుగా చూసేలా వీటికి నేర్పించటం వీటిల్లోని కీలకాంశం. మున్ముందు ఇవి చూసే తీరును మనం నేర్చుకోవాల్సి ఉంటుందనీ భావిస్తున్నారు. క్రమంగా వీటితో మాట్లాడమెలాగో నేర్చుకొని.. వాటి భాషలో నైపుణ్యం సాధిస్తే కేవలం కొన్ని పదాలతోనే గొప్ప గొప్ప కళాఖండాలను సృష్టించటం సాధ్యమవుతుంది. మరోవైపు ఛాట్‌జీపీటీ వంటి పెద్ద భాషా నమూనాలు సంక్లిష్టమైన ప్రశ్నలకూ స్పందిస్తున్నాయి. వికీపీడియా వంటి విజ్ఞాన వెబ్‌సైట్లలోని కథనాలను సెకండ్లలోనే విశ్లేషించుకొని ప్రత్యుత్తరమిస్తున్నాయి. అసమంజసమైనవాటిని తిరస్కరిస్తూ హితవు చెబుతున్నాయి కూడా. అంతేనా? పాటలను రాస్తున్నాయి. కష్టమైన వైద్య కథనాలనూ ప్రసిద్ధ రచయితల శైలిలో ముందుంచుతున్నాయి. ఇలాంటి కృత్రిమ మేధ పరికరాలు మనిషి ఊహాశక్తిని, రచనా నైపుణ్యాన్ని చంపేస్తాయా? అనే భయాందోళనలనూ రేపుతున్నాయి. నిజానికివన్నీ సృజనాత్మక రంగంలో మనకు తోడ్పడేవే. ఏదైనా కఠినమైన పదానికి నిఘంటువు అర్థాన్ని వెతికి పెట్టినట్టుగా అవసరమైన సమయాల్లో చేదోడు వాదోడుగా నిలిచేవే. పదాలు తట్టక సతమతమవుతున్నప్పుడో, రాసిన దాన్ని సవరించాలనుకున్నప్పుడో వీటి సాయం ఎంతగానో తోడ్పడుతుంది. మన మెదడులోంచి పుట్టుస్తున్న ఏఐ పరికరాలు భవిష్యత్‌లో మన పని విధానం, ఆలోచన తీరు, సృజనాత్మక శక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తాయనటం నిస్సందేహం.


మరణంపై విజయం!

మరణాన్ని జయించటంపై ఈ సంవత్సరం కొత్త ఆశలు కల్పించింది. చనిపోయిన పందులను తిరిగి బతికించటంలో యేల్‌ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. గంట క్రితం చనిపోయిన పందుల రక్తనాళాల్లోకి ప్రయోగాత్మక మందును పంపించి, వాటి గుండెలను తిరిగి కొట్టుకునేలా చేశారు మరి. ఇప్పుడప్పుడే ఇది మనుషులకు అందుబాటులోకి రాకపోవచ్చు గానీ చనిపోయినవారి అవయవాలను సంరక్షించి, ఇతరులకు అమర్చటానికి తగినంత సమయం లభించేలా చూడొచ్చు. దీర్ఘకాలంలో దీని ప్రభావాలను కొట్టిపారేయలేం. అప్పుడే చనిపోయినవారి గుండె, ఇతర అవయవాలను తిరిగి పనిచేయిస్తే? హఠాత్తుగా మరణించినవారిని వెంటనే బతికేలా చేస్తే? యుద్ధంలో మరణించిన సైనికులకు పునర్జన్మ ప్రసాదిస్తే? ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా. ఈ ఒక్క మందుతో తిరిగి జీవించేలా చేయగలిగితే ఆత్మీయులను కోల్పోయినవారికి అంతకన్నా కావాల్సిందేముంది?* గుండె వైఫల్యం చివరిదశలో ఉన్న ఒకరికి జన్యుపరంగా మార్చిన పంది గుండెను అమర్చటంలోనూ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. దీన్ని అమర్చిన రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి మరణించినప్పటికీ కొత్త ఆశలు రేకెత్తించింది. జన్యుపరంగా మార్చిన జంతు అవయవాలను మనుషులకు అమర్చటం సాధ్యమేనని ఇది రుజువు చేసింది. కొన్ని అడ్డంకులను తొలగించుకోగలిగితే అవయవాల మార్పిడి ఎదురు చూపులకు తెర పడ్డట్టే.


కృత్రిమ ప్రాణం!

పిండం ఏర్పడాలంటే శుక్ర కణం, అండం కలవాల్సిందే. ఇవేవీ లేకుండానే పిండాన్ని సృష్టిస్తే? ఇజ్రాయెల్‌లోని వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు అలాంటి విజయాన్నే సాధించారు. అండం, వీర్యకణం, అండాశయంతో పనిలేకుండా మూలకణాలతోనే ప్రయోగశాలలో ఎలుక పిండాన్ని సృష్టించటం విశేషం. దీనికి ఆరోనాడు తోక, ఎనిమిదో రోజున కొట్టుకునే గుండె పుట్టుకొచ్చాయి. చివరికి మెదడు ఏర్పడటమూ మొదలైంది. దీనిలోని కణాలు, భాగాల పనితీరు 95% వరకు అసలు పిండం మాదిరిగానే ఉండటం గమనార్హం. అందుకే కొందరు శాస్త్రవేత్తలు దీన్ని 2022లో అతి ముఖ్యమైన శాస్త్ర పురోగతిగా అభివర్ణిస్తున్నారు. కృత్రిమ అవయవాలను వృద్ధి చేయటానికి.. పిండంలో ఏర్పడే జన్యు మార్పులు, ఎదుగులతో ముడిపడిన సమస్యల మధ్య సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.


క్యాన్సర్‌పై అద్భుత విజయం

క్యాన్సర్‌ తిరగబెట్టకుండా ఉండటం కాదు.. పూర్తిగా కనుమరుగైతే? ఇలాంటి ఇమ్యునో చికిత్సనే రూపొందించారు శాస్త్రవేత్తలు. దీన్ని పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 మందిపై పరీక్షించగా.. అందరిలోనూ క్యాన్సర్‌ తుడిచిపెట్టుకుపోవటం విశేషం. క్యాన్సర్‌ చికిత్స చరిత్రలో ఇలాంటి ఘనతను సాధించటం ఇదే తొలిసారి. రొమ్ముక్యాన్సర్‌ చికిత్సలోనూ ఇలాంటి అద్భుతమే ఆవిష్కృతమైంది. హర్‌2 ప్రొటీన్‌లో జన్యుమార్పులతో కూడిన కణితిలోని కణాల పనిపట్టే మోనోక్లోనల్‌ యాంటీబాడీని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది చాలామందిలో అతి కచ్చితంగా క్యాన్సర్‌ కణాలను నిర్మూలించటం గమనార్హం. అందుకే ఇది క్యాన్సర్‌ చికిత్సలో ప్రామాణికంగా నిలబడగలదని ఆశిస్తున్నారు. జన్యు, లక్షిత చికిత్సల సమ్మేళనంతో క్యాన్సర్‌ను కచ్చితంగా, కణాల వారీగా తుదముట్టించే విషయంలో ఇది కొత్త ఆశలను రేకెత్తించింది. అదీ భయంకరమైన కీమోథెరపీ అవసరం లేకుండానే. పలు క్యాన్సర్లకు దారితీసే మరో జన్యు మార్పు కేఆర్‌ఏఎస్‌. ఇది మందులకు లొంగదనీ భావిస్తుంటారు. దీని పని పట్టటానికీ శాస్త్రవేత్తలు మాత్రను రూపొందించారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితుల్లో చివరి దశలోనూ కణితి మరింత వృద్ధి చెందకుండా నిలువరిస్తోందని గుర్తించారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించే దిశగానూ ముందడుగు పడింది. ఇక గ్రెయిల్‌ సంస్థ రూపొందించిన గలేరీ రక్త పరీక్ష రక్తంలో తిరుగాడే కణితి డీఎన్‌ఏను గుర్తిస్తుంది. ఇలా సుమారు 50 రకాల క్యాన్సర్లను పట్టి చూపగలదు. ఇలాంటి పరీక్షలు చవకగా అందుబాటులోకి వస్తే, మరింత కచ్చితంగా సమస్యను గుర్తిస్తే క్యాన్సర్‌ను తొలిదశలోనే పట్టుకోవటం తేలికవుతుంది.


టీకాల దండుకు సిద్ధం

టీకాల ఆవిష్కరణలో 2022ను స్వర్ణయుగంగా పేర్కొనొచ్చు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త మలేరియా టీకా సరికొత్త ఆశలు రేకెత్తించింది. దీన్ని 450 మంది పిల్లలపై పరీక్షించారు. ఒకొకరికి మూడు మోతాదుల టీకా, ఒక బూస్టర్‌ మోతాదు ఇచ్చారు. ఇవి మలేరియాను 80% వరకు నివారిస్తున్నట్టు తేలింది. ఇది గొప్ప విజయం అనటంలో సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 లక్షల మందిని మలేరియా పొట్టన పెట్టుకుంటోంది. దీనికి కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి నిరంతరం మారుతూ వస్తుంది. అందుకే టీకా ప్రయత్నాలేవీ పెద్దగా సఫలం కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో కొత్త మలేరియా టీకా ఆసక్తి రేపుతోంది. కొవిడ్‌ను తుదముట్టించే క్రమంలో పుట్టుకొచ్చిన ఎఆర్‌ఎన్‌ఏ టీకా వేసిన పునాది వినూత్న టీకాల తయారీకి మార్గం సుగమం చేసింది. అన్నిరకాల ఫ్లూ వైరస్‌లను ఎదుర్కొనే టీకాను రూపొందించటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించటానికిదే ఆధారంగా నిలించింది. ఇది జంతువుల్లో మంచి ఫలితం చూపించటం గమనార్హం. ఇది అన్నిరకాల ఫ్లూ వైరస్‌లను నిలువరించలేకపోవచ్చు గానీ వాటిని ఎదుర్కొనే బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను మాత్రం పుట్టిస్తోంది. దీంతో ఏటా వచ్చే ఫ్లూ జ్వరాలు, దాని అనర్థాలు చాలావరకు తగ్గుతాయని భావిస్తున్నారు. భవిష్యత్‌లో వచ్చే ప్రపంచ మహమ్మారి ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ జాతి నుంచే పుట్టుకొస్తుందని, ఇది కొవిడ్‌ కన్నా ఎక్కువ మరణాలను కలిగించే అవకాశముందని భయపడుతున్న తరుణంలో తాజా టీకా కొండంత ధైర్యం కలిగిస్తోంది. సార్వత్రిక ఫ్లూ టీకా తయారీకి సైతం మార్గం సుగమం చేస్తోంది.


విశ్వం  పుట్టుక దర్శనం

అంతరిక్ష అన్వేషణలో నాసాకు చెందిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ అద్భుతాలే సృష్టించింది. గత సంవత్సరం చివర్లో దీన్ని ప్రయోగించినప్పటికీ ఈ సంవత్సరం జులైలో ఇది పంపించిన తొలి చిత్రాలను విడుదల చేశారు. కాంతిని గ్రహించటానికి తోడ్పడే దీని ప్రధాన అద్దం 6.5 మీటర్ల వెడల్పుంటుంది. విస్తీర్ణంతో పోలిస్తే దీనికి కాంతిని గ్రహించే శక్తి చాలా ఎక్కువ. ఇది పురాతన కాంతి తొలి దృశ్యాలను ఊహించనంత స్పష్టతతో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు ఇవి అంతరిక్షంలో కొత్త ఆవిష్కరణలకు దారితీయనున్నాయి. మహా నక్షత్ర విస్ఫోటం (బిగ్‌ బ్యాంగ్‌) అనంతరం నిజంగా ఏం జరిగిందనే విషయాన్ని చూపించనున్నాయి. శాస్త్రవేత్తలు వీటన్నింటినీ గుది గుచ్చి విశ్వం పుట్టుక కథను రచించటానికి తోడ్పడనున్నాయి.

* నాసాకు చెందిన డార్ట్‌ ఉపగ్రహం సెప్టెంబరు 26న డైమార్ఫోస్‌ అనే గ్రహ శకలాన్ని ఢీకొట్టింది. దాని కక్ష్య సమయాన్ని 32 నిమిషాల మేరకు తగ్గించింది. గమనాన్ని మార్చింది మున్ముందు గ్రహ శకలాల బారిన పడకుండా ముందుగానే సన్నద్ధం కావటానికిది మార్గం చూపించింది.


భూమి మీద సూర్యుడు!

అమెరికాకు చెందిన లారెన్స్‌ లివర్‌మోర్‌ నేషనల్‌ ల్యాబోరేటరీ (ఎల్‌ఎల్‌ఎన్‌ఎల్‌) శాస్త్రవేత్తలు అణు సంయోగంతో విద్యుత్తును సృష్టించి కొత్త చరిత్ర సృష్టించారు. ప్రయోగానికి వినియోగించిన ఇంధనం కన్నా దీని ద్వారా ఎక్కువ విద్యుత్తు పుట్టుకురావటం విశేషం. భవిష్యత్‌లో శిలాజ ఇంధనాల కొరత ఏర్పడనున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి అణు సంయోగంతో విద్యుత్తును సృష్టించటంపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో మాదిరిగానే శక్తిని పుట్టించటం దీనిలోని కీలకాంశం. చైనా శాస్త్రవేత్తలు సైతం ఎక్స్‌పెరిమెంటల్‌ అడ్వాన్స్డ్‌ సూపర్‌కండక్టింగ్‌ టోకమాక్‌ (ఈస్ట్‌) అనే అణు సంయోగ రియాక్టర్‌ను రూపొందించారు. ఇది 1,056 సెకండ్ల పాటు 7 కోట్ల డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతను సృష్టించి రికార్డు సృష్టించింది. సాధారణంగా అణు సంయోగం కోసం అయస్కాంత బలాన్ని వినియోగిస్తుంటారు. తాజా అమెరికా ప్రయోగంలో లేజర్ల ద్వారా అణు కేంద్రకాలను కలపటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని