Safer Internet Day: ఇంటర్నెట్‌ భద్రత.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..?

సేఫర్ ఇంటర్నెట్ డేను పురస్కరించుకుని ఇంటర్నెట్ వినియోగంలో పాటించాల్సిన పది జాగ్రత్తలు ఏంటో చూద్దాం. 

Updated : 08 Feb 2022 11:08 IST

ఇంటర్నెట్‌డెస్క్: జైత్ర మార్కెట్‌కు వెళుతూ ఫోన్‌ను పిల్లలకు ఇచ్చి వెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చి చూసేసరికి బ్యాంక్‌ ఖాతా నుంచి పదివేలు నగదు డ్రా అయినట్లు మెసేజ్‌ చూసి కంగుతిన్నాడు. తర్వాత తెలిసిందేమంటే పిల్లలు ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతూ.. స్క్రీన్‌పై కనిపించిన లింక్‌లపై క్లిక్ చేశారు. దాంతో ఫోన్‌లోని వివరాలు హ్యాకర్లకు చేరిపోయాయి.  చంద్రమౌళి బ్రౌజింగ్ చేస్తూ ఆఫర్‌ అని కనిపించడంతో లింక్‌పై క్లిక్ చేశాడు. అందులో పేరు, మొబైల్‌ నంబర్‌, ఆధార్ వంటి వివరాలు నమోదు చేయమని సూచించడంతో వాటిని నమోదు చేశాడు. కొద్దిసేపటికే తన బ్యాంక్‌ ఖాతా ద్వారా ₹ 50 వేలు ఆన్‌లైన్ షాపింగ్ చేసినట్లు మెసేజ్‌ చూసి విస్తుపోయాడు.

ఇలాంటి ఆన్‌లైన్ మోసాల గురించి తరచుగా మనం వింటూనే ఉంటాం. అత్యాశతో కొందరు, అవగాహన రాహిత్యంతో మరికొందరు ఇంటర్నెట్‌ వేదికగా జరిగే ఆన్‌లైన్ మోసాలకు బాధితులుగా మారుతున్నారు. దీనిపై యూజర్లకు అవగాహన కల్పించేందుకు ఫిబ్రవరి 8వ తేదీని ప్రతి ఏటా ‘సేఫర్ ఇంటర్నెట్‌ డే’గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్‌ వినియోగంలో తీసుకోవాల్సిన పది జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.   

  1. ఇంటర్నెట్‌ వినియోగానికి ప్రధాన వేదిక బ్రౌజర్ అనే చెప్పుకోవాలి. డెస్క్‌టాప్‌/మొబైల్‌, ఎందులో అయినా సమాచారం వెతకాలంటే బ్రౌజర్‌ను ఆశ్రయించాల్సిందే. ఒకరకంగా మన ఆన్‌లైన్ విహారానికి బ్రౌజర్ గేట్‌వే లాంటిది. అందుకే బ్రౌజర్ల ద్వారా మన వివరాలు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. అలానే బ్రౌజర్ భద్రతకు సంబంధించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (ఐసీఏఆర్‌టీ) జేఎస్‌గార్డ్ పేరుతో బ్రౌజర్‌ ఎక్స్‌టెక్షన్‌ను అందిస్తుంది. ఇది సైబర్‌ దాడుల నుంచి యూజర్‌ రక్షణ కల్పించడంతోపాటు, మాల్‌వేర్‌ వెబ్‌సైట్ల గురించి యూజర్‌ను అలర్ట్ చేస్తుంది.  
  2. మొబైల్ చేతిలో ఉంటే చాలు అన్ని రకాల సేవలు మనకు అందుబాటులో ఉన్నట్లే. మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఫుడ్ డెలివరీ, షాపింగ్, టికెట్ బుకింగ్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా ప్రతి అవసరానికి యాప్‌లు ఉన్నాయి. అయితే కొన్ని యాప్‌లలో భద్రత లోపంతో మాల్‌వేర్‌ ద్వారా  యూజర్‌ వ్యక్తిగత డేటా హ్యాకర్స్‌కు చేరిపోతున్నాయి. అలాంటి వాటిని గుర్తించి ఏటా గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్‌ స్టోర్‌ నుంచి మాల్‌వేర్ ఉన్న యాప్‌లను తొలగిస్తుంటాయి. అందుకే కొత్తగా యాప్‌లు డౌన్‌లోడ్ చేసే ముందు వాటికి ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌ ప్రొటెక్షన్ ఉందా, లేదా అనే సరిచూసుకోవాలి. యూజర్‌ రేటింగ్ తక్కువగా ఉండి, అనుమానస్పదంగా ఉన్న యాప్‌ల జోలికెళ్లపోవడం ఉత్తమం. 
  3. ఆఫర్ల పేరుతో మెయిల్, మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఎక్కువ శాతం యూజర్స్‌ డేటాను దొంగిలించేందుకు హ్యాకర్స్ మాల్‌వేర్‌ కోడ్‌తో వాటిని యూజర్‌ మొబైల్ లేదా మెయిల్‌కు పంపుతారు. చూడగానే నమ్మశక్యంగా ఉండటంతో యూజర్స్ వాటిని క్లిక్ చేస్తారు. అందుకే ప్రముఖ ఈ-కామర్స్‌ లేదా ఇతరత్రా కంపెనీల నుంచి ఆఫర్‌ లేదా లాటరీ పేరుతో వచ్చే లింక్‌లను వెంటనే డిలీట్ చేయమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అలానే ఫలానా యాప్‌ ద్వారా నగదు పంపితే క్యాష్‌బ్యాక్ వస్తుందని సామాజిక మాధ్యమ గ్రూపుల్లో షేర్ అయ్యే లింక్‌లకు దూరంగా ఉండటం మేలంటున్నారు. 
  4. ప్రతి మనిషి జీవితంలో గోప్యత ఎంతో ముఖ్యం. ఆన్‌లైన్ వినియోగం పెరిగాక ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తున్న మాట. అందుకే ఆన్‌లైన్ ఖాతాకు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ తప్పనిసరి. అయితే చాలా మంది యూజర్స్ సులువుగా గుర్తుంచుకునేందుకు పేరు, పుట్టిన తేదీ, అంకెలను పాస్‌వర్డ్‌గా పెడుతుంటారు. దీంతో వాటిని బ్రేక్ చేయడం సైబర్‌ నేరగాళ్లకు మరింత సులువు. అందుకే పాస్‌వర్డ్‌ అక్షరాలు, అంకెలు, స్పెషల్‌ క్యారెక్టర్ల కలయికగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి. పాస్‌వర్డ్ బలంగా ఉంటేనే ఆన్‌లైన్ గోప్యతకు భంగం వాటిల్లదని చెబుతున్నాయి. అలానే పాస్‌వర్డ్‌ను తరచుగా మారుస్తుండాలని సూచిస్తున్నాయి. అదనపు భద్రత కోసం టెక్ కంపెనీలు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను తీసుకొస్తున్నాయి. ఇందులో ప్రైమరీ పాస్‌వర్డ్‌తోపాటు పిన్‌, ఓటీపీ వంటి సెకండరీ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే ఖాతా ఓపెన్ అవుతుంది.  
  5. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ (వీపీఎన్‌), ఇది యూజర్లకు, ఇంటర్నెట్‌కు మధ్య సురక్షితమైన కనెక్షన్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఆన్‌లైన్ బ్రౌజింగ్ చేస్తే మిమ్మల్ని ఎవరూ ట్రాక్ చేయలేరు. హ్యాకర్ల నుంచి డేటాను కాపాడుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తుంటాయి. 2021లో సేకరించిన గణాంకాల ప్రకారం వీపీఎన్‌ నెట్‌వర్క్‌ ఉపయోగించే 85 దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే గూగుల్ వంటి సంస్థలు సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా వీపీఎన్ సేవలను అందిస్తున్నాయి. సురక్షితమైన ఇంటర్నెట్‌ కోసం వీపీఎన్ ఉపయోగించవచ్చనేది నిపుణుల మాట.
  6. కొవిడ్ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. అయితే ఇంటర్నెట్ వినియోగంలో అవగాహనలోపంతో చేసే పొరపాట్ల వల్ల యూజర్స్‌ సైబర్‌ దాడులకు గురవుతున్నారు. దీంతో బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో తప్పులు చేయొద్దని ఐసీఏఆర్‌టీ సూచిస్తుంది. ఇందులో భాగంగా ఓపెన్ వైఫై నెట్‌వర్క్‌లకు ఆటో-కనెక్ట్‌ ఆప్షన్‌ను, ఎస్‌ఎస్‌ఐడీని, రిమోట్ అడ్మినిస్ట్రేషన్‌, రీస్టోర్ ఫ్యాక్టరీ డీఫాల్ట్ సెట్టింగ్‌లను ఎనేబుల్ చేయొవద్దని చెబుతోంది. అలానే యూఎస్‌బీ బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌ను సురక్షితంకానీ కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించవద్దని చెబుతోంది. 
  7. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఖాతాలేని వ్యక్తులు అరుదు. వ్యక్తిగత జీవితంలోని సంతోషకరమైన సందర్భాలను ఇతరులతో షేర్ చేసుకోవడంతోపాటు, సమాజంలో జరిగే అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకునే వేదికగా ఎంతో మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, వీడియోలను సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో సోషల్‌ మీడియా కంపెనీలు యూజర్లకు మెరుగైన భద్రత కల్పించడంలో భాగంగా ప్రొఫైల్ లాక్‌, ప్రైవసీ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వ్యక్తిగత గోప్యత, మెరుగైన ఆన్‌లైన్ భద్రత కోసం సోషల్‌ మీడియా ఖాతాల్లోని ప్రైవసీ ఫీచర్లు ఎనేబుల్ చేసుకోమని సోషల్‌ మీడియా సంస్థలు సూచిస్తున్నాయి. 
  8. లాక్‌డౌన్‌ కాలంగా పాఠశాలలు మూతపడటంతో పిల్లలు ఇంటి నుంచే ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. ఈ నేపథ్యంలో ల్యాప్‌టాప్‌/మొబైల్ వినియోగంచే అవకాశం దొరికింది. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉండిపోవడంతో వాటి వినియోగం శృతి మించుతోంది. దీంతో పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? ఎంత సమయం గడుపుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా పేరెంటల్‌ కంట్రోల్ ఫీచర్‌తో టెక్ కంపెనీలు డివైజ్‌లను పరిచయం చేస్తున్నాయి. అలానే ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్‌ మీడియా సంస్థలు సైతం పేరెంటల్ కంట్రోల్ తరహాలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. వీటి వల్ల పిల్లల ఆన్‌లైన్ వినియోగం సురక్షితంగా ఉంటుదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
  9. చాలా మంది యూజర్స్ బయటికి వెళ్లినప్పుడు మొబైల్ డేటా ఆదా చేసే ఉద్దేశంతో ఉచిత వైఫై సేవలను ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలో అన్ని వైఫై నెట్‌వర్క్‌లు సురక్షితం కావని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రీ వైఫై కోసం ఆశపడితే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్స్‌కు చేరిపోయే ప్రమాదం లేకపోలేదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా లభించే వైఫైని అత్యవసరమైతే తప్ప ఉపయోగించవద్దని సూచిస్తున్నారు. 
  10. ఆర్థిక లావాదేవీల నిర్వహణ కోసం బ్రౌజర్‌లో మన బ్యాంక్‌ వెబ్‌సైట్‌ పేరును టైప్‌ చేస్తాం. అయితే ఇటీవలి కాలంలో నకిలీ వెబ్‌సైట్లతో యూజర్స్ మోసపోతున్నారు. అందుకే మీరు బ్రౌజర్‌లో బ్యాంక్‌ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు అండ్రస్‌ బార్‌లో హెచ్‌టీపీపీఎస్ అని ఉండాలి. ఒకవేళ అడ్రస్‌ బార్‌లో హెచ్‌టీపీపీ అని ఉంటే ఆ పేజీని అనుమానించాల్సిందే. సదరు పేజీ ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయడం మంచిది కాదు. ఇలాంటి వెబ్‌సైట్ల నుంచి ఐసీఏఆర్‌టీ సూచించే జేఎస్‌గార్డ్  బ్రౌజర్‌ ఎక్స్‌టెక్షన్‌ యూజర్లను హెచ్చరిస్తుంది. దానివల్ల యూజర్ డేటా ఎంతో సురక్షితంగా ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని