అనువాదం అలవోకగా..
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే భాషలు తెలియకపోయినా ఇబ్బందేమీ ఉండదు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సమ్మేళనంతో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు సమర్థంగా అనువాదం చేసి పెడుతున్నాయి.
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే భాషలు తెలియకపోయినా ఇబ్బందేమీ ఉండదు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సమ్మేళనంతో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు సమర్థంగా అనువాదం చేసి పెడుతున్నాయి. ఇందుకోసం ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలతో జట్టుకట్టే యాప్‌లెన్నో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు.. చివరికి వైద్యులైనా నిశ్చింతగా వీటి సాయంతో 100కు పైగా భాషలను చదువుకోవచ్చు. ఆయా భాషల్లో రాసుకోవచ్చు, మాట్లాడొచ్చు. అలాంటి ఉచిత అనువాద యాప్‌ల్లో కొన్ని ఇవీ..
సేహై ట్రాన్స్‌లేట్
దీంతో ఉచితంగా అప్పటికప్పుడు వేరే భాషలో మాట్లాడొచ్చు. వాడుకోవటం తేలిక. మనం ఏదైనా మాట్లాడితే చాలు. దాన్ని గ్రహించి, వేరే భాషలోకి వెంటనే అనువాదం చేసేస్తుంది. లాంగ్వేజ్ జాబితాల్లోంచి అవసరమైన భాషను ఎంచుకుంటే సరి. అవసరాన్ని బట్టి మగ, ఆడ గొంతులనూ ఎంచుకోవచ్చు. మాటల వేగాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అనువదించిన అంశాల మీద కాసేపు నొక్కి పట్టి కాపీ చేసుకోవచ్చు. వాటిని ఈమెయిల్, ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి వాటి ద్వారా షేర్ చేసుకోవచ్చు.
గూగుల్ ట్రాన్స్‌లేట్
దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే లక్షలాది మంది దీన్ని వాడుకుంటున్నారు. ఆండ్రాయిడ్ వర్షన్ గూగుల్ ట్రాన్స్‌లేట్ అయితే ఇతర యాప్‌లతో తనకు తానే మమేకమై తేలికగా అనువాదం చేసి పెడుతుంది కూడా. దీని ద్వారా ఆన్‌లైన్‌లో 103 భాషలను అనువాదం చేసుకోవచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు 59 భాషలను అనువదిస్తుంది. కెమెరా ద్వారా అప్పటికప్పుడు 38 భాషలను తెలిసిన భాషలోకీ మార్చుకోవచ్చు. ఫోన్ కెమెరాకు చూపెడితే చాలు. ఫొటోల్లోని అక్షరాలను ఇట్టే అనువాదం చేసేస్తుంది. ముఖాముఖిగా 32 భాషల్లో అనువాద సంభాషణలు నెరపొచ్చు. టైప్ చేయటానికి బదులు అక్షరాలను రాసి కూడా అనువాదం చేసుకోవచ్చు.
ఐట్రాన్స్‌లేట్ ట్రాన్స్‌లేటర్
ఇది వందకు పైగా భాషలను సపోర్టు చేస్తుంది. దీంతో టెక్స్ట్ లేదా వెబ్‌సైట్‌ను అనువాదం చేసుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. సరిపడిన పదాలను వెతకొచ్చు. అర్థాలు తెలుసుకోవచ్చు. సముచ్ఛయ క్రియలనూ తెలుసుకోవచ్చు. మాట్లాడటం మొదలెడితే చాలు ఇది వెంటనే గొంతును గుర్తిస్తుంది. పదాలను అక్షరాల రూపంలోకి మార్చేసి, వేరే భాషలోకి అనువాదం చేసేస్తుంది. ఇది వేర్వేరు మాండలికాలనూ అర్థం చేసుకోలదు. ఇంతకుముందు చేసిన అనువాదాలనూ తేలికగా తిరిగి చూపిస్తుంది. తరచూ చేసిన అనువాదాలను స్టోర్ చేసుకుంటుంది. తనకు తానే భాషలనూ గుర్తించగలదు. అనువదించిన అంశాలను తేలికగా కాపీ చేసుకొని, ఇతరులతో షేర్ చేసుకోవచ్చు కూడా.
ట్రిప్‌లింగో
అనువాదంతో పాటు ఇతర దేశాల సంస్కృతులను నేర్చుకోవాలనుకుంటే ట్రిప్‌లింగోను వాడుకోవచ్చు. ఇష్టమైన దేశాలను ఎంచుకొని, వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వందకు పైగా దేశాలను దీంతో ఎంచుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన పదబంధాలు.. కెమెరా, వాయిస్ ట్రాన్స్‌లేషన్, వై-ఫై డైలర్ వంటి ఫీచర్లున్నాయి. ఆయా దేశాల మర్యాదలు, కట్టుబాట్ల వంటి వాటికి సంబధించి విలువైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భాషలను నేర్చుకోవటానికి ఇందులో క్విజ్ మోడ్ కూడా ఉంది.
మైక్రోసాఫ్ట్ ట్రాన్స్‌లేటర్
కమ్యూనికేషన్ అడ్డంకులను అధిగమించటానికిది మంచి ఎంపిక. వ్యక్తిగత ట్రాన్స్‌లేషన్ యాప్ 60కి పైగా భాషలను అనువదిస్తుంది. అక్షరాలు, మాటలు, కెమెరా ఫొటోలు, స్క్రీన్‌షాట్లు.. వేటిల్లో ఉన్న అంశాలనైనా అవసరమైన భాషలోకి మారుస్తుంది. ఆఫ్‌లైన్ ట్రాన్స్‌లేషన్ కోసం భాషలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయమూ ఉంది. ఇది ప్రయాణాలు చేస్తున్నప్పుడు బాగా పనికొస్తుంది. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు భాషల్లో చర్చించుకోవటానికి స్ప్లిట్ స్క్రీన్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఒకేసారి చాలామందితో వేర్వేరు భాషల్లోనూ మాట్లాడుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాద పదాలను సూచించే, పదాలకు అర్థాలు తెలిపే ఆప్షన్లూ ఇందులో ఉన్నాయి. దీనిలోని కాంటెక్స్ట్ మెనూ ద్వారా ఇతర యాప్‌లలోని టెక్స్ట్‌నూ అనువాదం చేసుకోవచ్చు.
టెక్స్ట్ గ్రాబర్
దీంతో అనువాదం చేసుకోవటం చాలా తేలిక. ఇది అతి త్వరగానూ భాషలను మార్చేస్తుంది. ముద్రణ రూపంలో ఉన్న టెక్స్ట్‌ను కెమెరా ముందు పెడితే చాలు. తక్షణం దాన్ని గ్రహించి, గుర్తించి అనువదించి పెడుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమూ లేదు. ఆఫ్‌లైన్‌లోనే పని పూర్తి చేసి పెడుతుంది. ఇందులో ప్రత్యేకమైన ప్రత్యక్ష రికగ్నిషన్ మోడ్ కూడా ఉంది. ఇది డాక్యుమెంట్ల నుంచే కాదు దేని మీదున్న అక్షరాలనైనా గుర్తించి, సంగ్రహిస్తుంది. ఫొటో తీయాల్సిన అవసరమూ లేదు. నేరుగా అలాగే 60కి పైగా భాషలను అనువాదం చేస్తుంది. ఆన్‌లైన్‌లోనైతే 100కు పైగా భాషల్లో అనువాదం చేసుకోవచ్చు. కెమెరాతో క్యాప్చర్ చేసిన టెక్స్ట్ మొత్తాన్ని స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే దాన్ని సవరించుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇతర నోట్స్ జాబితాలో కలపొచ్చు కూడా.
నావర్ పాపాగో ట్రాన్స్‌లేట్
ఇది చిన్న అనువాదం యాప్. కేవలం 13 భాషలనే సపోర్టు చేస్తుంది. కొరియన్, ఇంగ్లిష్, జపనీస్, చైనీస్, స్పానిష్, ఫ్రెంచ్, వియత్నమీస్, థాయ్, ఇండోనేసియన్, రష్యన్, జర్మన్, ఇటాలియన్ భాషలను అనువాదం చేసి పెడుతుంది. అప్పటికప్పుడు పదబంధాలను, మాటలనూ వేరే భాషలోకి తర్జుమా చేస్తుంది. విదేశీయులతో ముఖాముఖి మాట్లాడుతున్నప్పుడు ఒక భాషలోని మాటలను మరో భాషలోకి తక్షణం మార్చేస్తుంది కూడా. తెలియని భాషలో ఉన్నవాటిని ఫొటో తీసి, వేలితో దాన్ని హైలైట్ చేస్తే వెంటనే ట్రాన్స్‌లేట్ చేస్తుంది. మరిన్ని అర్థాల కోసం నిఘంటువులో వెతికే సదుపాయమూ ఉంది.
వేగో
ఇది ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్, మెషిన్ ట్రాన్స్‌లేషన్.. రెండింటి సాయంతో పనిచేస్తుంది. ఫొటోల్లో కనిపించే చైనీస్, జపనీస్, కొరియా అక్షరాలను ఇంగ్లిష్ టెక్స్ట్‌గా మారుస్తుంది. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని, ప్రయత్నించొచ్చు. వీడియో కెమెరాను విజువల్ ట్రాన్స్‌లేటర్‌గా వాడుకోవచ్చు. డిక్షనరీగానూ ఉపయోగించుకోవచ్చు. కెమెరాను తెలియని భాషలోని అక్షరాల ముందు పెడితే చాలు. వాటిని గ్రహించి, ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసేస్తుంది. ఆయా పదాల ఉచ్చారణను వినొచ్చు, చూడొచ్చు. ట్రాన్స్‌లేట్ చేసిన ఆహార పదార్థాల వివరాలనైతే బొమ్మ రూపంలోనూ చూపిస్తుంది. కాకపోతే ఈ ఫీచర్ చైనీస్‌లోనే అందుబాటులో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)
-
Sports News
భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నాం.. కోచ్ రాహుల్ ద్రవిడ్
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
Movies News
Social Look: తారల సరదా.. డాగ్‌తో తమన్నా.. పిల్లితో మృణాళ్!
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్: షోయబ్ అక్తర్