KTR: రాబోయే వందేళ్ల కోసం ‘సుంకిశాల’ ఇన్‌టేక్‌వెల్‌: కేటీఆర్‌

రాబోయే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్‌కు ప్రాజెక్టును చేపట్టినట్టు

Updated : 14 May 2022 14:25 IST

నాగార్జున సాగర్‌: రాబోయే వందేళ్లను దృష్టిలో పెట్టుకొని నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద ఇన్‌టేక్‌వెల్‌కు ప్రాజెక్టును చేపట్టినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇది సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమని చెప్పారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి సుంకిశాల ఇన్‌టేక్‌వెల్‌ ప్రాజెక్టుకు కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

జలమండలి వద్ద ఖాళీ బిందెలు ఉండేవి..

‘‘పెరుగుతున్న హైదరాబాద్‌ జనాభాకు ఇది నీరు అందించే శుభకార్యం. కోట్ల మందిని దృష్టిలో పెట్టుకొని రూ.1,450 కోట్లతో సుంకిశాల నిర్మాణం చేపట్టాం. రాబోయే ఎండాకాలం కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఓఆర్‌ఆర్‌ కాదు ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చినా అక్కడి వరకు నీళ్లు ఇచ్చేలా సుంకిశాల ప్రాజెక్టును డిజైన్‌ చేశాం. హైదరాబాద్‌ వాసులు, ప్రజా ప్రతినిధులం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. నగరం ఎంత విస్తరించినా రాబోయే తరాలకు నీటికొరత లేకుండా సుంకిశాల ఉపయోగపడుతుంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో నీటి కోసం రెండు, మూడు రోజులు ఎదురు చూసేవారు. నా చిన్నతనంలో ఖైరతాబాద్ జలమండలి వద్ద ఖాళీ బిందెలు, కుండలు ఉండేవి.

ఐదేళ్ల పాటు కరవొచ్చినా..

ప్రస్తుతం నగరానికి 37టీఎంసీల నీరు అవసరం ఉంటే 2077 నాటికి దాదాపు 77టీఎంసీల నీరు కావాల్సి వస్తుంది. కాలంతో పోటీపడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశాం. దేశంలో వేగంగా పూర్తి అయిన ప్రాజెక్ట్ ఇది. హైదరాబాద్‌పై 65 టీఎంసీల నీటికుండ ఉండేలా తీర్చిదిద్దాం. ఐదేళ్ల పాటు కరవు వచ్చినా తాగునీటి కొరత ఉండదు.

దిల్లీ కంటే తెలంగాణ ముందుంటుంది..

చుట్టూ 100 కి.మీ మేర హైదరాబాద్‌ విస్తరించనుంది. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. రాబోయే 10నుంచి 15 ఏళ్లలో దిల్లీ కంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుంటుంది. హైదరాబాద్‌ మహానగరం దేశానికి ఒక దిక్సూచి. దేశంలోని మహానగరాలకు ఎక్కడైనా ప్రతికూలతలు ఉంటే.. మన వద్ద ప్రతిదీ అనుకూలతలే’’ అని కేటీఆర్‌ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు