Updated : 08/12/2021 05:09 IST

ప్లాస్టిక్‌ గరళ సాగరాలు

అమెరికాయే ప్రధాన కారణం
చేపల్లోకి చేరుతున్న వ్యర్థాలు
మనుషుల ఆరోగ్యంపై పెను ప్రభావం
హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రపంచ సాగరాలను ప్లాస్టిక్‌ రూపంలో గరళం ముంచెత్తుతోంది. మానవుల విచ్చలవిడి వాడకం వల్ల తీర ప్రాంతాల్లో, ఆర్కిటిక్‌ సముద్ర మంచులోనూ ఇవి భారీగా పోగుపడుతున్నాయి. వీటి కాటుకు సముద్ర జీవులు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా అమెరికాలోని ‘నేషనల్‌ అకాడమీస్‌ ఆఫ్‌ సైన్సెస్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ మెడిసిన్‌’ పరిశోధకులు తమ నివేదికలో కఠోర సత్యాలను వెలుగులోకి తెచ్చారు. అమెరికాయే ఈ సమస్యకు మూలకారణమని తేల్చారు. పారిశ్రామిక, వినియోగ ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు పూర్వ దశ అయిన ‘ప్లాస్టిక్‌ రెసిన్‌’ సరఫరాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఏటా వందల కోట్ల డాలర్ల విలువైన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులను ఈ దేశం సాగిస్తోంది. చైనా కన్నా చాలా ఎక్కువగా తలసరి ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. అమెరికాలో ఇళ్లల్లో ఉపయోగించే ప్లాస్టిక్‌లో చాలా స్వల్ప పరిమాణమే రీసైకిల్‌ అవుతోంది. ఇక్కడి రీసైకిల్‌ వ్యవస్థల సమర్థత అంతంత మాత్రంగానే ఉంది. సాగరాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఈ నివేదిక మొదటి అడుగు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.


చేపల కడుపులోకి.. ఆ తర్వాత మన ఒంట్లోకి..

1960ల చివరి నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని శాస్త్రవేత్తలు నమోదు చేయడం మొదలుపెట్టారు. 2000ల మొదట్లో సముద్ర పరిశోధకుడు చార్లెస్‌ మూర్‌.. ‘గ్రేట్‌ పసిఫిక్‌ గార్బేజ్‌ ప్యాచ్‌’ను వెలుగులోకి తెచ్చాక దీనిపై ఆసక్తి పెరిగింది. వేల మైళ్ల మేర విస్తరించిన ఈ ప్యాచ్‌.. మధ్య ఉత్తర పసిఫిక్‌ ప్రాంతంలో ఉంది. ఇక్కడ సముద్ర ప్రవాహాలు ప్లాస్టిక్‌ను ఒక్కచోటుకు పోగు చేస్తున్నాయి.

* ఆ తర్వాత ఇలాంటి ప్యాచ్‌లు హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్‌, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్‌లోనూ వెలిశాయి.

* దాదాపు 700 రకాల సముద్ర జాతుల్లోకి ఇవి వెళుతున్నట్లు వెల్లడైంది. వీటిలో 200 రకాల చేపలను మానవులు ఆహారంగా తీసుకోవడం గమనార్హం. తద్వారా ఆ ప్లాస్టిక్‌ తునకలు మనుషుల్లోకీ చేరుతున్నాయి.

* ఆహారం, పానీయాల ప్యాకేజింగ్‌కు వాడే పదార్థాల ద్వారా కూడా మనుషుల్లోకి ప్లాస్టిక్‌ ప్రవేశిస్తోంది. అలాగే ఇళ్లలోని ధూళి ద్వారా కూడా సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను ప్రజలు పీలుస్తున్నారు.


విపరిణామాలు

ప్లాస్టిక్‌ వల్ల ప్రజారోగ్యంపై పడే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నారు.

*  ప్లాస్టిక్‌తో ముడిపడిన రసాయనాలు మన శరీరంలోని అనేక ప్రక్రియల్లో జోక్యం చేసుకొని, వాటిని మార్చివేస్తాయి.

*   వీటివల్ల చిన్నారుల్లో ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి.

*  పాలీవినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ) అనే ప్లాస్టిక్‌ను విరివిగా వాడుతున్నారు. దీనివల్ల బ్రాంకైటిస్‌, పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యు మార్పులు, క్యాన్సర్‌, చర్మ వ్యాధులు, వినికిడి సమస్యలు, దృష్టి లోపాలు, అల్సర్లు, కాలేయంలో లోపాలు వంటివి రావొచ్చు.

2050 నాటికి సాగరాల్లో బరువుపరంగా మత్స్యసంపద కన్నా ప్లాస్టిక్‌ పదార్థాల పరిమాణమే ఎక్కువగా ఉండొచ్చు.’’

- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని