Published : 24 May 2022 04:55 IST

కేసీఆర్‌ పాలనపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారు

బంగారు తెలంగాణ ఎక్కడ?: తరుణ్‌ఛుగ్‌
వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మోదీని ఏం చేయలేరు
అత్యధిక ఎంపీ సీట్లు మావే: కిషన్‌రెడ్డి
మూడు సర్వేల్లో భాజపా గ్రాఫ్‌ బాగా పెరిగింది: బండి సంజయ్‌
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేక వాతావరణం నెలకొని ఉందని, పాలనపై ప్రజలు కోపంతో ఊగిపోతున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన భాజపా పదాధికారులు, జిల్లాల అధ్యక్షుల సమావేశం సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి తుంగలో తొక్కారని మండిపడ్డారు. ‘డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు. ఉద్యోగాలివ్వలేదు. బంగారు తెలంగాణ ఎక్కడ? వడ్ల కొనుగోలులో కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోంది. 2023లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తుంది... తెరాస కథ ముగుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైంది. రాష్ట్రంలో ప్రజలంతా తెరాస పాలన అంతం కావాలని కోరుకుంటున్నారు. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మోదీని ఏం చేయలేరు. 2024లో కేంద్రంలో మళ్లీ మా ప్రభుత్వమే వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లు భాజపా గెలుచుకుంటుంది. దృష్టి మరల్చేందుకు ఆయన కేంద్రంపై విషం చిమ్ముతున్నారు.కేంద్రం ఏమీ చేయట్లేదంటున్న కేసీఆర్‌...సైన్స్‌సిటీకి 25 ఎకరాలు ఎందుకివ్వలేదు?’అంటూ విమర్శలు గుప్పించారు. 

దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్ర

తెలంగాణలో ఆత్మహత్యలే లేనట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతూ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ‘ఇటీవల మూడు ప్రముఖ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే- తెరాస, కాంగ్రెస్‌ల పరిస్థితి అధ్వానంగా ఉందని.. భాజపా గ్రాఫ్‌ బాగా పెరిగినట్లు తేలింది. శ్యామాప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌దివస్‌ సందర్భంగా జూన్‌ 23 నుంచి మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర చేపడుతున్నా. కార్యకర్తలపై తెరాస వేధింపులు పెరుగుతోన్నాయి. మక్తల్‌ నియోజకవర్గంలోని ఉట్కూర్‌లో ఒక కార్యకర్తపై ఒకే సంఘటనలో 32 కేసులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది’ అంటూ మండిపడ్డారు.

బలపడ్డాం.. తెరాసతో తలపడదాం..

‘రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భాజపాకు అనుకూల పరిస్థితులున్నాయి. పార్టీ బలపడింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అధికారంలోకి రాలేం. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్ఠం చేయాలి. ఇతర పార్టీల నుంచి చేరికల్ని పెంచాలి. తెరాసను ఎదుర్కొని విజయం సాధించాలి’అని పార్టీ రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం ఉద్బోధించింది. భాజపా జాతీయ సంయుక్త ప్రధానకార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు)శివప్రకాశ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు సీనియర్‌నేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా నిర్వహించిన భేటీల్లో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రంలో 8 ఏళ్ల నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాలు, సంజయ్‌ మూడో విడత పాదయాత్ర, 26న హైదరాబాద్‌కు వస్తున్న నరేంద్రమోదీకి స్వాగతం పలకడంపై చర్చించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై మాట్లాడారు.

మే 30-జూన్‌ 14 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు

మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై మే 30-జూన్‌ 14 వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా జాతీయ సంయుక్త ప్రధానకార్యదర్శి శివప్రకాశ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌లు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ‘సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర సమయంలో పార్టీ కార్యక్రమాలు ఉండట్లేదు. మిగతా ప్రాంతాల్లో కూడా కార్యక్రమాల్ని కొనసాగించాలి. సీనియర్‌ నేతలు అందరికీ పని అప్పగిస్తాం’అని శివప్రకాశ్‌ తెలిపారు. సీనియర్ల అనుభవాలు ఉపయోగించుకోవాలని ఇటీవల ఈటల, విజయశాంతి తదితర నేతలు పార్టీ పెద్దలకు సూచించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ కార్యక్రమాలు పెంచాలని తరుణ్‌ఛుగ్‌ సూచించారు. ‘అమిత్‌షా సభకు జనసమీకరణ, పార్టీ కార్యక్రమాల విషయంలో కొందరు జిల్లా అధ్యక్షుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. తీరు మారకుంటే కఠినంగా వ్యవహరిస్తాం’అని బండి సంజయ్‌ హెచ్చరించారు. రైతుల రక్తం పీల్చమంటోంది కేంద్రం అని కేసీఆర్‌ అంటే..పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వతీరును ఎందుకు ఎండగట్టట్లేదని నిలదీశారు. ఈ సమావేశాల్లో పార్టీ ముఖ్యనేతలు మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, జితేందర్‌రెడ్డి, జి.వివేక్‌, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయకార్యదర్శి ఎస్‌.కుమార్‌, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, గంగిడి మనోహర్‌రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, బంగారు శ్రుతి, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని