నోటితో హామీ ఇచ్చి నొసటితో వెక్కిరిస్తున్నాయి

ఎస్సీ వర్గీకరణ విషయంలో రాజకీయ పార్టీల తీరు నోటితో హామీ ఇచ్చి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న

Published : 29 May 2022 05:02 IST

రాజకీయ పార్టీలపై మందకృష్ణ మాదిగ ధ్వజం

మేడ్చల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణ విషయంలో రాజకీయ పార్టీల తీరు నోటితో హామీ ఇచ్చి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నిర్వహించనున్న పాదయాత్రను శనివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్‌ పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ జరిగితేనే మాదిగలు 12 శాతం రిజర్వేషన్లు పొందడం సాధ్యమన్నారు. సుమారు 120 రోజులు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. భాజపా, కాంగ్రెస్‌, తెరాసల్లో ఏ ఒక్క పార్టీ వర్గీకరణకు కృషి చేసినా తమ ఆశయం నెరవేరుతుందని చెప్పారు. కానీ, ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఓట్లు దండుకోవడమే తప్ప మాదిగల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకోలేదని విమర్శించారు. రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేకే వర్గీకరణకు నేటికీ ఉద్యమించాల్సి వస్తోందన్నారు. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లి.. పార్లమెంటులో బిల్లు పెట్టి వర్గీకరణ చేయిస్తామని 2017 నవంబరు 6న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారని.. ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదన్నారు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్న భాజపా బిల్లు పెట్టి ఆమోదించే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయని అసమర్థ పార్టీ భాజపా అని మండిపడ్డారు. ఏ, బీ, సీ, డీ వర్గీకరణ జరిగేంతవరకు ఉద్యమం ఆగదని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని