ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ వారంలో..

తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

Updated : 19 May 2024 06:31 IST

యాజమాన్య కోటా సీట్ల అమ్మకాల నిరోధంపై దృష్టి
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ కాలపట్టికను వారం రోజుల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. శనివారం ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ నడుస్తోందని చెప్పారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇచ్చిన గడువులోపు ప్రవేశాలు పూర్తి చేస్తామన్నారు. యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంబీబీఎస్‌ సీట్ల మాదిరిగా ఏ, బీ, సీ కేటగిరీలుగా చేసి ఫీజులు నిర్ణయించడం లేక ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా చదివి లేటరల్‌ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్‌ లేదా బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేలా చూస్తామని వెల్లడించారు. ప్రైవేట్‌ వర్సిటీల ఏర్పాటుకు కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించలేదని, అయినా కొందరు దరఖాస్తులు ఇస్తున్నారని, నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని తెలిపారు. గత ఏడాది అనుమతులు లేకుండా ప్రవేశాలు నిర్వహించిన రెండు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను ఇతర విద్యాసంస్థల్లో సర్దుబాటు చేశామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి తెలిపారు.

పాఠశాల రుసుముల నియంత్రణకు చట్టం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తెస్తామని వెంకటేశం తెలిపారు. ఈసారికి అది వీలుకాకపోవచ్చని, 2025-26 విద్యా సంవత్సరంలో అమల్లోకి రావొచ్చని వెల్లడించారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినా చట్టం కాలేదని, దానిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పెడతామని చెప్పారు.

ఉపకులపతుల నియామకం కొంత ఆలస్యం

ఈ నెల 21వ తేదీతో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం ముగుస్తుందని, ఆలోపు కొత్త వీసీలను నియమించాలని అనుకున్నా ఎన్నికల నియమావళి తదితర కారణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు. స్వల్పకాలానికి ఇన్‌ఛార్జి ఉపకులపతులుగా ఐఏఎస్‌లనా? లేక వర్సిటీల్లో సీనియర్లను నియమించాలా? అనే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయిస్తామని  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని