Published : 25 Nov 2020 09:52 IST

నీళ్లలో దూకి.. మొసలితో పోరాడి..

శునకాన్ని కాపాడేందుకు ఓ వృద్ధుడి సాహసం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పెంపుడు శునకాన్ని కాపాడుకునేందుకు ఓ వ్యక్తి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. ఏకంగా మొసలితో పోరాడి కుక్కను కాపాడుకున్నాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఫ్లోరిడాకు చెందిన 74 ఏళ్ల రిచర్డ్స్‌ విల్‌బ్యాంక్స్‌ తన మూడు నెలల పెంపుడు కుక్కతో ఓ కొలను సమీపానికి ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లేవాడు. రోజూలాగే శునకంతో వాకింగ్‌కు వెళ్లగా కొలనులోనుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన చిన్నసైజు మొసలి కుక్కను నోట కరుచుకొని అంతే వేగంగా కొలనులోకి వెళ్లిపోయింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనతో తేలుకున్న విల్‌బ్యాంక్స్‌ ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. తన శునకాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలతో వెంటనే కొలనులోకి దూకి నీటి అడుగుభాగంలో ఉన్న మొసలి తలను పట్టుకొని పైకి లేపాడు. చావు భయంతో అరుస్తున్న కుక్కను మొసలి దవడల నుంచి అతికష్టంగా విడిపించాడు. శునకం స్వల్ప గాయాలతో బయటపడింది. దాన్ని కాపాడే క్రమంలో రిచర్డ్స్‌ చేతులకు కూడా గాయాలయ్యాయి. 

‘ఎప్పటిలాగే కొలను ఒడ్డుకు వాకింగ్‌కు వెళ్లాం. అది మిస్సైల్‌లా దూసుకొచ్చింది. ఓ మొసలి అంత వేగంగా దాడి చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. దాని దవడలు ఎంతో బలంగా ఉన్నాయి. మొసలి పట్టు నుంచి శునకాన్ని విడిపించేందుకు నా శాయశక్తులా కృషి చేశా. అది కఠిన సమయం’ అని విల్‌బ్యాంక్స్‌ ఓ న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు. కొలను ప్రాంతంలో ఫ్లోరిడా వైల్డ్‌లైఫ్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అది ప్రస్తుతం వైరలైంది. నెటిజన్లు ఆ వృద్ధుడి సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..


Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని