సాగర జలాల్లో... గస్తీ మే సవాల్‌!

నేడు భారత తీర రక్షక దళం (ఐసీజీ) దినోత్సవం. తీర ప్రాంతాల్ని సురక్షితం చేయడం ఐసీజీ బాధ్యత. సాగర తీరంలో గస్తీ నిర్వహిస్తూ, స్మగ్లింగ్‌ కార్యకలాపాలను అడ్డుకునే విధుల్ని సైతం చేపడుతుంది.

Published : 01 Feb 2023 00:22 IST

నేడు భారత తీర రక్షక దళం (ఐసీజీ) దినోత్సవం. తీర ప్రాంతాల్ని సురక్షితం చేయడం ఐసీజీ బాధ్యత. సాగర తీరంలో గస్తీ నిర్వహిస్తూ, స్మగ్లింగ్‌ కార్యకలాపాలను అడ్డుకునే విధుల్ని సైతం చేపడుతుంది. సముద్ర పర్యావరణ పరిరక్షణతోపాటు కాలుష్య నివారణకూ కృషి చేస్తుంది. తీరంలోని టెర్మినళ్లు, ఇతరత్రా నిర్మాణాల రక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. మొత్తంగా తీరప్రాంత భద్రతా వ్యవస్థకు కళ్లూచెవుల్లా ఐసీజీ పనిచేస్తుంది.

భారత తీరరక్షక దళం... నాగ్‌చౌధురి (1970), కె.ఎఫ్‌.రుస్తుంజీ (1975) కమిటీల సిఫార్సుల మేరకు 1977 ఫిబ్రవరి ఒకటో తేదీన తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటైంది. తీర భద్రత చట్టం, 1978 ప్రకారం ఈ దళాన్ని అధికారికంగా ఏర్పాటు చేశారు. దిల్లీ ప్రధాన కేంద్రంగా అయిదు తీర రక్షణ ప్రాంతాలతో డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వంలో రక్షణ శాఖ పరిధిలో పని చేస్తుంది. ఐసీజీలో 15 వేలకుపైగా సిబ్బంది, 159 నౌకలు, 76 విమానాలు, 42 స్టేషన్లు ఉన్నాయి. 200 నౌకలు, 80 విమానాల లక్షిత స్థాయిని 2025 నాటికి సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. డిజిటల్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా పలు ఉపరితల, వైమానిక కార్యకలాపాలు, రవాణా, ఆర్థిక, మానవ వనరుల నెట్‌వర్క్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సముద్రంలో చమురు, రసాయనాల విడుదల విషయంలో చర్యలు చేపట్టే అంశాలపై నౌకామంత్రిత్వశాఖ ఐసీజీని కేంద్ర సమన్వయ ప్రాధికార సంస్థగా నియమించింది. సంక్షోభ నిర్వహణ ప్రణాళికలో భాగంగా సాగర మండలాల్లో రసాయన కాలుష్యంపై ప్రతిస్పందించి, చర్యలు తీసుకునే ప్రధాన ఏజెన్సీగా గుర్తించింది. ఐసీజీ నాలుగు కాలుష్య నివారణ బృందాలతోపాటు, జాతీయ చమురు విడుదల విపత్తు ప్రణాళికను సిద్ధం చేసింది. సముద్ర జలాల్లో చమురు విడుదలకావడానికి సంబంధించి 2022 అక్టోబరు వరకు 97 ఘటనలు, విదేశీ జలాల్లో మూడు ఘటనలపై చర్యలు చేపట్టింది. సముద్ర కాలుష్య నివారణ కార్యకలాపాల్లో భాగంగా మారిషస్‌కూ ఐసీజీ తోడ్పాటు అందించింది.

సామాజిక అనుసంధానం

చట్టపరమైన నిబంధనల అమలు, సర్వేక్షణ, సాగర జలాల్లో అన్వేషణ, సహాయక చర్యల బాధ్యతల్నీ ఐసీజీ నిర్వర్తిస్తుంది. చట్టవిరుద్ధంగా చేపలు పట్టడం, స్మగ్లింగ్‌, వేట, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధిస్తుంది. తనిఖీ నిమిత్తం ఏదైనా నౌక, పడవను ఆపడానికి, అందులోకి ప్రవేశించడానికి అధికారం ఐసీజీకి ఉంటుంది. నిఘా సమాచారం మేరకు నిరంతరం బోర్డింగ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తుంది. రక్షణ శాఖ నివేదిక (2019-20) ప్రకారం 2009 నుంచి మొత్తం 2,39,724 బోర్డింగ్‌ ఆపరేషన్లను ఐసీజీ నౌకలు నిర్వహించాయి. స్మగ్లింగ్‌ నిరోధక కార్యకలాపాల్లో భాగంగా 153 విదేశీ పడవలను, 969 మంది సిబ్బందిని ఐసీజీ పట్టుకొంది. గత ఎనిమిదేళ్లలో రూ.13,989 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. విదేశీ చేపల వేట పడవల్ని, సిబ్బందిని పట్టుకొంది. తీరప్రాంత భద్రతా వ్యవస్థలో భాగంగా- కోస్తా నిఘా నెట్‌వర్క్‌, రాడార్లతో కూడిన సెన్సర్లు, స్వయంచాలిత గుర్తింపు వ్యవస్థ, పగలూరాత్రి పనిచేసే కెమెరాలు, రాడార్‌ స్టేషన్లు, నిఘా యంత్రాంగాలను ఐసీజీ ఏర్పాటు చేసింది. 20 లక్షల చదరపు కిలోమీటర్ల ఈఈజడ్‌ పరిధిపై ఉపరితల, గగనతల నిఘాను కొనసాగిస్తుంది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలతో సామాజిక అనుసంధాన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అంతర్జాతీయ సముద్ర అన్వేషణ, సహాయక చర్యల ఒడంబడిక-1979పై భారత్‌ కూడా సంతకం చేసింది. దీనిప్రకారం భారత అన్వేషణ, సహాయక చర్యల ప్రాంతంలో విదేశీయులకు సంబంధించి సమన్వయం చేసే బాధ్యత ఐసీజీపైనే ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు జాతీయ అన్వేషణ, సహాయక చర్యల విన్యాసాలను ఐసీజీ నిర్వహిస్తోంది. వరదలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులప్పుడు మానవతా సహాయ కార్యకలాపాలను చేపడుతోంది. సుమారు 13వేల మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో పౌర అధికార యంత్రాంగానికి తోడ్పాటు అందించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలో సహాయక చర్యల ద్వారా బుల్‌బుల్‌, మహా తుపానుల సందర్భంగా మత్స్యకారులకు ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. జాక్సన్‌ జలసంధిలో చిక్కుకుపోయిన పోలీసు సిబ్బందిని కాపాడిన తీరు ప్రశంసలు అందుకుంది. చేపల పడవలు, సముద్ర పరిశోధక నౌకలు, తీరంలోని పడవలకు సంబంధించి అగ్ని ప్రమాద సిబ్బందికి తోడ్పడటంలో కీలక పాత్ర పోషించింది. పడవల నుంచి మత్స్యకారులు, సిబ్బందిని కాపాడటంలోనూ సహాయపడింది.

భద్రతా సవాళ్లు...

ఐసీజీ విధుల నిర్వహణలో దేశీయ, అంతర్జాతీయ సహకారం కీలకం. జాతీయ స్థాయిలో ఐసీజీ కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. భారత నావికా దళం, మత్స్యశాఖ, కస్టమ్స్‌ విభాగం, కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాల మధ్య సమన్వయం నెరపుతుంది. జాతీయ స్థాయి కోస్తా రక్షణ విన్యాసాలైన ‘సీ విజిల్‌’ నిర్వహణలో నావికా దళానికి తోడ్పాటు అందిస్తుంది. భారత సమగ్ర ఆర్థిక మండలి ప్రాంతం (ఈఈజడ్‌)తో పాటు, తీరప్రాంతమంతటా భద్రతను పరిరక్షిస్తుంది. విశ్వసనీయమైన సముద్ర ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే భారత్‌ కాంక్ష ఊపందుకొంటుండగా, భద్రతాపరమైన సవాళ్లూ పెరుగుతున్నాయి. సముద్ర కాంటినెంటల్‌ షెల్ప్‌ విస్తరణ కోసం 2009లో భారత్‌ తన అర్జీని సమర్పించింది. దీనివల్ల సుమారు 12 లక్షల చదరపు కిలోమీటర్ల అదనపు ప్రాంతాన్ని జోడించడంలో ఐసీజీ పాత్ర కీలకంగా మారనుంది. అభివృద్ధి చెందిన సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత శక్తిసామర్థ్యాలను, పోరాట రీతిని ఐసీజీ సముపార్జించుకోవాలి. జలాంతర్భాగ సాంకేతికతలు, యూఏవీలు, అంతరిక్ష పరిజ్ఞానాలను ఉపయోగించుకొనే దిశగా వృద్ధి సాధించాలి. అప్పుడే భారత తీరం సురక్షితంగా, సుదృఢంగా ఉంటుంది.


అంతర్జాతీయంగా...

ముద్ర సంబంధిత అంశాలపై సహకారం నిమిత్తం ప్రపంచంలోని వివిధ తీరరక్షక దళాలతో ఐసీజీ అంతర్జాతీయ స్థాయిలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొంది. విదేశ ఓడరేవుల్లో నౌకల మోహరింపు, సంయుక్త విన్యాసాల నిర్వహణ తదితర కార్యకలాపాల ద్వారా సముద్ర అన్వేషణ సహాయక చర్యలు, నౌకల్లో తనిఖీలు, సముద్ర చట్టాల అమలు విధుల్లో కార్యనిర్వాహక సామర్థ్యాలు పటిష్ఠమవుతాయి. విదేశీ తీర రక్షక దళాలు, ఇతర సముద్ర సంబంధిత సంస్థలతో ఎప్పటికప్పుడు అనుసంధానం అయ్యేందుకు ఐసీజీ నౌకలు విదేశాల్లోనూ మోహరిస్తాయి. 2022 సెప్టెంబరులో ఐసీజీ అమెరికా తీర రక్షక బలగాలతో కలిసి అభ్యాస్‌ పేరిట చెన్నై తీరంలో సంయుక్త విన్యాసాలు చేపట్టింది. 1991 నుంచి మాల్దీవుల తీరరక్షక దళంతో కలిసి విన్యాసాలు నిర్వహిస్తోంది. 2012 నుంచి శ్రీలంక కూడా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి