Published : 23 May 2022 00:56 IST

అడవులను కబళిస్తున్న కార్చిచ్చులు

ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం

వేసవి ఉష్ణోగ్రతలవల్ల ఉత్తర భారతంలోని అడవులు కార్చిచ్చులతో రగిలిపోతున్నాయి. కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌తో పాటు, పలు ఈశాన్య రాష్ట్రాల్లోని అడవులు దావానలాలకు ఆహుతి అవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న మంటలబారిన పడి పెద్దయెత్తున వన్యప్రాణులు బలవుతున్నాయి. పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉన్నా ప్రభుత్వాలు దావానలాలను నిరోధించే దిశగా వేగంగా స్పందించకపోవడం దురదృష్టకరం. సర్కార్లు అనుసరిస్తున్న ఈ ధోరణి పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. కశ్మీర్‌లోని ఖ్రూ, ఖోన్‌మోహ్‌, ట్రాల్‌ అటవీ ప్రాంతాలను కార్చిచ్చులు దహించివేస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల, మండి, సోలన్‌; ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌, పిథౌరాగఢ్‌, ఉత్తరకాశీ, తెహ్రీ అడవుల్లో నిత్యం ఎక్కడో ఒకచోట దావానలాలు రగులుతూనే ఉన్నాయి. కార్చిచ్చులకు హిమాలయాల్లోని అటవీ ప్రాంతం వేగంగా భస్మీపటలం అవుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలను చూస్తే స్పష్టమవుతోంది. ఉత్తర భారతంలోని మణిపుర్‌, మిజోరం, నాగాలాండ్‌ అడవుల్లోనూ కొన్నేళ్లుగా అడవులు దగ్ధమవుతున్నాయి. అనేక స్వదేశీ వృక్ష జాతులు ఇప్పటికే కనుమరుగయ్యాయి.

అంతరించిపోతున్న జీవజాతులపై ‘అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సమాఖ్య (ఐయూసీఎన్‌)’  రూపొందించిన జాబితాలోకి హిమాలయ వన్యప్రాణుల్లోని అనేక జాతులు చేరుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వెస్టర్న్‌ ట్రాగొపాన్‌, కస్తూరి జింక, చీర్‌ నెమలి, హిమాలయన్‌ సెరో, ఉత్తరాఖండ్‌లోని ఎగిరే ఉడుత, హిమాలయాల్లో కనిపించే అరుదైన ఎలుగుబంటి జాతి, బర్మీస్‌ కొండచిలువ, ఐబెక్స్‌తో పాటు కొన్ని అరుదైన పక్షి జాతులు దాదాపు అంతరించిపోయాయి. వేసవి కార్చిచ్చులతో దేశీయ వానరాలు, క్షీరదాలు, సరీసృపాల జీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని దశాబ్దాల కాలంలో పది రకాల వృక్ష జాతులు కనుమరుగైనట్లు దెహ్రాదూన్‌లోని ‘అటవీ పరిశోధన సంస్థ (ఎఫ్‌ఆర్‌ఐ)’ అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పులతో పాటు కార్చిచ్చులు ఇందుకు కారణమయ్యాయి. హిమాలయాల్లో కనిపించే హార్న్‌బీమ్‌, ఇండియన్‌ బాక్స్‌ఉడ్‌, హిమాలయన్‌ హోలీ, ఆల్డర్‌ వృక్షాలు కనుమరుగైన జాతుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎంతో విలువైన జాతులు.

భారత్‌లో కార్చిచ్చులకు మాయమవుతున్న అడవుల్లో సింహభాగం హిమాలయ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వృక్షాలు, వన్యప్రాణులతో పాటు మానవాళికీ ఈ దావానలాలు హాని కలిగిస్తున్నాయి. కార్చిచ్చులతో కర్బన ఉద్గారాల స్థాయులు పెరుగుతున్నాయి. ఒక్క ఉత్తరాఖండ్‌ కార్చిచ్చులతోనే ఏకంగా రెండు మెగాటన్నుల కర్బన ఉద్గారాలు గాలిలోకి చేరినట్లు అంచనా. ఏటా వేసవి కాలం ప్రారంభానికి ముందే హిమాలయాల్లోని దిగువ ప్రాంతాలు, లోయల్లో కార్చిచ్చులు పెచ్చుమీరుతున్నాయి. మంటలు వేగంగా విస్తరిస్తూ ఉండటంతో వాటి నియంత్రణలో అగ్నిమాపక సిబ్బంది పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోతున్నారు. అడవుల పరిరక్షణ కోసం రూ.54 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ‘కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, ప్లానింగ్‌ అథారిటీ (సీఏఎమ్‌పీఏ)’ ఈ విషయంలో ఏమీచేయలేక చేతులెత్తేయడం విచారకరం.

వాస్తవానికి ఉత్తరాఖండ్‌కు దావానలాలు కొత్త కాదు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అక్కడి అడవులను కార్చిచ్చుల నుంచి పరిరక్షించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పలు ప్రత్యేక చర్యలు చేపట్టింది. హల్‌ద్వానీ ప్రాంతంలో ప్రత్యేక అగ్నిమాపక సిబ్బందిని సైతం ఏర్పాటు చేసింది. నైనీతాల్‌ జిల్లాలో ఉండే హల్‌ద్వానీలో హెలికాప్టర్ల ద్వారా నీళ్లు, రసాయనాలు చల్లి దావానలాల్ని నియంత్రించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఐఎఫ్‌ఎస్‌ అధికారులు అమెరికాలో శిక్షణ తీసుకున్నా... వారిని ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఒక్కసారైనా ఉపయోగించుకోలేదు. కార్చిచ్చుల నియంత్రణకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత చాంది ప్రసాద్‌ భట్‌ సహా ఎందరో ప్రముఖ పర్యావరణవేత్తలు తమ అసంతృప్తిని వెలిబుచ్చుతూనే ఉన్నారు. హిమాలయాల్లో వృక్ష సంపద నాశనమైతే మానవాళికి నష్టం తప్పదని భట్‌ అనేకమార్లు హెచ్చరించారు. వేసవి కార్చిచ్చులకు హిమాలయ రాష్ట్రాల్లో పెద్దయెత్తున అడవులు హరించుకుపోవడం, వన్యప్రాణులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకుని- కార్చిచ్చుల నుంచి అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించే చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులో మానవాళి మనుగడకే ప్రమాదం పొంచి ఉంది.

- ఆర్‌.పి.నైల్వాల్‌ (ఉత్తరాఖండ్‌ వ్యవహారాల నిపుణులు)

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని