అవినీతి జ్ఞానామృతం!

‘ఎవ్వరూ దేనికీ అతీతం కాదు... అన్నీ అందరూ చేసేవే... ఎవరో ఒకరు చేస్తేనే మిగతా వాళ్లూ చేస్తారు... అంతా విధి లీలావిలాసం... అది అవగతం కానివాడికి తప్పదు విలాపం!’ ‘మోకాలి చిప్పలో జ్ఞానదీపం వెలిగిన సర్వజ్ఞానిలా తత్వం పలవరిస్తున్నావు, ఏమైనా కరిచిందా?’   ‘తాజాగా ఒక నేతగారు పంచిన జ్ఞానబోధకు కళ్లూమెదడు విప్పారాయి.

Published : 02 Feb 2023 00:28 IST

‘ఎవ్వరూ దేనికీ అతీతం కాదు... అన్నీ అందరూ చేసేవే... ఎవరో ఒకరు చేస్తేనే మిగతా వాళ్లూ చేస్తారు... అంతా విధి లీలావిలాసం... అది అవగతం కానివాడికి తప్పదు విలాపం!’
‘మోకాలి చిప్పలో జ్ఞానదీపం వెలిగిన సర్వజ్ఞానిలా తత్వం పలవరిస్తున్నావు, ఏమైనా కరిచిందా?’  
‘తాజాగా ఒక నేతగారు పంచిన జ్ఞానబోధకు కళ్లూమెదడు విప్పారాయి. ఏదీ ఎవరికీ కొత్త కాదు... అంతా అందరికీ పాతే... ఒకరు మొదలు పెట్టిందే మనం చేస్తాం అంటూ స్వయంగా నేతగారే సెలవిచ్చారు. ఏ కళన ఉన్నారో మహానుభావులు- సత్యజ్ఞానామృతాన్ని పంచారు!’
‘ఇంతటి జ్ఞానపైత్యాన్ని నింపిన నేతగారెవరు, ఇంతకీ ఏమన్నారు?
‘అవినీతి కొత్తేమీ కాదు, మేమేమీ సత్యవంతులం కాదు- అంటూ ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేగారే స్వయంవికసిత విజ్ఞానంతో విశదీకరించారు. ఎంతో సత్యజ్ఞానసంధులైతే తప్ప అంతటి ప్రాపంచిక సత్యం జాలువారదు!’
‘ఇంతకన్నా ఉబ్బిపోవద్దు, పగిలిపోగలదు! అయినా అంతాఅయ్యాక అసలా మాటలే అనలేదని, వక్రీకరించారని, వంకర తిప్పారంటూ నాలుకలు మెలికలు తిప్పుతారు, జాగ్రత్త!’
‘ఇందులో వక్రీకరించేదేముంది... ఉన్నదే అన్నారు, అలా అన్నదే చెబుతున్నాను కదా!’
‘అవినీతి అందరికీ కనిపించేదేనని, అందరూ చూస్తున్నదీ, తాను చెప్పినదీ అదేనంటారు. అవినీతిని చూస్తూ పెరిగి, అవినీతి సమాజాన్ని సహిస్తున్నాం కాబట్టి తామేమీ సత్యసంధులం కాదన్న అర్థంలో అన్నానంటూ మాట తిరగేస్తారు. అవినీతి అబద్ధం అతుక్కుని పుట్టే కవలల్లాంటివి... అవి నేతలకు కవచకుండలాలు. అందుకని, నేతల నోటి మాటను కాదు, అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే వారి జ్ఞానస్వచ్ఛత బోధపడుతుంది’
‘అవినీతి గతంలోనూ మునుపటి ప్రభుత్వ హయాములోనూ జరిగిందంటూ విశాల హృదయాన్ని చాటుకున్నారు.’
‘అవినీతి అనేది భూమి పుట్టినప్పటి నుంచీ ఉన్నదని, తరతరాలుగా వచ్చేస్తుందే తప్ప దానికి, పార్టీలు ప్రభుత్వాలు నేతలతో సంబంధం ఉండదన్న దబాయింపు వాదన అన్నమాట. ఇంకా అడిగితే తమను అవినీతికి పాల్పడాల్సిన పరిస్థితుల్లోకి నెడుతున్నదే ప్రజలు, వ్యవస్థ అని దబాయించేస్తారు.’  
‘అవతలి పార్టీ నేతలే కోట్లలో దోపిడికి పాల్పడ్డారని కూడా ఆరోపించారు’
‘నేతల బాధను గుర్తించాల్సింది ఇక్కడే. అంతా అవతలి పార్టీ నేతలే దోచేసుకుంటే, తమకు దక్కేదేమిటనే బాధతో కూడిన దుగ్ధను అర్థం చేసుకోవాలి. అన్నీ అందరూ చేస్తున్నారు కాబట్టే తామూ చేస్తున్నామంటూ సర్వసాధారణీకరించే సూత్రం ఒకటైతే, తాము పూసుకొన్న బురదను తలాకొంచెం పూసి, అందరినీ సమానంగా గౌరవించే గొప్ప ప్రజాస్వామిక లక్షణం మరొకటి. అందరినీ గబ్బుపట్టిస్తే తనకు అంటిన గబ్బును ఎవరూ పట్టించుకోరన్న కాలజ్ఞానామృతం, అన్నింటినీ అందరికీ పంచిపెట్టడమన్న సామాజిక న్యాయం... ఇలా ఇందులో అంతర్లీనంగా నిబిడీకృతమైన సత్యభావనలను అర్థం చేసుకోవాలన్నమాట!’
‘తాము చేసేవన్నీ పేద ప్రజల కోసమేనని, అవన్నీ అభివృద్ధి పనులని, విపక్ష నేతలు అభివృద్ధి పేరిట చేసిన పనులు మాత్రం అవినీతిమయమని ఆరోపించారు. అధికారులపై విమర్శలు వస్తున్నాయని, అలాంటి వాటికి తావులేకుండా చేస్తామని నిర్భయంగా చెప్పారు తెలుసా?’
‘తినేవైతే మాకు, తిట్లయితే మీకు అన్నట్లుంటుంది నేతల వ్యవహారం. అధికారులను అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా తింటూనే, తిప్పలు వస్తే తప్పించుకోవడానికి అదే అధికారులను అడ్డం పెట్టుకునే అతితెలివి అన్నమాట! జనం సమస్యలు తీరడం లేదన్నా, జనాల్ని పీక్కుతింటున్నారన్నా అన్నింటికీ కర్తక్రియకర్మకారకులు నేతలే. నేతలు నేర్పనిదే అధికారులు బల్లల కింద తడుముతారా! ఇదంతా అందరికీ తెలిసిన జ్ఞానమే!’
‘మరయితే, మామూళ్ల కోసం అధికారులు డిమాండ్లు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలంటూ ప్రజలకు పిలుపిచ్చారు. ఇందులో నీతి న్యాయం ధర్మం జనక్షేమం సమాజోద్ధరణ కనిపించడం లేదా?’  
‘అధికారులు పనిచేసే బల్లలంటే నేతల కోసం తెరిచిన వసూళ్ల కౌంటర్లు! ఆ వసూళ్లన్నీ చివరికి చేరేది నేతల ఖాతాలకే! నేతగారు ఏదీ స్వయంగా చేతులతో ముట్టుకోరాయె! చెల్లింపుల వేళ జనానికి ఇబ్బందులు రాకుండా అడుగడుగునా కౌంటర్లు తెరుస్తారు. ఒకవేళ తమకు తెలియకుండా ఎవరైనా కొత్త కౌంటర్లు తెరిచినా, అందులోనూ పిండుకునే బృహత్‌ ప్రణాళిక దాగుంటుంది నేతలు జనాలకు ఇచ్చే పిలుపుల్లో! అలాంటి పిలుపులన్నీ అవినీతిపై పోరాటాలనుకుని, ఆవేశపడి, ఆరోగ్యం చెడగొట్టుకునేవు! నాయకుల మాటలకు నానార్థాలెన్నో!’
‘నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా... ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతోనే కదా నేతలు ఏదైనా మాట్లాడేస్తుంటారు?’
‘ఎందుకు చెయ్యలేరు, నేతల ప్రాణం సామాన్యుల వేలి కొసలో ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు కాస్త గట్టిగా నొక్కితే చాలు! గిలగిలాకొట్టుకొని, విలవిలలాడాల్సిందే! ఆ దెబ్బకు ఎంతటి చెట్టయినా మొదలుతోసహా ఊడి పడాల్సిందే!’

శ్రీజన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.