Gauri Kekre : ఆమె కేక్స్‌ కథలు చెప్తాయ్‌!

పుట్టిన రోజు, పెళ్లి రోజు.. వంటి ప్రత్యేక సందర్భాలను సెలబ్రేట్‌ చేసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది కేక్‌. అయితే అందులోనూ ఏదో ఓ కేక్‌ అని కాకుండా.. సందర్భానికి, థీమ్‌కి తగినట్లుగా కేక్‌ తయారుచేయించుకుంటే.. ఆ స్పెషల్‌ అకేషన్‌ను మరింత స్పెషల్‌గా మార్చేయచ్చు.

Published : 24 Sep 2023 13:08 IST

(Photos: Facebook)

పుట్టిన రోజు, పెళ్లి రోజు.. వంటి ప్రత్యేక సందర్భాలను సెలబ్రేట్‌ చేసుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది కేక్‌. అయితే అందులోనూ ఏదో ఓ కేక్‌ అని కాకుండా.. సందర్భానికి, థీమ్‌కి తగినట్లుగా కేక్‌ తయారుచేయించుకుంటే.. ఆ స్పెషల్‌ అకేషన్‌ను మరింత స్పెషల్‌గా మార్చేయచ్చు. అలాంటి కస్టమైజ్‌డ్‌ కేక్స్‌తో బేకింగ్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు గౌరీ కెక్రే. ప్రత్యేక సందర్భం అంతరార్థం, దాని వెనకున్న అసలు కథేంటో చెప్తే చాలు.. దాన్ని ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన కేక్స్‌ తయారుచేయడంలో ఆమెది అందెవేసిన చేయి. అయితే వృత్తి రీత్యా డెంటిస్ట్‌ అయిన గౌరి.. అసలు బేకింగ్‌ వైపు ఎలా వచ్చారో తెలుసుకుందాం రండి..

ముంబయిలోని వసాయ్‌ అనే ప్రాంతంలో పుట్టి పెరిగారు గౌరి. చిన్నతనం నుంచి చదువులో మెరుగ్గా రాణించిన ఆమెకు.. జీవశాస్త్రం ఇష్టమైన సబ్జెక్టు. పాటల్లోనూ ప్రావీణ్యమున్న ఆమె.. స్కూల్లో పలు పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందారు. అయితే గౌరి తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. వాళ్ల స్ఫూర్తితో తానూ డాక్టర్‌ వృత్తిని కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకున్నారు.

బార్బీ కేక్‌.. సక్సెసైంది!

మెడికల్‌ ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంకు వచ్చినా.. దంత వైద్యాన్ని ఎంచుకున్నారు గౌరి. అంతలోనే ఆమె తండ్రి చనిపోవడంతో కుంగిపోయిన ఆమె.. ఆ తర్వాత తేరుకొని చదువు పూర్తిచేశారు. దంత వైద్యురాలిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన గౌరి.. కాలేజీ రోజుల్లో తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డారు. అయితే పెళ్లై, తన మొదటి కూతురు పుట్టాకే వంట తనకు పరిచయమైందని చెబుతున్నారామె.

‘పెళ్లికి ముందు వరకు నూడుల్స్‌ తప్ప మరే వంటకం నాకు రాదు. నా మొదటి పాప పుట్టాక ఇంట్లో కాస్త ఖాళీ సమయం దొరకడంతో చిన్న చిన్న వంటకాలు ప్రయత్నించేదాన్ని. ఈ క్రమంలోనే బేకింగ్‌పై నాలో ఉన్న తృష్ణ బయటపడింది. కేక్స్‌, కప్‌ కేక్స్‌, కుకీస్‌.. వంటివి ఆసక్తిగా తయారుచేసేదాన్ని. అయితే నా కూతురు తన పుట్టినరోజుకు బార్బీ కేక్‌ కావాలని మారాం చేసింది. దాంతో నేనే స్వయంగా తయారుచేద్దామని ప్రయత్నించా. అది సక్సెసవడంతో ఆన్‌లైన్‌లో శోధించి.. కొత్తగా అనిపించిన కేక్స్‌ ట్రై చేసేదాన్ని. ఈ క్రమంలోనే కేక్స్‌ తయారీ, బేకింగ్‌, కేక్‌ ఆర్ట్‌లో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకున్నా..’ అంటోన్న గౌరి.. రెండో కూతురు పుట్టాకే కేక్‌ బేకింగ్‌పై పూర్తి దృష్టి పెట్టానంటున్నారు.

కథ కథకో కేక్‌!

తన సృజనాత్మక ఆలోచనలతో తయారుచేసిన కేక్స్‌ని తొలుత స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారికి అందించేవారు గౌరి. ఇలా ఆమె తయారుచేసిన విభిన్న కేక్స్‌ వారికీ నచ్చడంతో.. ఆ ఫొటోల్ని ‘లిటిల్‌ వైట్‌ అవెన్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేయడం ప్రారంభించారు. అలా ఆమె కేక్స్‌కు క్రమంగా పాపులారిటీ పెరగడం ప్రారంభమైంది. ఆపై కస్టమర్ల నుంచి ఆర్డర్లు వెల్లువెత్తడంతో.. వారి కోరిక మేరకు కస్టమైజ్‌డ్‌ కేక్స్‌ తయారుచేయడం ప్రారంభించానంటున్నారు గౌరి.

‘ఓసారి క్యాబ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ‘నాలుక బయటపెట్టి సరదాగా నవ్వుతున్న ఐన్‌స్టీన్‌ బొమ్మ’ కనిపించింది. దాన్ని కేక్‌గా తయారుచేస్తే? అన్న ఆలోచన వచ్చింది.. ఇంటికెళ్లిన వెంటనే ఆ పనిలో పడ్డా. అచ్చం అదే నమూనాలో కేక్‌ తయారుచేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నా ఐడియా చాలామందికి నచ్చింది. ఈ క్రమంలోనే వాళ్లూ తమకు ఫలానా విధంగా కేక్‌ కావాలంటూ అడిగేవారు. అలా సందర్భాన్ని, థీమ్‌ను బట్టి.. ప్రేమ కథలు, పెళ్లి జ్ఞాపకాలు, పండగ ప్రాశస్త్యాలు.. తదితర నేపథ్యాలతో కూడిన కేక్స్‌ తయారుచేసి అందించడం మొదలుపెట్టా. ఇప్పటికీ మేం తయారుచేస్తోన్న ప్రతి కేక్‌ వెనుకా ఓ కథ దాగుంటుంది!’ అంటున్నారీ బేకింగ్‌ క్వీన్‌.

బేకింగ్‌ పాఠాలూ!

పుట్టినరోజు, పెళ్లి రోజు, పండగలు, షష్టి పూర్తి, సీమంతం, జలపాతాల థీమ్‌, గ్రాడ్యుయేషన్‌ పార్టీ, ప్రేమికుల కోసం.. ఇలా ప్రతి ప్రత్యేక సందర్భాన్ని ఆకర్షణీయమైన, నోరూరించే కేక్‌గా మలుస్తోన్న గౌరి.. తనకున్న ఈ క్రియేటివిటీతోనే బేకింగ్‌ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.. ముంబయిలోనే ప్రముఖ కేక్‌ మేకర్‌గా, బేకింగ్‌ నిపుణురాలిగా పేరు తెచ్చుకున్నారు. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా గాల్లో వేలాడేలా ‘ఫ్లోటింగ్‌ కేక్స్‌’, ‘స్కల్పర్చ్‌డ్‌ కేక్స్‌’.. వంటివి తయారుచేయడం గౌరి ప్రత్యేకత. కేక్స్‌తో పాటు కుకీస్‌, మ్యాకరోనీ కుకీస్‌ కూడా తయారుచేస్తోన్న ఆమె.. తన బేకింగ్‌ ఉత్పత్తుల్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికలుగా విక్రయిస్తున్నారు. అంతేకాదు.. తనలో ఉన్న బేకింగ్‌ నైపుణ్యాలు, కేక్‌ ఆర్ట్‌కు సంబంధించిన మెలకువల్ని ఔత్సాహికులకు నేర్పిస్తూ బేకింగ్‌ టీచర్‌గానూ మారిపోయారు గౌరి. ఇందుకోసం ప్రత్యేక తరగతులు, వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారామె.

‘వృత్తిరీత్యా డెంటిస్ట్‌గా రాణిస్తోన్న నేను.. బేకింగ్‌ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నానంటే నమ్మలేకపోతున్నా. ఇదంతా మా కుటుంబ సభ్యులు, నా భర్త ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. మనకు ఒక అంశంపై ఆసక్తి ఉందంటే.. దానిపై పూర్తి దృష్టి పెట్టాలి. అప్పుడే మనమేంటో నిరూపించుకోగలుగుతాం..’ అంటోన్న గౌరి.. ప్రస్తుతం డెంటల్‌ సర్జన్‌గా, కేక్‌ మేకర్‌గా, అమ్మగా.. ఇలా తన ప్రతి బాధ్యతనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని