Published : 18/11/2022 21:07 IST

చలికాలంలో స్నానం ఇలా..!

చలికాలంలో శరీరాన్ని స్వెటర్లు, క్యాప్‌లతో కప్పేసినా చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పెదాలు, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

⚜ ఎలాంటి రసాయనాలు లేకుండా సహజమైన పదార్థాలతో తయారు చేసే ఆర్గానిక్ సోప్‌ని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి.

⚜ అలాగే గోరు వెచ్చటి నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

⚜ స్నానం పూర్తయిన తర్వాత టవల్‌తో చర్మాన్ని మృదువుగా తుడవాలి. అదే పనిగా గట్టిగా రుద్దితే చర్మం పాడైపోతుంది.

⚜ ఆ తర్వాత శరీరాన్ని మాయిశ్చరైజ్‌ చేయాలి. ఇందుకోసం స్వచ్ఛమైన పాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో మృదువైన మస్లిన్‌ వస్త్రాన్ని తీసుకుని పాలలో ముంచి దానిని చర్మంపై మెల్లగా అద్దాలి. ఆ తర్వాత సుమారు 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

ఉసిరితో శిరోజాల సంరక్షణ!

చలికాలంలో కేవలం చర్మానికే కాదు... జుట్టుకూ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో కింది చిట్కా పాటించాలి.

⚜ ఆరు ఉసిరి కాయలు, కప్పు పాలు తీసుకుని బాగా మరిగించాలి. ఉసిరి మెత్తగా అయిన తర్వాత గింజలు తీసేసి ముద్దలా చేసుకోవాలి. ఈ గుజ్జును జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను పాటిస్తే షాంపూ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే పుల్లటి ఉసిరి జుట్టులో ఉండే ధూళి కణాలను పూర్తిగా శుభ్రం చేస్తుంది. అంతేకాదు జుట్టు కొత్త మెరుపుని సంతరించుకుంటుంది. వారానికి కనీసం రెండు సార్లు ఈ ఉసిరి ప్యాక్‌ను జుట్టు కుదుళ్లకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

చుండ్రుకు చెక్!

చలికాలంలో విరివిగా లభించే వాటిలో ఉసిరి కూడా ఒకటి. ఇందులో విటమిన్‌-సి, ఈ, ట్యానిన్స్, ఫాస్ఫరస్, ఐరన్‌, క్యాల్షియం, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు... తదితర పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇందులోని విటమిన్‌-ఈ జుట్టు పెరుగుదలకు సహకరిస్తే, విటమిన్‌-సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. తద్వారా చుండ్రు లాంటి సమస్యలు తగ్గిపోయి జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని