Published : 09/02/2023 19:21 IST

చెక్కిళ్లు మెరవాలంటే..!

చాలామంది మేకప్ చేసుకునేటప్పుడు చెక్కిళ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అయితే మేకప్‌తో కాకుండా సహజసిద్ధంగా కూడా అందమైన చెక్కిళ్లను పొందచ్చు. చెక్కిళ్లు సహజసిద్ధంగా మెరవాలంటే కేవలం కొన్ని చిట్కాలను పాటించడం మాత్రమే కాదు. వ్యాయామాలు, ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు- చేర్పులు చేసుకోవాలి. అప్పుడే సత్ఫలితాలు పొందే వీలు ఉంటుంది.

బీట్‌రూట్‌తో..

బీట్‌రూట్‌ను చిన్నగా తరిగి దాని నుంచి రసం తీసుకోవాలి. అందులో కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్త్లె చేసుకోవాలి. తర్వాత మృదువుగా మర్దన చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సహజసిద్ధంగా మంచి రంగుని సంతరించుకొంటుంది. అలాగే చెక్కిళ్లు కూడా గులాబీలా మెరుస్తాయి.

అరటితో..

బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పూర్తిగా ఆరేవరకు ఉంచుకోవాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్న నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటిపండు చర్మానికి సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది.

నిమ్మ, కీరాదోస రసంతో..

నిమ్మరసం, కీరాదోస రసం కొద్దికొద్దిగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా తేనె, పాలు కూడా కలిపి ముఖానికి అప్త్లె చేసుకోవాలి. కాసేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకుంటే చెక్కిళ్లు కెంపుల్లా మెరుస్తాయి.

ఫ్రూట్ ప్యాక్స్‌తో..

సాధారణంగా ఫేషియల్ చేసుకొన్నప్పుడు లేదా చర్మం ప్రకాశించడానికి వివిధ ఫేస్‌ప్యాక్స్ వేసుకొంటూ ఉంటారు. అయితే ఇందుకు ఉపయోగించే ఫ్రూట్‌ప్యాక్స్‌లో ఎరుపు రంగులో ఉన్న పండ్లను ఎక్కువగా ఉపయోగిస్తే చెక్కిళ్లను సహజసిద్ధంగా ఎరుపెక్కించవచ్చు.

టొమాటోలతో..

టొమాటోలు సహజసిద్ధంగా చర్మాన్ని ప్రకాశింపజేయడంలో ముందుంటాయి. ఈ క్రమంలో బుగ్గలు కూడా ఎర్రగా మారేలా చేయడంలో ఇవి బాగా ఉపకరిస్తాయి. దీనికోసం 2 టొమాటోలు తీసుకుని గుజ్జులా చేసి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు, తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని మృదువుగా మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల తప్పకుండా మంచి ఫలితం కనిపించే అవకాశాలుంటాయి.

ఈ జాగ్రత్తలు కూడా..

రోజూ తగినంత నీరు తప్పకుండా తాగాలి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే చర్మంలో తేమని అధిక సమయం నిలిపి ఉంచుతాయి.

శరీరంలో ప్రతి భాగానికి రక్తప్రసరణ సక్రమంగా సాగడానికి ఉపకరించే వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి.

తీసుకొనే ఆహారంలో కెరోటిన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా మొలకలు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పాల ఉత్పత్తులు కూడా ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

అప్పుడప్పుడు చెక్కిళ్లపై చేతివేళ్లతో సున్నితంగా వృత్తాకారంలో మృదువుగా మర్దన చేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని