Published : 11/08/2022 16:39 IST

Raksha Bandhan: అదే ఈ తోబుట్టువుల ప్రత్యేకత!

తోబుట్టువులంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయతల్ని పంచుకోవడమే కాదు.. అవసరమైతే బాధ్యతల్లో భాగస్వాములై, ఒకే కెరీర్‌లో కూడా కొనసాగొచ్చని నిరూపించారు కొందరు సెలబ్రిటీలు. వీరిలో కొందరు నటీనటులుగా పేరు సంపాదిస్తే.. మరికొందరు దర్శకనిర్మాతలుగా పోటీ పడుతున్నారు.. ఇంకొందరు వ్యాపారంలో భాగస్వాములై సత్తా చాటుతున్నారు. అక్క స్ఫూర్తితో ముందుకు సాగుతోన్న తమ్ముళ్లు కొందరైతే.. అన్నను ఆదర్శంగా తీసుకొని సక్సెసైన చెల్లెళ్లూ మరికొందరున్నారు. మరి, అనుబంధంతో పాటు కెరీర్‌నూ పంచుకున్న ఆ తోబుట్టువులెవరు? వారి ప్రత్యేకతేంటో ఈ ‘రాఖీ పండగ’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

వరుణ్‌-నిహారిక

మెగా వారసులు వరుణ్ తేజ్, ఆయన చెల్లెలు నిహారిక.. ఈ సెలబ్రిటీ తోబుట్టువుల్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమ నటప్రతిభతో వెండితెరపై తమదైన ముద్ర వేశారీ ఇద్దరూ. ‘ముకుంద’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల లిస్టులో చేరాడు. కథా ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ తన మార్క్‌ని ప్రదర్శిస్తున్నాడు. ఇక వరుణ్ చెల్లెలు నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకున్న ఈ మెగా ప్రిన్సెస్‌.. ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి పెడుతూనే.. మరోవైపు వైవాహిక జీవితాన్నీ ఆస్వాదిస్తోంది.

రామ్‌చరణ్‌-సుస్మిత

స్టార్‌ నటుడిగానే కాదు.. నిర్మాతగానూ తానేంటో నిరూపించుకున్నాడు రామ్‌ చరణ్‌. ఈ ఏడాది విడుదలైన ‘RRR’ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడీ మెగా హీరో. ఇక అతడి సోదరి సుస్మిత కూడా సినిమా పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఎంతో అనుభవమున్న ఆమె.. ‘ఖైదీ నం.150’, ‘రంగస్థలం’, ‘సైరా’, ‘ఆచార్య’.. తదితర సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. అంతేకాదు సోదరుడు రామ్‌చరణ్ బాటలో పయనిస్తూ సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది సుస్మిత. తన భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించిన ఆమె.. తొలి ప్రయత్నంగా ‘షూట్‌ అవుట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించింది. గతేడాది ‘శ్రీదేవి-శోభన్‌ బాబు’ అనే మరో సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఈ కొణిదెల వారి ఆడపడుచు.. అందులో ఓ ముఖ్య పాత్రలో నటించింది కూడా!

నితిన్‌-నిఖిత

తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తోన్న అక్కాతమ్ముళ్లలో నితిన్, నిఖిత కూడా ఒకరు. ‘జయం’తో వెండితెరకు పరిచయమైన నితిన్‌.. ‘దిల్‌’, ‘సై’, ‘ఇష్క్‌’, ‘అ ఆ’.. వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక నితిన్ అక్క నిఖితారెడ్డి కూడా టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా కొనసాగుతోంది. నితిన్ హీరోగా నటించిన ‘ఇష్క్’, ‘చిన్నదాన నీకోసం’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘అఖిల్’.. వంటి చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది నిఖిత.

మహేశ్‌-మంజుల

సూపర్‌స్టార్‌ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్‌ టాప్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ‘ప్రిన్స్‌’ మహేశ్‌ బాబు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించిన అతడు.. వరుసగా బ్లాక్‌బస్టర్లు అందుకున్నాడు. ఈ ఏడాది ‘సర్కారి వారి పాట’తో సందడి చేసిన ప్రిన్స్‌ చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. ఇలా హీరోగానే కాకుండా నిర్మాతగానూ సక్సెసైన ఈ హ్యాండ్సమ్‌ ఖాతాలో 8 నంది అవార్డులున్నాయి. ఇక మహేశ్‌ అక్క మంజుల ‘షో’ సినిమాతో ఇటు నటిగా, నిర్మాతగా ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకే జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘కావ్యాస్‌ డైరీ’, ‘ఆరెంజ్‌’, ‘సేవకుడు’ వంటి చిత్రాల్లో నటించడమే కాకుండా ‘పోకిరి’, ‘ఏమాయ చేసావే’ వంటి హిట్‌ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. 2018లో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాతో డైరెక్టర్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 

మంచు విష్ణు, మనోజ్‌ - లక్ష్మీ ప్రసన్న

టాలీవుడ్‌లో ‘మంచు’ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. మోహన్‌బాబు వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్‌లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా కొనసాగిస్తోంది. విష్ణు, మనోజ్‌లు హీరోలుగా రాణిస్తుంటే.. లక్ష్మి నటిగా, గాయనిగా, నిర్మాతగా, యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోంది. ‘అనగనగా ఓ ధీరుడు’, ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’, ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక గతేడాది ‘పిట్టకథలు’ వెబ్‌సిరీస్‌లో ‘స్వరూపక్క’ పాత్రతో మరోసారి ఆకట్టుకుందీ మంచు వారి ఆడపడుచు.

సుమంత్‌-సుప్రియ

‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్‌’, ‘మళ్లీ రావా’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు అక్కినేని సుమంత్‌. ఆశించినన్ని విజయాలు రాకపోయినా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటాడని ఈ హీరోకు పేరుంది. ఇక సుమంత్‌ సోదరి సుప్రియ చిన్నతనంలోనే తాత అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘రావుగారిల్లు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2018లో విడుదలైన ‘గూఢచారి’ సినిమాలో ప్రతినాయకురాలి పాత్రలోనూ ఆకట్టుకుంది. గతేడాది మన ముందుకొచ్చిన ‘అనుభవించు రాజా’ చిత్రంలోనూ నటించింది. అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించిందీ అక్కినేని వారి ఆడపడుచు.

సైఫ్‌-సోహా

ఇక బాలీవుడ్ విషయానికొస్తే- వెండితెర వేదికగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన తోబుట్టువుల్లో సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్ జంట కూడా ఒకటి. వీరిద్దరూ పటౌడీ వంశానికి చెందిన మన్సూర్ అలీఖాన్, షర్మిలా ఠాగూర్ దంపతుల వారసులు. వీరిలో సైఫ్ ప్రస్తుతం హీరోగా, దర్శకనిర్మాతగా రాణిస్తున్నాడు. ఇక చెల్లెలు సోహా.. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా బెంగాలీ, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందింది. మరోవైపు రచయిత్రిగానూ తనదైన ముద్ర వేసింది. 2017లో ‘ది పెరిల్స్‌ ఆఫ్‌ బీయింగ్‌ మోడరేట్‌లీ ఫేమస్‌’ అనే పుస్తకం రాసిన సోహా.. ఇటీవలే తన భర్త కునాల్‌తో కలిసి ‘ఇన్ని అండ్‌ బోబో ఫైండ్‌ ఈచ్‌ అదర్‌’ అనే పిల్లల పుస్తకాన్ని రాసి విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జంటకు నాలుగేళ్ల ఇనాయా అనే కూతురు ఉంది.

సోనమ్‌-హర్షవర్ధన్

నటిగా, ఫ్యాషనిస్టాగా పేరు తెచ్చుకుంది సొగసరి సోనమ్‌ కపూర్‌. ‘నీర్జా’, ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘సంజూ’.. వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన ఈ కపూర్‌ బ్యూటీ.. పలు మ్యూజిక్‌ వీడియోలతోనూ మెప్పించింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని సినీరంగంలో అడుగుపెట్టాడు ఆమె తమ్ముడు హర్షవర్ధన్ కపూర్. పలు సినిమాల్లో నటించిన ఆయన.. మరికొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, సునీతా కపూర్ దంపతుల పిల్లలే వీరు.

అనుష్కా శర్మ-కర్నేష్‌ శర్మ

నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ అందరికీ సుపరిచితురాలే! ఆమె తమ్ముడు కర్నేష్‌ శర్మ కూడా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఈ అన్నాచెల్లెళ్లిద్దరూ కలిసి ‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ వేదికగా ‘ఎన్‌హెచ్‌ 10’, ‘ఫిల్లౌరీ’, ‘పరి’.. వంటి చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఈ ఏడాది అనుష్క ఈ సంస్థ నుంచి తప్పుకుంది. దీంతో త్వరలోనే ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మారనుందని చెప్పుకొచ్చారు కర్నేష్‌.

ప్రియాంక చోప్రా-సిద్ధార్థ్‌ చోప్రా

బాలీవుడ్‌, హాలీవుడ్‌లో సత్తా చాటిన ప్రియాంక.. 2015లో ‘పర్పుల్‌ పెబుల్ పిక్చర్స్‌’ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం తాను, తన తల్లి ఈ సంస్థ వ్యవహారాలు చూసుకుంటున్నారు. కాగా, పీసీ తమ్ముడు సిద్ధార్థ్‌ కపూర్‌ ఈ చిత్ర నిర్మాణ సంస్థకు మేనేజర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు పాకశాస్త్రంపై మక్కువతో దానికి సంబంధించిన కోర్సు చేసిన సిద్ధార్థ్‌కి ప్రస్తుతం పుణేలో ఓ రెస్టరంట్‌ ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని