Published : 27/11/2022 14:11 IST

వంట త్వరగా పూర్తవ్వాలంటే..!

రోజూ చేసే పనే అయినా.. వంట అనగానే నీరసించి పోతాం. ‘ఏది తప్పినా ఇది మాత్రం తప్పదు!’ అంటూ అసహనానికి గురయ్యే వారూ లేకపోలేదు. అయితే అదో పెద్ద పనిలా భావించకుండా వంట త్వరగా పూర్తి కావాలంటే కొన్ని ప్రాథమిక కిటుకులు తెలిసుండాలంటున్నారు నిపుణులు. తద్వారా సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గి కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుంది. మరి, ఇంతకీ ఆ కిటుకులేంటో తెలుసా?

⚛ చపాతీలు అప్పటికప్పుడు చేసుకోవాలంటే పెద్ద పని. అదే మరుసటి రోజుకు సరిపడా చేసుకుందామంటే చల్లారిపోయి తినాలనిపించదు.. పైగా గట్టిపడతాయి కూడా! పోనీ పిండైనా తడిపి పెట్టుకుందామనుకుంటే అది నల్లబడుతుంది. ఇలాంటప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో సెమీ-కుక్‌డ్‌ రోటీస్‌ తయారుచేసి పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. చపాతీ తయారుచేసుకొని పూర్తిగా కాల్చకుండా ఇరువైపులా పది సెకన్ల పాటు కాల్చుకొని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవాలి. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్తిగా కాల్చుకొని వేడివేడిగా లాగించేయచ్చు. ఒకవేళ వీటిని ఫ్రిజ్‌లో పెట్టినా గది ఉష్ణోగ్రతకు వచ్చాకే కాల్చుకోవడం మంచిది.

⚛ కొత్తిమీర, పుదీనా, మెంతి.. వంటివి కట్‌ చేసుకొని పెట్టుకునే సమయం ఉండచ్చు.. ఉండకపోవచ్చు! ఇలాంటప్పుడు.. మట్టి ఉన్నంత వరకు వాటి కాడలు కట్‌ చేసి.. ఓ గ్లాస్‌ నీటిలో ఆ కాడలు మునిగేలా ఉంచి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. లేదంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెర్బ్‌ సేవర్స్‌ని కూడా వినియోగించుకోవచ్చు. తద్వారా అవి కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి.. ఎప్పుడంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత కూరల్లో తరిగి వేసుకుంటే సరి!

⚛ కొన్ని వంటకాల్ని తయారుచేసే క్రమంలో టొమాటోపై ఉండే తొక్క తొలగిస్తుంటాం. ఈ పని ఈజీగా పూర్తవ్వాలంటే టొమాటోల్ని ముందు పావుగంట పాటు మరిగే నీళ్లలో వేసి.. ఆ తర్వాత ఐస్‌ నీళ్లలో పూర్తిగా చల్లారేంత వరకు వేసి ఉంచితే సరిపోతుంది.

⚛ జ్యూసులు, స్మూతీస్‌ చేసుకోవాలనుకున్న ప్రతిసారీ పండ్లను ముక్కలుగా కట్‌ చేసుకోవడం కుదరకపోవచ్చు. అందుకే ముందే ఏ పండుకా పండు ముక్కలు చేసుకొని .. వాటిని సెపరేట్‌గా ఫుడ్‌ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌/ఫ్రీజర్‌లో పెట్టేయాలి. అవసరమున్నప్పుడు తాజాగా ఉపయోగించుకోవచ్చు.

⚛ మాంసంతో చేసే కొన్ని రకాల వంటకాల కోసం వాటిని సన్నటి స్లైసుల్లా చేసుకోవడం సహజమే! ఈ క్రమంలో ఇవి జారిపోకుండా, చక్కగా కట్‌ కావాలంటే వాటిని ఓ అరగంట పాటు ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుంది.

⚛ కాస్త ఎక్కువ సేపు ఉడికిన గుడ్లపై పెంకులు తొలగించడం కష్టమే! అలాంటప్పుడు గుడ్లను ఉడికించేటప్పుడే ఆ నీటిలో కొద్దిగా బేకింగ్‌ సోడా లేదంటే వెనిగర్‌ వేస్తే పెంకులు తీయడం సులువవుతుంది.

⚛ వారానికి లేదంటే మూడు రోజులకు సరిపడా దోసె/ఇడ్లీ పిండి తయారుచేసుకొని ఫ్రిజ్‌లో పెట్టుకుంటాం. అయితే ఈ మొత్తం పిండిలో ఉప్పు కలపకుండానే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే అది తాజాగా ఉంటుంది. రోజూ కావాల్సినంత పిండి తీసుకొని తగినంత ఉప్పు/ఇతర పదార్థాలు కలుపుకొని ఉపయోగించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని