Published : 08/04/2023 17:50 IST

పీసీఓఎస్‌ వల్ల దంత సమస్యలొస్తాయా?

నా వయసు 28. నాకు పీసీఓఎస్‌ సమస్య ఉంది. కొంతకాలం నుంచి నా దవడల్లో నొప్పి, వాపు ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల దంత సమస్యలు వస్తాయా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు పీసీఓఎస్‌ సమస్య ఉందని అంటున్నారు. దీనివల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి హార్మోన్ల స్థాయుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడంతో పాటు పలు అనారోగ్యాలూ చుట్టుముడతాయి. అలాగే ఈ రెండు హార్మోన్లు నోటి సంరక్షణలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత వల్ల చిగుళ్లలో వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా చిగుళ్ల సమస్యలు వస్తాయి. పీసీఓఎస్‌ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్‌’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయి. కాబట్టి ఈ హార్మోన్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. వారు తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారు.

హార్మోన్లలో ఒక్కసారి మార్పులు వచ్చాయంటే చిగుళ్ల సమస్యలు కూడా క్రమంగా పెరుగుతుంటాయి. ఈ సమస్య ఎక్కువగా గర్భిణులు, రుతుక్రమం మొదలైన అమ్మాయిల్లో కనిపిస్తుంటుంది. మీకు చిగుళ్ల సమస్య ఇప్పటికే ఉంది.. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్రష్‌ చేసుకోవడం, మౌత్‌వాష్‌ ఉపయోగించడం, ఆరు నెలలకోసారి దంత వైద్యులను సంప్రదించడం.. వంటివి చేయాలి. మీరు దవడల్లో నొప్పి, వాపు ఉందని అంటున్నారు. అంటే మీకు ఇన్ఫెక్షన్‌ ఉందని అర్థమవుతోంది. కాబట్టి ఒకవైపు ఇన్ఫెక్షన్‌కు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు పీసీఓఎస్‌కు సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తే సత్వర ఫలితం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని