Published : 12/10/2022 17:33 IST

పిల్లల్లో సైన్స్‌పై మక్కువ పెంచండిలా..!

పిల్లలు సహజంగానే శాస్త్రవేత్తలు. వారికి కొత్తగా ఏదైనా కనిపిస్తే చాలు.. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. కానీ, తరగతి గది దగ్గరకు వచ్చేసరికి కొంతమంది పిల్లలకు సైన్స్‌ అంటే ఆసక్తి ఉండదు. కానీ, నిజ జీవితంలో ఎన్నో రకాలుగా సైన్స్‌ నిక్షిప్తమై ఉంటుంది. కిచెన్‌లో కెమిస్ట్రీ, బాడీలో బయాలజీ, ప్రకృతిలో ఫిజిక్స్‌ కలగలిపి ఉంటాయి. వీటిగురించి క్షుణ్ణంగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. సైన్స్‌ గురించి తెలుసుకోవడం వల్ల వ్యక్తిగతంగానూ పలు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లల్లో సైన్స్‌పై మక్కువ పెంచాలంటే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా...

వంటగదిలో..

ఉపయోగించుకోవాలే కానీ, వంట గదే ఒక పరిశోధనశాల అంటున్నారు నిపుణులు. కిచెన్‌లో ఉండే వస్తువులతో పలు రకాల ప్రయోగాలు చేయచ్చంటున్నారు. బేకింగ్‌ సోడాతో అగ్నిపర్వతం పేలినట్లు చేయడం.. చక్కెర, ఫుడ్‌ కలర్స్‌ ఉపయోగించి గ్లాసులోనే ఇంద్రధనస్సు సృష్టించడం, బాటిల్‌లో మేఘాలు వచ్చేలా చేయడం.. ఇలా రకరకాల ప్రయోగాలను కిచెన్లో లభించే వస్తువులతోనే చేయచ్చు. దీనికంటే ముందు తల్లిదండ్రులుగా వీటి గురించి మీరు తెలుసుకొని పిల్లలకు నేర్పించాలంటున్నారు. ఇలా చేయడం వల్ల వారికి సైన్స్‌పై మరింత మక్కువ కలిగే అవకాశం ఉంటుందంటున్నారు.

ఆ కేంద్రాలకు తీసుకెళ్లండి...

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కాలక్షేపానికి సినిమాలకు తీసుకెళ్తుంటారు. అయితే వినోదం అందించాలంటే అదొక్కటే మార్గం కాదు. దీనికి బదులుగా సైన్స్‌ మ్యూజియం, జూ పార్క్‌, అక్వేరియం, ప్లానెటేరియం.. వంటి వాటికి తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల వారికి కొత్త అనుభవం కలగడంతో పాటు సైన్స్‌పై కూడా ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

మైక్రోస్కోప్, టెలిస్కోప్..

పిల్లల ఆనందం కోసం వివిధ రకాల బొమ్మలు, వస్తువులను కొనిస్తుంటాం. అయితే వీటికి బదులుగా మైక్రోస్కోప్‌, టెలిస్కోప్‌ వంటి పరికరాలను కొనివ్వడం మంచిదంటున్నారు నిపుణులు. వీటిద్వారా ఆయా అంశాలకు సంబంధించి మరింత అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. మైక్రోస్కోప్‌తో బయాలజీకి సంబంధించిన విషయాలు.. టెలిస్కోప్‌తో నక్షత్రాలు, గ్రహాలు వంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. వీటి ద్వారా సహజంగానే తరగతి గదిలో చెప్పే సైన్స్‌పై మక్కువ కలుగుతుంటుంది. వారికి వచ్చిన సందేహాలను వీటి ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. అయితే ఇలాంటివి కొనడమంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని చాలామంది అనుకుంటారు. అది వాస్తవమే అయినప్పటికీ పిల్లలు ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండేవి తక్కువ ఖర్చులో కూడా లభిస్తుంటాయి.

వీటిని చూపించండి...

అప్పుడప్పుడు పిల్లలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో సైన్స్‌ ఎగ్జిబిషన్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఎగ్జిబిషన్లకు పిల్లలను తీసుకెళ్లడం ద్వారా కూడా వారిలో సైన్స్‌పై ఆసక్తి, మక్కువ కలిగించచ్చు. అలాగే సైన్స్‌కు సంబంధించిన వివిధ డాక్యుమెంటరీలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిలో పలు అంశాల గురించి క్లుప్తంగా, ఆసక్తికరంగా వివరిస్తుంటారు. వీటిని చూపించడం ద్వారా కూడా సైన్స్‌పై ఇష్టం కలిగించవచ్చు.

మీరు కూడా..

పిల్లలకు కొత్త విషయాలు నేర్పించాలంటే అంతకంటే ముందు మీరు కూడా ఆ అంశాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే వారికి అర్థమయ్యేట్లు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే పిల్లల్లో సైన్స్‌పై మక్కువ కల్పించడానికి ఆ సబ్జెక్టుపై ప్రశ్నలు అడిగేలా వారిని ప్రోత్సహించాలి. ఎప్పటికప్పుడు వారి సందేహాలను నివృత్తి చేయాలి. ఒకవేళ వారి ప్రశ్నలకు మీక్కూడా సమాధానాలు తెలియకపోతే ఆన్‌లైన్‌లో శోధించచ్చు. ఇలా కొత్త విషయాలను పిల్లలకు చెప్పడం, తరచూ వారితో మాట్లాడడం వల్ల చదువులో రాణించడంతో పాటు.. వారి సమస్యలను మీతో పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా పిల్లలతో మీ బంధం మరింత దృఢమవుతుంది.

ప్రయోజనాలు...

సైన్స్‌ అంటే కేవలం ఓ సబ్జెక్టు మాత్రమే కాదు.. దీనిని నేర్చుకోవడం వల్ల సమస్యలు పరిష్కరించుకునే నైపుణ్యాలతో పాటు వినూత్నంగా ఆలోచించే అవకాశం కూడా కలుగుతుంది. అలాగే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, పరిశోధనా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం కూడా సైన్స్‌ వల్ల కలిగే అదనపు ప్రయోజనాలే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని