Published : 12/12/2022 21:25 IST

నీది-నాది కాదు.. మనది!

సంసారమన్నాక మనస్పర్థలు, గొడవలు సహజమే! అయితే దంపతుల్లో ఎవరో ఒకరు రాజీపడి వీటిని సద్దుమణిగేలా చేస్తేనే కాపురం సజావుగా ముందుకు సాగుతుంది. కానీ ఇలా అర్థం చేసుకునే తత్వమున్న దంపతులు ఈ కాలంలో చాలా అరుదుగానే కనిపిస్తున్నారంటున్నారు నిపుణులు. ఇందుకు ఆర్థిక స్వాతంత్ర్యం, అసూయాద్వేషాలు, పురుషాధిపత్యం.. వంటివెన్నో కారణాలు కావచ్చు! అయితే వీటి కారణంగా ఇద్దరి మధ్య పలు విషయాల్లో వచ్చే చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనుబంధాన్ని తెగే దాకా లాగుతున్నాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి, ఇలా జరగకూడదంటే ఈ కాలపు దంపతులు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

ఓ మెట్టు దిగండి!

వివాహ బంధమంటే ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకున్నది. పెళ్లి కాక ముందు వరకు ఎలా ఉన్నా.. పెళ్లయ్యాక మాత్రం దంపతులిద్దరూ ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం తప్పనిసరి! అయితే ఈ కాలపు దంపతుల్లో ఇది కొరవడుతోందని చెబుతున్నారు నిపుణులు. ఒకరి మాటలు-అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించకపోవడం, పరిణతితో ఆలోచించలేకపోవడం.. వంటివే ఇద్దరి మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. అయితే వీటిని ఇలాగే వదిలేస్తే అనుబంధానికే ముప్పు వాటిల్లచ్చు. కాబట్టి ఇలాంటి కలతల్ని దూరం చేసుకోవాలంటే.. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే సాధ్యమవుతుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరిలో ఒకరు కాస్త మొండిగా ఉన్నా.. మరొకరు ఓ మెట్టు దిగితే తప్పు లేదు. ఫలితంగా గొడవలూ సద్దుమణుగుతాయి.. ఎదుటివారూ మీ ఓపికను అర్థం చేసుకొని వారి ప్రవర్తననూ క్రమంగా మార్చుకునే అవకాశాలుంటాయి.

ఇద్దరిదీ!

ఈతరం దంపతుల్లో భేదాభిప్రాయాలు రావడానికి ముఖ్య కారణమేదైనా ఉంది అంటే అది డబ్బే అంటున్నారు నిపుణులు. ఇద్దరూ రెండు చేతులా సంపాదించడం, ఆర్థికంగా ఒకరిపై ఒకరు ఆధారపడకపోవడం, పొదుపు-మదుపు విషయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకోవడం వల్ల.. ఇద్దరి మధ్య దూరం అగాథంలా పెరిగిపోతోంది. ఒకానొక దశలో ఇది బయటపడి.. తెగతెంపుల దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే భార్యాభర్తలిద్దరూ ఎవరెంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పొదుపు చేసినా.. దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకోవడం అత్యుత్తమం అంటున్నారు నిపుణులు. అలాగే ఆస్తులు కొన్నా, రుణాలు చెల్లించినా.. కలిసే పెట్టుబడి పెట్టడం వల్ల ఇద్దరూ బాధ్యతాయుతంగా వ్యవహరించే అవకాశముంటుంది. ఈ కలుపుగోలుతనమే ఆలుమగలిద్దరినీ శాశ్వతంగా కలిపి ఉంచుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని