Published : 24/10/2022 12:30 IST

స్ట్రెచ్‌మార్క్స్ పోవాలంటే..

ప్రసవానంతరం చాలామంది స్త్రీలు ఎక్కువగా ఎదుర్కొనే అతి సాధారణ సమస్య - స్ట్రెచ్‌మార్క్స్. అలాగని కేవలం డెలివరీ అయిన వాళ్లకే ఈ సమస్య ఎదురవుతుందనుకోవడం పొరపాటు. ఎందుకంటే బరువులో హెచ్చుతగ్గులు, పని ఒత్తిడి వల్ల కూడా చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ వస్తుంటాయి. ఒక్కోసారి వీటి వల్ల నచ్చినట్లు డ్రస్సింగ్ కూడా చేసుకోలేం. అయితే ఈ సమస్యకి ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే సులువైన పరిష్కారాలు లభిస్తాయంటున్నారు నిపుణులు.

బరువు పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు చర్మం సాగడం సహజం. అలా సాగిన చర్మం తిరిగి యథాస్థితికి వచ్చే క్రమంలో చారల్లా కనిపిస్తూ ఉంటాయి. వాటినే స్ట్రెచ్‌మార్క్స్ అంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, గర్భం ధరించినా బరువు పెరగడం మామూలే. అందుకే ఇలాంటి సమస్య ఎక్కువగా మహిళలకే ఎదురవుతూ ఉంటుంది. వైద్యులు సూచించిన మందులు, క్రీంలతో పాటు ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ సమస్య తొందరగా తగ్గుముఖం పట్టడానికి అవకాశాలుంటాయి.

బంగాళాదుంప రసంతో..

ఒక బంగాళాదుంపని తీసుకుని కాస్త పెద్దసైజులో ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత ఆ ముక్కలతో స్ట్రెచ్‌మార్క్స్ ఉన్న చోట 10 నిమిషాల పాటు రుద్దాలి. కాసేపు ఆరనిచ్చి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంగాళాదుంప రసంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మకణాల ఎదుగుదలను ప్రేరేపించి పూర్వపు స్థితికి రావడానికి తోడ్పడతాయి.

రోజూ మాయిశ్చరైజర్..

రోజూ మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం సాగే గుణాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల బరువు పెరిగినా లేదా తగ్గినా చారలు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువైపోతాయి. అందుకే స్ట్రెచ్‌మార్క్స్ పైన మాయిశ్చరైజర్ రాసుకున్నా ఫలితం ఉంటుంది.

కలబందతో..

కలబంద ఆరోగ్యానికి చాలా మంచిదన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనికున్న ఔషధ గుణాల వల్ల ఇది చర్మ సంబంధిత సమస్యలకు కూడా చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుని స్ట్రెచ్‌మార్క్స్ ఉన్నచోట రాసి అరగంట పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఆముదంతో..

ఇంట్లో మనకు సహజసిద్ధంగా అందుబాటులో ఉండేవి ఆముదం, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్.. మొదలైనవి. వీటిలో ఏదో ఒకటి ఎంచుకుని రోజూ పది నిమిషాల పాటు స్ట్రెచ్‌మార్క్స్ ఉన్నచోట మర్దన చేసుకోవాలి. ఫలితంగా సాగిన చర్మం తిరిగి యథాస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని