Updated : 14/07/2022 19:03 IST

Monsoon Care: చేతులు సరిగా శుభ్రం చేసుకుంటున్నారా?

‘మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అయినా సరే- చాలామంది బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో కడుక్కున్నాంలే అన్నట్లుగా గబగబా చేతులు కడిగేసుకుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా మన అలవాట్లలో, పరిశుభ్రత విషయంలో కొంతవరకు మార్పు వచ్చినా ఇప్పటికీ చాలామంది ఈ విషయంలో ఇంకా అజాగ్రత్తగానే ఉంటున్నారు. ఈ క్రమంలో  వివిధ రకాల వ్యాధులను మోసుకొచ్చే ఈ వర్షాకాలంలో చేతుల శుభ్రత విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఏటా పది లక్షల మంది!

🟍 ఓ అధ్యయనం ప్రకారం.. సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం వల్ల ఏటా పదిలక్షల మంది వివిధ అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోతున్నారట.

🟍 చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెళతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో కుటుంబ సభ్యులు, స్నేహితులను తాకినా వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. చూశారుగా ఒకరి నిర్లక్ష్యం ఎంతమంది అనారోగ్యానికి కారణమవుతుందో!

🟍 ఇక మొబైల్, టీవీ రిమోట్‌, ఇంట్లోని డైనింగ్‌ టేబుల్‌, తలుపులు, కిటికీలపై కూడా వ్యాధికారక క్రిములుంటాయి. ఒక టాయిలెడ్‌ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు.

🟍 చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఒక్క కరోనానే కాదు.. డయేరియా, హెపటైటిస్‌, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సబ్బు, హ్యాండ్‌వాష్‌, శానిటైజర్‌తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ!

🟍 చిన్నారులు, ఇంకా స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యంపై వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల చేతులు శుభ్రంగా లేకపోతే వారికి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

🟍 డయేరియా లాంటి అతిసార వ్యాధుల కారణంగా ఏటా సుమారు 1.5 మిలియన్ల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో ఐదేళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా ఈ వ్యాధులకు బలవుతున్నారు. పిల్లల చేతులు పరిశుభ్రంగా ఉంచడం వల్ల 10 మంది చిన్నారుల్లో కనీసం నలుగురు చిన్నారులను ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

కంటి సమస్యలు

🟍 చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రమాదకర కంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ట్రకోమా లాంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా కూడా చాలామంది శాశ్వతంగా కంటిచూపును కోల్పోతున్నారట.

చూశారుగా! చేతులు శుభ్రం చేసుకోకపోతే ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయో. అందుకే- చేతులు శుభ్రం చేసుకునే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండద్దు. ప్రత్యేకించి ఈ వానా కాలంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. వివిధ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కరోనాతో పాటు ఈ కాలంలో వచ్చే వివిధ వ్యాధులకు కళ్లెం వేయాలంటే చేతులు తరచూ శుభ్రం చేసుకోవడమే సరైన మార్గం.. గుర్తుంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని