Updated : 17/11/2022 22:06 IST

ఈ నొప్పులుంటే ఇలా నిద్రపోవాలట..!

నడుం నొప్పి.. భుజం నొప్పి.. ఇలా ఎన్నో రకాల నొప్పులు మనల్ని ఇబ్బందికి గురిచేస్తుంటాయి. వీటి బారి నుంచి కాపాడుకోవడానికి ప్రత్యేక చికిత్సలు, ఫిజియోథెరపీ వంటివి చేయించుకోవడం లేదా గృహచిట్కాలు పాటించడం వంటివి చేస్తుంటాం. అయితే మనం పడుకొనే విధానాన్ని బట్టి కొన్ని రకాల శారీరక నొప్పులను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. నొప్పులు మాత్రమే కాదు ఇతర ఆరోగ్య సమస్యల నుంచి సైతం ఉపశమనం పొందచ్చంటున్నారు.

నడుం నొప్పి..

ఓ అధ్యయనం ప్రకారం మహిళల్లో నలభై శాతం మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారని తేలింది. అలాగే ఎక్కువ సమయం ఒకే స్థితిలో కూర్చొని ఉండటం, సరైన వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ కలిగించే పనిని ఎక్కువ సమయం చేయాల్సి రావడం కూడా దీనికి కారణం కావచ్చు. ఈ నడుమునొప్పి వల్ల రోజువారీ పనులకు, నిద్రకు దూరమయ్యేవారు సైతం లేకపోలేదు. మరి ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి? నిద్రపోయేటప్పుడు వెన్నుపై భారం పడకుండా చూసుకోవాలి. ముందుగా వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఓ పక్కగా తిరిగి.. రెండు కాళ్ల మధ్యలో దిండు పెట్టుకోవాలి. అలాగే మీ హిప్ పక్కకు వంచినట్లుగా కాకుండా నిటారుగా ఉండేలా చేసుకోవాలి. రోజూ ఇలా నిద్రపోతూ ఉంటే నడుముపై పడుతున్న ఒత్తిడి తగ్గి నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ లోయర్ బ్యాక్‌పెయిన్ వస్తున్నట్లయితే.. వెల్లకిలా పడుకొని మోకాళ్ల కింద తలగడ పెట్టుకోవాలి. అలాగే టవల్‌ను గుండ్రంగా చుట్టి నడుము కింద సపోర్టింగ్‌గా పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం పొందచ్చు.

భుజం నొప్పి..

నిద్రపోయే విషయంలో మహిళల్లో ఎక్కువ శాతం మందికి ఉండే అలవాటు తల కింద చేయిపెట్టుకొని పడుకోవడం. ఇలా నిద్రపోవడం వల్ల భుజం నొప్పి వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. ఇలా పడుకోవడం వల్ల భుజం నుంచి చేతి వేళ్ల వరకు కదలికలను నియంత్రించే వ్యవస్థపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే.. నిద్రపోయే పద్ధతిని మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికోసం భుజం నొప్పిగా లేని పక్కకు తిరిగి రెండు చేతులతో దిండును కౌగిలించుకొని నిద్రపోవాలి. ఒకవేళ మీకు రెండు భుజాలు నొప్పిగా ఉన్నట్లయితే వెల్లకిలా పడుకొని రెండు చేతులను ఫ్రీగా వదిలేయాలి. భుజం నొప్పిగా ఉన్నప్పుడు బోర్లా పడుకోకూడదు.

మెడనొప్పి..

కొన్ని సందర్భాల్లో మెడ పట్టినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కాస్త పక్కకి తిరిగి పడుకొందామంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎలా నిద్రపోవాలో తెలుసా? మెడ కండరాలు, ఎముకలకు సపోర్టు ఇచ్చే విధంగా పడుకోవాలి. దానికోసం తలకింద మెత్తని తలగడ వేసుకొని వెల్లకిలా నిద్రపోవాలి. పక్కకి తిరిగి నిద్రపోవాలనుకొంటే.. టవల్‌ను గుండ్రంగా చుట్టి మెడకింద పెట్టుకోవడం ద్వారా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు గుండ్రంగా చుట్టిన టవల్ మరీ పెద్దదిగా లేకుండా, తలగడకు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

నెలసరి నొప్పి..

నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో పాటు నడుము నొప్పి, పొత్తికడుపు నొప్పి మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్యలే. వీటి నుంచి తప్పించుకోవడానికి చాలామంది పెయిన్‌కిల్లర్స్‌ను ఆశ్రయిస్తుంటారు. లేదా నొప్పి తెలియకుండా ఉంటుందనే ఉద్దేశంతో బోర్లా పడుకొనేవారు సైతం ఉంటారు. ఇలా చేయడం వల్ల గర్భాశయంపై ఒత్తిడి పెరిగి నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశాలూ లేకపోలేదు. అందుకే నెలసరి సమయంలో ఎలా నిద్రపోవాలో అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. దీనికోసం వెల్లకిలా పడుకొని మోకాళ్ల కింద దిండు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముక నిటారుగా అయి క్రమక్రమంగా నొప్పి తగ్గిపోతుంది. ఒకవేళ ఇంకా నొప్పిగా ఉన్నట్టనిపిస్తే.. రెండో తలగడను కూడా వేసుకోవచ్చు.

పిరుదులు నొప్పిగా ఉంటే..

పదిహేను శాతం మంది మహిళల్లో ఇలాంటి సమస్య ఉంటుందంటున్నారు వైద్యులు. దీన్నే ‘రన్నర్స్ హిప్’ అని పిలుస్తూ ఉంటారు. హిప్ జాయింట్ దెబ్బతినడం దీనికి ఒక కారణం కావచ్చు. లేదా ఎక్కువ సమయం కూర్చుని ఉన్నప్పుడు ఒత్తిడి పెరగడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో పిరుదులు నొప్పిగా అనిపించవచ్చు. ఇలాంటప్పుడు పక్కకు తిరిగి పడుకొని మోకాళ్ల మధ్య తలగడ పెట్టుకోవాలి. దీనివల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో వెల్లకిలా లేదా బోర్లా పడుకోకూడదు.

చూశారుగా.. మన శరీరంలో ఏయే భాగాలు నొప్పి పెడుతుంటే ఎలా నిద్రపోవాలో..! అయితే ఈ పద్ధతులు ఉపశమనం కలిగించేవి మాత్రమే. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం తప్పనిసరి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని