Published : 05/09/2021 14:55 IST

ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయిందా?

‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’ అన్నాడో సినీ కవి. శాశ్వతమనుకున్న స్నేహబంధం కూడా అప్పుడప్పుడూ చిక్కుల్లో పడచ్చు.. చినికి చినికి గాలి వానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా రావచ్చు. మరి, అప్పటిదాకా మన అనుకున్న వాళ్లే మన నుంచి దూరమైతే ఆ బాధను తట్టుకోగలమా? వాళ్ల జ్ఞాపకాల నుంచి బయటపడగలమా? అంటే.. అది మా వల్ల కాదనే సమాధానమే వస్తుంది చాలామంది దగ్గర్నుంచి! అలాగని దాన్నే తలచుకుంటూ ఎన్నాళ్లని అక్కడే ఆగిపోతాం..? అందుకే ఆ ఆలోచనల్లోంచి సాధ్యమైనంత త్వరగా బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించమంటున్నారు నిపుణులు. మనల్ని కాదని వెళ్లిపోయిన వారి కోసం బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదంటున్నారు. అసలు ఇంతకీ స్నేహబంధం విడిపోవడానికి కారణాలేంటి? ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

కారణాలివేనా?!

కష్టాల్లోనూ, సుఖాల్లోనూ తోడుండేది స్నేహమే అంటుంటారు. అలాంటి అనుబంధం విడిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు.

* అసూయ.. ఎలాంటి బంధంలోనైనా చిచ్చుపెడుతుందిది. ఒకసారి ఎదుటివారిపై ఆ ఫీలింగ్‌ మొదలైందంటే.. వాళ్లు చేసే ప్రతి పనిలోనూ నెగెటివ్ అంశాలే కనిపిస్తాయి. తప్పు తెలుసుకొని మనసు మార్చుకుంటే సరే సరి.. లేదంటే తెగే దాకా బంధాన్ని వదిలిపెట్టదిది.

* ఎలాంటి అనుబంధంలోనైనా మనస్పర్థలు, గొడవలు సహజం. ఎంత ప్రాణ స్నేహితుల మధ్యైనా అప్పుడప్పుడూ ఇవి వస్తుంటాయి. అయితే కొంతమంది వీటిని తేలిగ్గా తీసుకొని తమ ఫ్రెండ్స్‌తో తిరిగి కలిసిపోతే.. మరికొందరు వీటినే పట్టుకొని వేలాడుతుంటారు. ఇలాంటి ఉడుం పట్టు ఇద్దరి మధ్య అనుబంధాన్ని దూరం చేస్తుందే తప్ప దగ్గర చేయదు.

* స్నేహమంటే ఇద్దరు వ్యక్తులకే పరిమితం కావాలని లేదు.. ఇలా ఎక్కువ మంది స్నేహితులున్నప్పుడు ఒకరితోనే సమయం గడపడం కుదరచ్చు.. కుదరకపోవచ్చు.. ఇలాంటప్పుడు ఎదుటివారిని అపార్థం చేసుకొని విడిపోయేవారూ లేకపోలేదు.

* స్నేహమంటే జీవితంలో ఒక భాగం మాత్రమే! ప్రేమ, పెళ్లి పేరుతో స్నేహితురాలు మీకు దూరమైనంత మాత్రాన ఆమెను అపార్థం చేసుకోవడం, నాతో అంతకుముందులాగా గడపట్లేదని, మాట్లాడట్లేదని అనుకోవడం సరికాదు. ఇది కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది తమ ఫ్రెండ్స్‌ని శాశ్వతంగా దూరం చేసుకుంటుంటారు.

* చాడీలు ఏ అనుబంధాన్నైనా నాశనం చేస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే మూడో వ్యక్తితోనే ఇవి అనుబంధంలో చిచ్చుపెడతాయి. ఒక్కోసారి ఈ మూడో వ్యక్తి కుటుంబ సభ్యులు/తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఈ క్రమంలో మీ గురించి వారికి, వారి గురించి మీకు చెడుగా చెప్పడం, అవి నిజమే అనుకొని నమ్మి చేజేతులా తమ స్నేహాన్ని దూరం చేసుకున్న వారిని ఎంత మందిని చూడలేదు మనం!

* నమ్మకం లేని చోట ప్రేమే కాదు.. స్నేహమూ ఉండదు. కారణమేదైనా ఒకరిపై మరొకరు నమ్మకం కోల్పోయిన మరు క్షణం నుంచే ఇద్దరి మధ్య దూరం పెరగడం మొదలవుతుందంటున్నారు నిపుణులు. ఇది శాశ్వతంగా స్నేహాన్ని దూరం చేయచ్చంటున్నారు.

* మీ స్నేహితుల ప్రాణ స్నేహితులు విడిపోయినా.. దాని ప్రభావం మీ ఫ్రెండ్షిప్‌పై ఉంటుందంటున్నారు నిపుణులు. వాళ్లను కాదని మీ ఫ్రెండ్షిప్‌ను కొనసాగిస్తే వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారోనన్న భావనతో ఈ స్నేహాన్ని వద్దనుకుంటారు మరికొందరు.

 

మనసు మార్చుకోండి!

ఇలా స్నేహబంధం వీగిపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా.. ఆ బాధ నుంచి బయటపడడం అంత సులభం కాదని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగని వాళ్ల గురించే ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్లలేం.. కాబట్టి వీలైనంత త్వరగా ఈ నెగెటివ్‌ ఆలోచనల్ని పక్కన పెట్టి మనసును మీకు నచ్చినట్లుగా మార్చుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుందంటున్నారు.

రియలైజ్‌ అవ్వాలి!

ఎంతసేపూ బాధపడుతూ కూర్చుంటే స్నేహబంధం విడిపోవడానికి అసలు కారణమేంటో గుర్తించలేం. కాబట్టి ఇద్దరూ విడిపోవడానికి తప్పు మీదా? లేదంటే మీ స్నేహితురాలిదా? అన్న విషయం ముందుగా తెలుసుకోవాలి. ఈ క్రమంలో ఒకవేళ తప్పు మీవైపు ఉంటే.. వెళ్లి క్షమాపణ కోరి.. బంధాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఓ పద్ధతి! లేదు.. తప్పు తన వైపు ఉంది.. అయినా మీ నుంచి విడిపోదామనే కోరుకుంటే మాత్రం మీరు బతిమాలాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. ఇదే విషయాన్ని గ్రహించి.. ‘తప్పు తన వైపు పెట్టుకొని నన్నే దోషిని చేస్తున్నప్పుడు నేనెందుకు తన గురించి ఆలోచించాలి..?’ అని మీ మనసుకు చెప్పుకోండి. ఇలా అసలు విషయం గ్రహించిన మరుక్షణం నుంచి మీలో మార్పు మొదలవడం మీరు గుర్తించచ్చు. ఈ మార్పే మీరు పడుతోన్న బాధను దూరం చేసి సంతోషాన్ని మీ దగ్గర చేస్తుంది.

వాటిని డిలీట్‌ చేయండి!

మనసుకు కాస్త బాధ కలిగిన ప్రతిసారీ గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడం సహజం. ఇలాంటప్పుడు చాలామంది చేసే పని.. ఆ జ్ఞాపకాల తాలూకు ఫొటోలు, వీడియోలు చూడడం, సందేశాలు చదవడం..! నిజానికి దీనివల్ల బాధ రెట్టింపవడం తప్ప మరే ప్రయోజనం లేదు. అందుకే వాటిని ఇంకా అట్టే పెట్టుకోకుండా మీ మనసు నుంచి తొలగించడం వల్ల కొంత వరకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇలా మనసుకు బాధ కలిగినప్పుడు ఒంటరిగా ఉండకుండా మీ ఇంట్లో వాళ్లతో మీ బాధను పంచుకోవడం, వాళ్లతో కాస్త సమయం గడపడం వల్ల.. మరింత కుంగిపోకుండా జాగ్రత్తపడచ్చు.. తద్వారా ఆ బాధను త్వరగా మర్చిపోయే అవకాశాలూ ఎక్కువే!

వాళ్ల కథలే మీకు ఉపశమనం!

ప్రాణ స్నేహితురాలితో బ్రేకప్‌.. ఇది మీ ఒక్కరి సమస్యే కాదు! మీలా మరికొంతమందికీ ఇలాంటి అనుభవం ఎదురై ఉండచ్చు. వాళ్లూ మీకంటే ఎక్కువగా బాధపడి ఉండచ్చు. మీకు తెలిసిన వారిలో అలాంటి వాళ్లెవరైనా ఉంటే.. ఆ బాధ నుంచి వాళ్లెలా బయటపడ్డారో అడిగి తెలుసుకోండి! మాకు ఎవరూ తెలియదనుకుంటే అంతర్జాలాన్ని ఆశ్రయించచ్చు. వీగిపోయిన స్నేహబంధం వల్ల కలిగిన బాధ నుంచి త్వరగా కోలుకొని తిరిగి సంతోషకరమైన జీవితం గడిపే వాళ్లకు సంబంధించిన కథలు నెట్టింట్లో బోలెడుంటాయి. వాటిని చదివి.. వీలుంటే సోషల్‌ మీడియా ద్వారా వాళ్లతో చాటింగ్‌ చేయచ్చు.. వాళ్ల సలహాలు తీసుకోవచ్చు. ఇవి కచ్చితంగా మీకు ఉపయోగపడతాయి.

ఇలా చేయచ్చు!

* స్వీయ ప్రేమ ఎలాంటి బాధ నుంచైనా మనల్ని బయటపడేయగలదని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఒంటరిగా ఫీలవకుండా మనకంటూ కాస్త సమయం కేటాయించుకోవడం, నచ్చిన పనులపై దృష్టి పెట్టడం వల్ల కొంత వరకు ప్రయోజనం ఉంటుంది.

* మనసు బాగోలేనప్పుడు మనపై మనకే కోపమొస్తుంటుంది. అలాంటప్పుడు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలై మానసిక ప్రశాంతతను అందిస్తాయని ఓ అధ్యయనంలో రుజువైంది. అందుకే బ్రేకప్‌ బాధ నుంచి విముక్తి పొందాలంటే వ్యాయామం చక్కటి ఔషధం అంటున్నారు నిపుణులు.

* ఒక్కసారి బ్రేకప్‌ అయినంత మాత్రాన ఇంకొకరితో స్నేహం చేయకూడదనుకోవడం పొరపాటు అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో గత స్నేహంలో మీ తప్పులేవైనా ఉంటే సరిదిద్దుకొని, మరోసారి అవి పునరావృతం కాకుండా చూసుకోవడం మంచిదంటున్నారు. అలాగే పూర్వపు చేదు అనుభవాలు మీ కొత్త స్నేహితులతో చెప్పడమూ తప్పు కాదు. నిజానికి ఈ పారదర్శకత ఇద్దరి మధ్య స్నేహాన్ని మరింత దగ్గర చేస్తుంది.. అలాగే మీ గురించి వారికి చెప్పకనే చెబుతుంది.

మరి, ఇన్ని చేసినా బ్రేకప్‌ బాధ నుంచి బయటపడలేకపోతున్నారా? సంతోషంగా ఉన్నప్పుడల్లా గత జ్ఞాపకాలు గుర్తొచ్చి మళ్లీ ఒత్తిడిలోకి కూరుకుపోతున్నారా? అయితే ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం అవసరం..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని